
దీపావళి పండగకి సంబంధించి తినుబండారాల కోణంలో మార్కెట్లను అభివర్ణించాల్సి వస్తే .. జిలేబీగా అభివర్ణించవచ్చు. అవును, మార్కెట్లు కూడా జిలేబీలాగే మెరిసిపోతూ, వంకర్లు తిరుగుతూ, అనూహ్యమైన విధంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవాలంటే బోలెడంత సహనం ఉండాల్సిందే.
జిలేబీ ఆకారంలాగే ఈ ఏడాదంతా అంతర్జాతీయంగా ఒడిదుడుకులు, వడ్డీ రేట్ల అంచనాల్లో మార్పులు, భౌగోళికరాజకీయపరంగా ఆశ్చర్యపర్చే పరిణామాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో రణగొణ ధ్వనులతో గడిచింది. అయినప్పటికీ ప్రశాంతంగా, పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లకు చాలా తియ్యని అనుభవాలే ఎదురయ్యాయి. స్పెక్యులేషన్‌కి పోకుండా క్రమశిక్షణతో ఉంటూ, ఓర్పు వహించినందుకు బహుమతిగా చిన్న చిన్న విజయాలు, నేర్చుకునే అవకాశాలు లభించాయి.
ఈ ఏడాది బంగారం, వెండి టపాసుల్లాగా పేలాయి. సంప్రదాయ సిద్ధంగా సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడి తన పాత్రను చక్కగా పోషించింది. అనిశ్చితి నెలకొన్న తరుణంలో స్థిరత్వాన్ని అందించింది. ఒక్కసారిగా ఎగిసిన వెండి దీనికి మరింత హంగులు దిద్దింది. పాతతరం వివేకం, కొత్త తర పు ఉత్సాహం రెండూ కూడా కలిసి మెరిసేందుకు అవకాశం ఉందని ఇవి తెలియజేశాయి. అవకాశం, భద్రత మధ్య సమతుల్యతను పాటించడమే పోర్ట్‌ఫోలియో పటిష్టతకు కీలకమని తెలియజేశాయి.
ఒకవేళ దీపావళి బహుమతులను తనదైన ప్రత్యేకత ఉన్న అసెట్ క్లాస్‌గా వరి్ణంచాల్సి వస్తే బంగారాన్ని వారసత్వ నెక్లెస్‌గా అభివరి్ణంచవచ్చు. కాలాతీతమైనదై, భావోద్వేగాలతో కూడుకున్నదై, తరతరాలుగా తన విలువను కాపాడుకుంటూ వస్తోంది పసిడి. ఇక బాండ్లను డ్రై ఫ్రూట్ బాక్సుగా అభివర్ణించవచ్చు. ఆకట్టుకునే మెరుపులు ఉండకపోయినా, ఇవి నమ్మకమైనవిగా, నిశ్శబ్దంగా అండగా నిలుస్తాయి.
ఈక్విటీల విషయానికొస్తే.. ఇంట్లో తయారు చేసిన స్వీట్లలాంటి. చాలా ఓపిగ్గా, నమ్మకంతో, ఆశాభావంతో ఇవి తయారవుతాయి. అప్పుడప్పుడు గందరగోళంగా అనిపించినా ఆ తర్వాత చాలా సంతృప్తిని కలిగిస్తాయి. మరి క్రిప్టో విషయమేంటి? ఇవి పక్కింటివాళ్ల డ్రోన్ షో లాంటివి. చాలా ఆర్భాటంగా, పట్టించుకోకుండా ఉండలేని విధంగా ఉంటాయి. కానీ వీటిని కాస్త సురక్షితమైన దూరం నుంచే ఆస్వాదించడం మేలు.
సంక్షోభ సమయాల్లోనే పసిడి రాణిస్తుందనే అపోహ ఒకటుంది. ఈ పండుగ సీజన్‌లో దాన్నుంచి బైటపడాలి. వాస్తవానికి బంగారమంటే, మార్కెట్లు బాగా లేనప్పుడు నీడనిచ్చే సాధనం మాత్రమే కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్నికూడా అందిస్తుంది.
పర్ఫెక్ట్ దీపావళి పోర్ట్‌ఫోలియో ఎలా ఉంటుందంటే.. సమతూకంగా గల మల్టీ–అసెట్ థాలీలాగా ఉంటుంది. వృద్ధి కోసం ఈక్విటీలు .. స్థిరత్వం కోసం పసిడి .. క్రమశిక్షణ కోసం బాండ్లు .. ఇక సమర్ధత, డైవర్సిఫికేషన్, ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ కోసం మ్యుచువల్ ఫండ్‌లో చక్కగా చుట్ట చుట్టినట్లుగా ఉంటుంది.
సాధారణంగా పండుగల సందర్భంలో మార్కెట్ సెంటిమెంటు ఉత్సాహంగా ఉంటుంది. కానీ, ఊదరగొట్టే అన్‌లిస్టెడ్ ఐడియాలు, సైక్లికల్ థీమ్‌లు ఇక ముగింపు దశకొస్తున్నాయనే వార్తలు, ‘దీపావళి టిప్’ స్టాక్‌లు మొదలైన వాటి విషయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్లు ఉత్సాహభరిత వాతావరణాన్ని ప్రతిబింబించవచ్చు కానీ అంతిమంగా మాత్రం ఎమోషన్లను కాకుండా ఆదాయాలనే ఫాలో అవుతాయి.
వచ్చే దశాబ్దకాలం కోసం పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవడమే ఈ దీపావళికి మీకు మీరు ఇచ్చుకునే అత్యుత్తమ బహుమతి అవుతుంది. ఎందుకంటే సిసలైన సంపద కూడా, అందమైన రంగవల్లిలాంటిదే. ఓ లక్ష్యం పెట్టుకుని, ఎంతో ఓపిగ్గా, సమతూకాన్ని పాటిస్తూ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నాళ్లకి దీపం కొండెక్కినా, ఈ సుగుణాలే దీర్ఘకాలం పాటు నిలిచి ఉంటాయి.
