
15 శాతం వృద్ధితో 18.6 బిలియన్ డాలర్లకు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) 15 శాతం ఎగశాయి. వెరసి ఏప్రిల్–జూన్(క్యూ1)లో 18.62 బిలియన్ డాలర్లను తాకాయి. వీటిలో యూఎస్ నుంచి మూడు రెట్లు అధికంగా 5.61 బిలియన్ డాలర్లు తరలి వచ్చాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024–25 క్యూ1లో 16.17 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు నమోదయ్యాయి.
ఈక్విటీ పెట్టుబడులుసహా మొత్తం ఎఫ్‌డీఐలు 25.2 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది క్యూ1లో 22.5 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు లభించాయి. టారిఫ్ సవాళ్లున్నప్పటికీ యూఎస్ నుంచి అత్యంత భారీగా 5.61 బిలియన్ డాలర్లు తరలి వచ్చాయి. గత క్యూ1లో ఇవి కేవలం 1.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఈ ఏడాది క్యూ1లో ప్రధానంగా సింగపూర్ నుంచి 4.59 బిలియన్ డాలర్లు, మారిషస్ నుంచి 2.08 బిలియన్ డాలర్లు, సైప్రస్ నుంచి 1.1 బిలియన్ డాలర్లు, యూఏఈ నుంచి బిలియన్ డాలర్లు చొప్పున లభించాయి.
కాగా.. 2000 ఏప్రిల్ నుంచి 2025 జూన్‌వరకూ చూస్తే 76.26 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో యూఎస్ మూడో ర్యాంకులో నిలవగా.. 182.2 బిలియన్ డాలర్లతో మారిషస్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ బాటలో సింగపూర్ 179.48 బిలియన్ డాలర్లతో రెండో పెద్ద ఇన్వెస్టర్‌గా నిలిచింది.
రంగాలవారీగా చూస్తే
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పలు రంగాలలోకి విదేశీ పెట్టుబడులు ప్రవహించాయి. ప్రధానంగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ 5.4 బిలియన డాలర్లను ఆకట్టుకోగా.. సర్వీసులు 3.28 బిలియన్ డాలర్లు, ఆటోమొబైల్ 1.29 బిలియన్ డాలర్లు, సంప్రదాయ ఇంధనం 1.14 బిలియన్ డాలర్లు, ట్రేడింగ్ 50.6 కోట్ల డాలర్లు, కెమికల్స్ 14 కోట్ల డాలర్లు, టెలికమ్యూనికేషన్లు 2.4 కోట్ల డాలర్లు చొప్పున అందుకున్నాయి.
ఇక రాష్ట్రాలవారీగా చూస్తే కర్ణాటక అత్యధికంగా 5.69 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను సమకూర్చుకుంది. జాబితాలో తదుపరి మహారాష్ట్రకు 5.36 బిలియన్ డాలర్లు, తమిళనా డుకు 2.67 బిలియన్ డాలర్లు, గుజరాత్‌కు 1.2 బిలియన్ డాలర్లు, హర్యానాకు 1.03 బిలియన్ డాలర్లు, ఢిల్లీకి బిలియన్ డాలర్లు చొప్పున లభించాయి.