
డీల్ విలువ రూ. 4,150 కోట్లు
ముంబై: దేశీ లిక్కర్ కంపెనీ తిలక్‌నగర్ ఇండస్ట్రీస్ తాజాగా సుప్రసిద్ధ విస్కీ బ్రాండ్ ఇంపీరియల్ బ్లూను సొంతం చేసుకోనుంది. ఇందుకు ఫ్రెంచ్ లిక్కర్ దిగ్గజం దేశీ యూనిట్ పెర్నాడ్ రికార్డ్ ఇండియాతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. డీల్ ప్రకారం రూ. 4,150 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువలో కొనుగోలు చేయనుంది. దీనిలో రూ. 282 కోట్లు లావాదేవీ ముగిసిన నాలుగేళ్ల తదుపరి చెల్లించేందుకు వీలుంది. డీల్ వివరాలను రెండు సంస్థలూ వెల్లడించాయి.
కాగా.. ఈ డీల్ ద్వారా పాప్యులర్ బ్రాందీ బ్రాండ్ మ్యాన్షన్ హౌస్‌ను ఉత్పత్తి చేసే తిలక్‌నగర్ విస్కీ విభాగంలోనూ సుప్రసిద్ధ బ్రాండ్‌ను సొంతం చేసుకోనుంది. వెరసి దేశీ తయారీ విదేశీ మద్యం(ఐఎంఎఫ్‌ఎల్) విభాగంలో రెండు భారీ బ్రాండ్లను విక్రయించేందుకు వీలు చిక్కనుంది. అమ్మకాల పరిమాణంరీత్యా ఇంపీరియల్ బ్లూ దేశీయంగా మూడో పెద్ద విస్కీ బ్రాండ్‌గా నిలుస్తోంది. గతేడాది(2024–25) రూ. 3,067 కోట్ల అమ్మకాలు సాధించింది. రెండు సొంత యూనిట్లు, బాట్లింగ్ సహతయారీ సర్వీసులు డీల్‌లో భాగంకానున్నాయి.
షేరు పరుగు..
కొనుగోలు వార్తల నేపథ్యంలో తిలక్‌నగర్ ఇండస్ట్రీస్ షేరు గత కొద్ది రోజులుగా బలపడుతూ వస్తోంది. తాజాగా బీఎస్‌ఈలో 0.7 శాతం లాభపడి రూ. 473 వద్ద ముగిసింది. గత నెల రోజుల్లో 30 శాతంపైగా లాభపడటం గమనార్హం! ఈ ఏప్రిల్ 7న రూ. 205 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకిన షేరు మంగళవారానికల్లా(22న) రూ. 488 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది!!