
వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్
పరిశ్రమతో సంప్రదింపుల అనంతరం దేశంలో ఆట బొమ్మల ఉత్పత్తిని (టాయ్స్) పెంచేందుకు త్వరలోనే ఓ పథకాన్ని ఖరారు చేయనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. టాయ్స్ తయారీకి, ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీఏఐ) ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు.
ప్రభుత్వం తీసుకొచ్చే పథకం ఎగుమతులకు ప్రోత్సాహకాల రూపంలో ఉండదని.. దేశీయంగా తయారీని పెంచేందుకు, ఉపాధి కల్పనకు ఊతమిస్తుందన్నారు. డిజైన్ సామర్థ్యాలు, నాణ్యతతో కూడిన తయారీ, బ్రాండ్ నిర్మాణానికి మద్దతు రూపంలో ఈ పథకం ఉంటుందని చెప్పారు. ఒకప్పుడు ఆట బొమ్మల కోసం దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడగా.. ప్రస్తుతం దేశీయంగానే పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడంతోపాటు, 153 దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. విధానపరమైన మద్దతు చర్యలు, నాణ్యతా ప్రమాణాల అమలు, స్థానిక తయారీ క్లస్టర్లను బలోపేతం చేయడం ద్వారా ఇది సాధ్యమైనట్టు వివరించారు.
140 కోట్ల జనాభా కలిగిన దేశం కావడంతో తయారీ కార్యకలాపాల విస్తరణతో సహజ ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆట బొమ్మల ఎగుమతులను పెంచుకునేందుకు చక్కని బ్రాండింగ్, ఆకర్షణీయమైన ప్యాకింగ్, బలమైన డిజైన్‌పై దృష్టి సారించాలని పరిశ్రమకు గోయల్ సూచించారు. వినూత్నమైన ఆట»ొమ్మల నమనాలను అభివృద్ధి చేసిన స్టార్టప్‌లకు పీఎం ముద్రాయోజన కింద పెద్ద ఎత్తున నిధుల మద్దతు అందించినట్టు చెప్పారు.