ఎంతటి దుర్భర పరిస్థితి? చందా కొచ్చర్‌కు సుప్రీం కోర్టులోనూ తప్పని నిరాశ | SC Refuses Chanda Kochhar Plea Against ICICI Bank On Retirement Benefits, See Details - Sakshi
Sakshi News home page

Chanda Kochhar: ఎంతటి దుర్భర పరిస్థితి? చందా కొచ్చర్‌కు సుప్రీం కోర్టులోనూ తప్పని నిరాశ

Published Fri, Dec 8 2023 4:36 PM

SC refuses Chanda Kochhar plea against ICICI Bank on retirement benefits - Sakshi

దేశ బ్యాంకింగ్‌ రంగంలో ప్రత్యేక గుర్తింపుతో అగ్రస్థానానికి ఎదిగి సంచలనం సృష్టించిన ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్ కుంభకోణంలో ఇరుక్కుని కేసులను ఎదుర్కొంటూ తన పదవీ విరమణ ప్రయోజనాలు ఇప్పించాలని కోర్టుల చుట్టూ తిరుగుతోంది. 

ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్ సుప్రీం కోర్టులోనూ తీవ్ర నిరాశే ఎదురైంది. బ్యాంకు నుంచి తన పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించి చందా కొచ్చర్ దాఖలు చేసిన అప్పీల్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు డిసెంబర్‌ 8న నిరాకరించింది. 

ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం చందా కొచ్చర్‌ గతంలో బాంబే హైకోర్టులో మధ్యంతర పిటిషన్‌ వేయగా డివిజన్‌ ​​బెంచ్‌ తిరస్కరించింది. తాజాగా ఆ డివిజన్‌ బెంచ్‌ నిర్ణయాన్నే  సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. కొచ్చర్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. బాంబే హైకోర్టు తీర్పు అన్యాయమని, బ్యాంకు మొదట్లో కొచ్చర్‌కు రిటైర్‌మెంట్ ప్రయోజనాలను అందించేందుకు అంగీకరించి తర్వాత వెనక్కితీసుకుందని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

ఈ ఏడాది మే నెలలో ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి పదవీ విరమణ ప్రయోజనాలను కోరుతూ ఆమె చేసిన మధ్యంతర దరఖాస్తును తిరస్కరించిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. 

ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో పదవి నుంచి చందా కొచ్చర్‌ తొలగింపును సమర్థించిన బాంబే హైకోర్టు దీనిపై ఆమె వేసిన పదవీ విరమణ ప్రయోజనాల కోసం​ ఆమె వేసిన మధ్యంతర పిటిషన్‌ను గతేడాది నవంబర్‌లో కొట్టేసింది. 2018లో ఆమె దక్కించుకున్న 6.90 లక్షల షేర్లతో ఆమెకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

2018 మేలో తనపై విచారణ ప్రారంభం కాగానే చందా కొచ్చర్‌ సెలవుపై వెళ్లిపోయారు. ఆ తరువాత ముందస్తు రిటైర్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని ఆమోదించిన ఐసీఐసీఐ బ్యాంక్‌ టెర్మినేషన్ ఫర్ కాజ్'గా పరిగణించి ఆర్బీఐ నుంచి అనుమతి కూడా కోరినట్లు తెలిపింది.

కాగా 2019 జనవరిలో దాఖలు చేసిన చార్జిషీట్‌లో చందా కొచ్ఛర్ ఆధ్వర్యంలోని ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ విధానాలను ఉల్లంఘించి వీడియోకాన్‌కు రుణాలు మంజూరు చేసిందని సీబీఐ పేర్కొంది. ఈ రుణాలు తరువాత నిరర్థక ఆస్తులుగా మారాయని, ఫలితంగా బ్యాంకుకు తప్పుడు నష్టం, రుణగ్రహీతకు, నిందితులకు తప్పుడు లాభం కలిగిందని సీబీఐ అభియోగం మోపిన సంగతి తెలిసిందే.

 
Advertisement
 
Advertisement