
సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు
రూ. 1,000 కోట్లపై కన్ను
న్యూఢిల్లీ: విత్తనాలు, సస్య రక్షణ రంగ కంపెనీ ఎల్‌డొరాడో అగ్రిటెక్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ ఐపీవోలో భాగంగా రూ. 340 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా రూ. 660 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు.
వీటిలో రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని శ్రీనివాసరావు లింగ, రూ. 160 కోట్ల విలువైన షేర్లను ఉషా రాణి పాపినేని ఆఫర్ చేయనున్నారు. తద్వారా మొత్తం రూ. 1,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. శ్రీకర్ సీడ్స్ బ్రాండుతో కార్యకలాపాలు విస్తరించిన తెలంగాణ కంపెనీ ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 245 కోట్లు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
విత్తనాలుసహా సమీకృత సస్య రక్షణ సొల్యూషన్లు అందించే కంపెనీ పరిశోధన, అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ) ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, పంపిణీ తదితరాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా విభిన్నతరహా హైబ్రిడ్, స్వీయ పరాగ సంపర్క(ఓపీవీ) విత్తనాలను పంపిణీ చేస్తోంది. జొన్న, ధాన్యం, పత్తి, గోధుమలు, సజ్జలు తదితర పంటల సంబంధ విత్తనాలను ఆఫర్ చేస్తోంది. 2025 జూన్‌కల్లా సీఐబీఆర్‌సీ నుంచి 269 రిజి్రస్టేషన్లు పొందింది. గతేడాది(2024–25)లో రూ. 441 కోట్ల ఆదాయం, రూ. 71 కోట్ల నికర లాభం ఆర్జించింది.