పెరుగుతున్న రూపాయి మారక విలువ.. కారణం ఇదేనా.. | Know The Reasons Behind Why The Rupee Value Increased Against US Dollar, See Details Inside - Sakshi
Sakshi News home page

పెరుగుతున్న రూపాయి మారక విలువ.. కారణం ఇదేనా..

Published Sat, Dec 16 2023 2:01 PM

Rupee Value Hike These Are The Reasons - Sakshi

ఇటీవల రూపాయి విలువ జీవన కాల కనిష్ఠానికి చేరింది. గతవారం స్టాక్‌మార్కెట్లు పుంజుకుంటున్న నేపథ్యంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మెరుగవుతుంది.

విదేశాల నుంచి మూలధన పెట్టుబడులు దేశీయ మార్కెట్‌లోకి రావడం, అంతర్జాతీయంగా అమెరికన్‌ కరెన్సీ బలాన్ని కోల్పోవడం ఇందుకు కారణాలుగా నిలుస్తున్నాయి. అన్నిటికంటే మించి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం సెంటిమెంటును పుంజుకునేలా చేశాయని ఫారెక్స్‌ ట్రేడర్లు చెబుతున్నారు.  

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల ధోరణి కనిపించడంతో రూపాయికి బలం చేకూరిందని ఫారెక్స్‌ ట్రేడర్లు అంటున్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం భారీగా కోలుకుంది. దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నమోదైన రికార్డుస్థాయి లాభాలు, విదేశీ మదుపరుల నుంచి కొనసాగుతున్న పెట్టుబడులు, ఇతరత్రా ఫారిన్‌ ఫండ్స్‌తో ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపీ ఆకర్షణీయంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక్కరోజే ఏకంగా 27 పైసలు ఎగిసి 83.03 వద్ద స్థిరపడింది. స్టాక్‌ మార్కెట్లలో సాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు.. రూపీ సెంటిమెంట్‌ను బలపర్చాయని ఫారెక్స్‌ డీలర్లు చెప్తున్నారు. 

కాగా, శుక్రవారం ఉదయం ఆరంభంలో 83.30 వద్ద మొదలైన రూపాయి మారకం విలువ.. ఒక దశలో 83.32 స్థాయికి నష్టపోయింది. అలాగే మరొక దశలో 82.94 స్థాయికి పుంజుకుంది. ఈ క్రమంలోనే చివరకు 83.03 వద్ద నిలిచింది. ఇక ఈ వారం మొత్తంగా రూపీ 37 పైసలు పుంజుకుంది. అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ క్రితం ముగింపుతో పోల్చితే దాదాపు స్థిరంగా 101.01 వద్దే ఉంది. వచ్చే ఏడాది వడ్డీరేట్లను తగ్గిస్తామంటూ ఇటీవలి ద్రవ్యసమీక్షలో ఫెడ్‌ రిజర్వ్‌ ఇచ్చిన సంకేతాలు.. గురువారం పదేళ్ల అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ను 4 శాతం దిగువకు కుంగాయి.

ఇదీ చదవండి: ఏజెంట్లకు భారీగా గ్రాట్యుటీ పెంచిన ఎల్‌ఐసీ.. ఎంతంటే..

Advertisement
 
Advertisement