
ఎక్కడైనా ఉద్యోగులకు జీతాలు పెంచితే సంబరపడిపోతారు. అయితే పెంచిన జీతాన్ని.. తిరిగి ఇచ్చేయమంటే?, వినటానికి వింతగా, కష్టంగా అనిపించినా.. ప్రముఖ ఐరిష్ విమానయాన సంస్థ 'ర్యాన్‌ఎయిర్' (Ryanair) ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ వివరంగా చూసేద్దాం..
ర్యాన్‌ఎయిర్ సంస్థ.. పెంచిన జీతాలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించడంతో ఉద్యోగులు ఖంగుతిన్నారు. జీతాల పెంపు తరువాత ఒక్కో ఉద్యోగి 3400 డాలర్లు (రూ. 2.9 లక్షలు) అందుకున్నారు. ఆ మొత్తాన్ని తిరిగి కంపెనీ ఖాతాలో జమ చేయాలని, లేకుంటే.. ప్రతి నెలా జీతంలో కోతలు విధించాల్సి ఉంటుందని వెల్లడించింది.
నిజానికి ర్యాన్‌ఎయిర్ ఉద్యోగులకు సంబంధించి.. సీసీఓఓ (CCOO), యూఎస్ఓ (USO) అనే రెండు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. వేతనాల పెంపుకు సంబంధించిన సీసీఓఓతో మాట్లాడి.. జీతాలను పెంచింది. కానీ ఈ నిర్ణయంపై యూఎస్ఓ.. కోర్టు మెట్లు ఎక్కింది. జీతాల పెంపు విషయంలో ర్యాన్‌ఎయిర్.. 'సీసీఓఓ'తో చేసుకున్న ఒప్పందం కుదరదని కోర్టు తీరునిచ్చింది. దీంతో చేసేదేమీ లేక కంపెనీ ఉద్యోగులకు నోటీసులు పంపిస్తూ.. పెంచిన జీతాలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: 'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకి
కంపెనీ చర్యలపై న్యాయపోరాటం చేస్తామని.. కార్మిక సంఘం ప్రతినిధి 'ఎస్టర్ పెయ్రో గాల్డ్రాన్' పేర్కొన్నారు. అయితే.. ర్యాన్‌ఎయిర్ మాత్రం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉన్నామని, ఆ తీరు కారణంగానే నోటీసులు జరీ చేయాల్సి వచ్చిందని పేర్కొంది.