
అన్నీ అనుకూలిస్తేనే లాభాలు
తేడా వస్తే తేరుకోలేనంత నష్టం
లాభం కోసం రిస్క్ మరవొద్దు
లిస్టింగ్ అయిన వెంటనే విక్రయించుకోలేరు
ఆరు నెలల పాటు వేచిచూడాల్సిందే
లావాదేవీలకు దూరంగా ఉండాలంటున్న సెబీ
నిపుణులదీ హెచ్చరిక స్వరమే..
పేరున్న కంపెనీ ఐపీవోకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వస్తోందంటే ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగిపోతుంది. అదృష్టాన్ని పరీక్షించుకుందామని పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేస్తుంటారు. ఐపీవోలో షేర్లు దక్కని వారు లిస్టింగ్ తర్వాత కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇవన్నీ కలసి స్టాక్ వ్యాల్యూయేషన్లను అమాంతం పెంచేస్తుంటాయి. లిస్టింగ్‌లోనే లాభాలు కురుస్తుండడంతో ఐపీవోలకు ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ ఎగబాగుతోంది.
కొందరు ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకుని మరీ.. ఐపీవోకు రావడానికి ముందుగానే ఆయా కంపెనీల షేర్లను అన్‌లిస్టెడ్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్న ధోరణి ఇటీవల విస్తరిస్తోంది. కానీ, అందరికీ ఇది అనుకూలం కాదు. రెగ్యులర్ మార్కెట్లకు మించి అన్‌లిస్టెడ్ మార్కెట్లో రెట్టింపు రిస్క్ ఎదురుకావొచ్చు. పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే పెట్టుబడుల నిర్ణయం తీసుకోవాలన్నది నిపుణుల సూచన. – సాక్షి, బిజినెస్ డెస్క్
వన్97 కమ్యూనికేషన్స్ నుంచి స్విగ్గీ వరకు.. అంతెందుకు తాజాగా లిస్టయిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్విసెస్ సైతం అన్‌లిస్టెడ్ మార్కెట్లో మంచి డిమాండ్ పలికినవే. ముందుగా ఇన్వెస్ట్ చేసినట్టయితే లిస్టింగ్ సమయానికి మంచి లాభాలు కళ్లజూడొచ్చన్న ఉద్దేశంతో కొందరు అన్‌లిస్టెడ్ మార్కెట్లో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ, అన్ని సందర్భాల్లోనూ లిస్టింగ్ సమయానికి కంపెనీల విలువలు పెరుగుతాయని కచ్చితంగా చెప్పలేం. పడిపోవడం కూడా జరగొచ్చు. ఇందుకు నిదర్శనం హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్విసెస్.
చేదు అనుభవాలు..!
అన్‌లిస్టెడ్ మార్కెట్లో కోట్ అయ్యే షేర్ల ధరలు కంపెనీ వాస్తవ విలువలను ప్రతిబింబించవు. ఎందుకంటే అక్కడ షేర్ల సరఫరా పరిమితంగా ఉంటుంది. కొద్ది డిమాండ్‌కే ధరలు అమాంతం ఎగబాకొచ్చు. ఇందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్టెడ్ కంపెనీల విలువలు వాటి ఆరి్థక మూలాలను ప్రతిఫలిస్తుంటాయి. బుల్‌ర్యాలీలో అతిగా పెరిగినప్పటికీ తర్వాత దిద్దుబాటుతో దిగొస్తుంటాయి. రోజువారీ ట్రేడింగ్ వ్యాల్యూమ్ చెప్పుకోతగ్గ స్థాయిలో ఉంటుంది. అన్‌లిస్టెడ్ మార్కెట్ అలా కాదు. కేవలం కొద్దిపాటి సరఫరా ధరలను నిర్ణయిస్తుంటుంది. ఆ సరఫరా కూడా కొద్ది మంది బ్రోకర్ల పరిధిలోనే ఉంటే వారికి నచ్చిన విధంగా మానిప్యులేషన్ చేసే అవకాశం లేకపోలేదు.
అధిక ధరల్లో కొనుగోలు చేస్తే, రాబడుల సంగతేమో కానీ, పెట్టుబడిని రాబట్టుకోవడానికే ఏళ్ల తరబడి వేచి చూడాల్సి రావచ్చు. వన్97 కమ్యూనికేషన్స్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్, రిలయన్స్ రిటైల్ షేర్లు అన్‌లిస్టెడ్ మార్కెట్ ఇన్వెస్టర్లకు మిగిల్చిన చేదు అనుభవాల గురించి తప్పక తెలుసుకోవాలి. ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్విసెస్ ఐపీవో ఇటీవలే ముగిసింది. ఒక్కో షేరును రూ.740కే కేటాయించింది. కానీ, ఐపీవో ముందు వరకు అన్‌లిస్టెడ్ మార్కెట్లో ఒక్కో షేరు రూ.1400 ధర పలికింది. లిస్టింగ్‌కు ఏడాది ముందు కాలంలో రూ.700–1,400 మధ్య కదలాడింది.
రూ.1,400 ధరపై కొనుగోలు చేసిన వారు తాజా ఐపీవో ధర ప్రకారం 40% నష్టపోయినట్టు తెలుస్తోంది. కంపెనీ మంచి పనితీరు చూపిస్తే కొంత కాలానికి షేరు ధర కోలుకుంటుందని ఆశించొచ్చు. అన్‌లిస్టెడ్ ధర కంటే తక్కువకే ఇప్పుడు ఎక్సే్ఛంజ్‌ల్లో లభిస్తుండడాన్ని ఇన్వెస్టర్లు ఒక గుణపాఠంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. టాటా టెక్నాలజీస్ ఐపీవో విషయంలోనూ ఇలాంటి పరిణామమే జరిగింది. 2023 నవంబర్‌లో టాటా టెక్నాలజీస్ ఐపీవోకు వచ్చింది. ఒక్కో షేరు ధరను రూ.475–500గా ఖరారు చేసింది. కానీ, అప్పటికి అన్‌లిస్టెడ్ మార్కెట్లో ఒక్కో షేరు ధర రూ.1,010–1,100 స్థాయిలో ట్రేడయ్యింది.
పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ విషయంలో ఇన్వెస్టర్లకు చేదు అనుభవమే ఎదురైంది. 2021లో వన్97 కమ్యూనికేషన్స్ ఐపీవోకి రాగా.. ఒక్కో షేరును రూ.2,150కు కేటాయించింది. లిస్టింగ్ రోజే కాదు, ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ ధరకే చేరుకోలేదు. ఐపీవోకి ముందు అన్‌లిస్టెడ్ మార్కెట్లో రూ.2,800 వరకు ట్రేడయ్యింది. ఇక అన్‌లిస్టెడ్ మార్కెట్లో అధిక ధర పెట్టి రిలయన్స్ రిటైల్ షేర్లను కొనుగోలు చేసిన వారికి రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద షాకిచ్చింది. 2023లో మైనారిటీ షేర్ హోల్డర్ల వద్దనున్న వాటాలను ఒక్కోటీ రూ.1,362 చొప్పున కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది.
అన్‌లిస్టెడ్ మార్కెట్లో అప్పటికి ఒక్కో షేరు రూ.2,700 ధర వద్ద ట్రేడవుతోంది. దీన్ని బట్టి అన్‌లిస్టెడ్ మార్కెట్లో ధరలు సహేతుక స్థాయిలో ఉండవన్న విషయం సుస్పష్టం. అన్‌లిస్టెడ్ మార్కెట్లో ధరల ఆధారంగా కంపెనీలు ఐపీవో ధరను నిర్ణయించవ ని అర్థం చేసుకోవాలి. అప్పటి మార్కెట్ పరిస్థితులు, ఇన్వెస్టర్లలో ఆసక్తికి అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌లు, లీడ్ మేనేజర్లు షేర్ల ధరల శ్రేణిని నిర్ణయిస్తుంటాయి. కనుక ఐపీవోకి ముందే కొనుగోలు చేయడం ద్వారా లాభం పొందుతామన్న గ్యారంటీ ఉండదని ఈ నిదర్శనాలను చూసి అర్థం చేసుకోవాలి.
రిస్క్ లను పరిశీలించాలి..
అన్‌లిస్టెడ్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు చిక్కుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ‘అన్‌లిస్టెడ్ మార్కెట్లో షేర్ల ధరలు పారదర్శకంగా ఉండవు. సెంటిమెంట్, కంపెనీకి సంబంధించి ప్రచారం, అంతర్గత సమాచారం ఆధారంగా మానిప్యులేషన్ (కృత్రిమంగా ధరలను ప్రభావితం చేయడం)కు అవకాశం ఉంటుంది. లిక్విడిటీ మరో పెద్ద సమస్య. అవసరమైనప్పుడు సులభంగా కొనుగోలు, విక్రయం సాధ్యపడదు. లావాదేవీలను ఎక్సే్ఛంజ్ ద్వారా కాకుండా మధ్యవర్తుల సాయంతో చేయాల్సి ఉంటుంది. ఇందులో పారదర్శకత ఉండదు. పెట్టుబడి మొత్తాన్ని ముందుగానే చెల్లించినప్పటికీ షేర్లను డెలివరీ చేయకపోవచ్చు. ఇంతటితో రిస్క్ లు ముగియలేదు. కంపెనీల విలువలను మదింపు వేయడం కూడా కష్టమే.
అన్‌లిస్టెడ్ కంపెనీలు లిస్టెడ్ కంపెనీల మాదిరి కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెల్లడించవు. కనుక ఆయా కంపెనీల వ్యాపారం, నిర్ణయాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కష్టం. పైగా సంబంధిత కంపెనీ ఎప్పటికీ లిస్టింగ్‌కు రాకపోతే అందులో పెట్టుబడి నిలిచిపోవచ్చు. ని ధుల సమీకరణ కోసం మరిన్ని షేర్లను జారీ చే స్తూ వెళుతుంటే అప్పటికే ఉన్న షేర్ల ధరల్లో సర్దుబాటు ఉంటుంది’ అని ఆనంద్‌రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ నరేంద్ర సోలంకి వివరించారు. పైగా వీటిపై సెబీ పర్యవేక్షణ ఉండదన్న విషయాన్ని గుర్తు చేశారు.
జెరోదా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ సైతం ఎక్స్ వేదికగా ఇటీవలే దీనిపై ఇన్వెస్టర్లను హెచ్చరిస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టారు. చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు లిస్టింగ్‌తో లాభాలు పొందొచ్చన్న ధోరణితో కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు. హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్విసెస్ ఐపీవోను ప్రస్తావించారు. పారదర్శకత లేమి, తక్కువ లిక్విడిటీ (షేర్ల లభ్యత), నియంత్రణల మధ్య పనిచేయకపోవడం వల్ల రెగ్యులర్ స్టాక్ మార్కెట్‌తో పోల్చితే అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో రిస్క్ ఎంతో ఎక్కువని హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని, పెట్టుబడికి ముందు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సూచించారు.
స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సైతం ఈ విషయమై ఇన్వెస్టర్లకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అన్‌లిస్టెడ్ సెక్యూరిటీలు లేదా అన«దీకృత ఎల్రక్టానిక్ ప్లాట్‌ఫామ్‌ల్లో లావాదేవీలకు దూరంగా ఉండాలని సూచించింది. ఆయా ప్లాట్‌ఫామ్‌లలో సెక్యూరిటీల లావాదేవీలకు సెబీ అనుమతి లేదని.. సెక్యూరిటీల చట్టం 1956కు విరుద్ధంగా అవి నడుస్తున్నట్టు పేర్కొంది.
విలువలు కీలకం..
రిలయన్స్ రిటైల్ ఉద్యోగులకు కేటాయించిన స్వల్ప వాటాలను వారు అన్‌లిస్టెడ్ మార్కెట్లో విక్రయించడంతో.. సరఫరా పరిమితంగా ఉండి ధర విపరీతంగా పెరిగిపోయింది. 2019లో రూ.400 వద్దనున్న షేరు 2021 నాటికే రూ.4,000కి పెరిగిపోవడం గమనార్హం. చివరికి 2023లో ఒక్కో షేరుకు రిలయన్స్ కట్టిన ధర రూ.1,362. ఆరంభంలో కొనుగోలు చేసి ఉంటే, ఈ ధరపైనా మంచి లాభమే వచ్చి ఉండేది. కంపెనీ ఆరి్థక మూలాలను అనుసరించి, సహేతుక ధరల వద్ద అన్‌లిస్టెడ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నష్టాన్ని నివారించొచ్చు.
కానీ, అన్‌లిస్టెడ్ మార్కెట్లో డిమాండ్ లేని షేర్లే సహేతుక ధరల వద్ద లభిస్తుంటాయి. క్రేజీ షేర్లు ఎప్పుడు అసాధారణ ధరలపైనే ట్రేడవుతుంటాయి. వారీ ఎనర్జీస్ ఒక్కో షేరు ధర అన్‌లిస్టెడ్ మార్కెట్లో రూ.2,500 ఉంటే కంపెనీ ఐపీవోలో నిర్ణయించిన ధర రూ.1,500. కానీ, ఒక్కో షేరు రూ.2,500 వద్ద లిస్ట్ అయింది. ఇప్పుడు రూ.3,000కు పైనే ట్రేడవుతోంది. ఇలా ఒక్కో కంపెనీకి సంబంధించి అనుభవం వేర్వేరుగా ఉంటుంది. కనుక మంచి యాజమాన్యం, వ్యాపారపరమైన బలాలు, పటిష్టమైన ఆరి్థక మూలాలు కలిగి, ఆకర్షణీయమైన విలువల వద్ద లభిస్తేనే అన్‌లిస్టెడ్ మార్కెట్లో పెట్టుబడులను పరిశీలించొచ్చు. ఆల్టీయస్ ఇన్వెస్టెక్, ఇన్‌క్రెడ్ మనీ, అన్‌లిస్టెడ్ జోన్ ఇలా పదుల సంఖ్యలో బ్రోకర్లు అన్‌లిస్టెడ్ మార్కెట్లో కీలకంగా పనిచేస్తున్నారు.
ధరల్లో అస్థిరతలు
రెగ్యులర్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో రోజువారీ కొనుగోలు, విక్రయ లావాదేవీలను సులభంగా నిర్వహించుకోవచ్చు. సెబీ పర్యవేక్షణ లేని అన్‌లిస్టెడ్ మార్కెట్లో లావాదేవీల పూర్తికి కొన్ని రోజుల సమయం పడుతుంది. సంప్రదాయ స్టాక్ బ్రోకర్లు సెబీ నియంత్రణల కింద పనిచేస్తుంటారు. కనుక ముందస్తుగా చేసే చెల్లింపులకు భరోసా ఉంటుంది. అన్‌లిస్టెడ్ మార్కెట్లో కొనుగోలుకు సరిపడా మొత్తాన్ని ముందుగానే మధ్యవర్తుల ఖాతాలకు పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు షేర్లను డెలివరీ చేస్తారు. షేర్లు విక్రయించాలనుకుంటే ముందుగా షేర్లను వారి ఖాతాకు బదిలీ చేయాలి. ఆ తర్వాత నగదు బదిలీ చేస్తారు. బ్రోకర్ విశ్వసనీయతపైనే లావాదేవీల సాఫల్యత ఆధారపడి ఉంటుంది. బ్రోకర్ చేతులెత్తేస్తే న్యాయపరంగా పోరాడడం మినహా మరో మార్గం ఉండదు. పైగా అమ్మకం, కొనుగోలు ధరకు మధ్య వ్యత్యాసం కనిపిస్తుంటుంది. ఈ వ్యత్యాసమే బ్రోకర్లకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.
ఆరు నెలలు వెయిటింగ్..
ఐపీవోకి ముందు అన్‌లిస్టెడ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి, లిస్టింగ్ తర్వాత విక్రయించి లాభం పోగేసుకుందామని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే లిస్టింగ్ అయిన నాటి నుంచి ఆరు నెలల తర్వాతే వారు విక్రయించుకోగలరు. ఆరు నెలల లాకిన్ పీరియడ్ అమల్లో ఉంటుంది. ఐపీవోకి ముందు ఇన్వెస్ట్ చేసిన వారు అంతకాలం ఆగిన తర్వాతే సెక్యూరిటీలను విక్రయించుకోగలరు. అప్పటికి స్టాక్ ధర ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. ఓయో కంపెనీ గత రెండేళ్లుగా ఐపీవో సన్నాహాలతో ఉంది. ఎప్పటికప్పుడు ఐపీవో వాయిదా పడుతోంది. కనుక త్వరలో ఐపీవోకి వస్తే విక్రయించుకోవచ్చన్న ఆశయంతో పెట్టుబడులు పెట్టేయడం సరికాదు.
డిమాండ్ ఉన్న షేర్లలో చెన్నై సూపర్ కింగ్స్ షేరు ఒకటి. కానీ ఎప్పుడు ఐపీవోకి వస్తుందో తెలియని పరిస్థితి. ‘వ్యాపార పరంగా నిరూపించుకుని, స్టాక్ మార్కెట్లో సహేతుక వ్యాల్యుయేషన్ల వద్ద ఎన్నో కంపెనీలు అందుబాటులో ఉండగా, క్రేజీ వ్యాల్యుషన్లతో అన్‌లిస్టెడ్ మార్కెట్లో తక్కువ లిక్విడిటీతో ట్రేడ్ అవుతున్న వాటి జోలికి పోవడం ఎందుకు?’ అని స్ట్రేజీ స్టార్టప్ సీఈవో మోహిత్ భండారీ ప్రశి్నంచారు. ఆరంభ స్థాయి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే, అందుకు ఏంజెల్ ఇన్వెస్టింగ్ మంచి మార్గమని సూచించారు.