
పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 17 శాతం పడిపోయాయి. బీఎస్‌ఈలో రూ.819.25 వద్ద లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో గిరిష్ కౌస్గీ ఉన్నట్టుండి రాజీనామా చేయడంతో ఈ పతనం చోటుచేసుకుంది. ఈ నాయకత్వ మార్పు కంపెనీ వ్యూహాత్మక దిశ, స్థిరత్వంపై పెట్టుబడిదారులలో ఆందోళనను కలిగించింది.
నాయకత్వ శూన్యం
2022 అక్టోబర్‌లో నాలుగేళ్ల పదవీకాలానికి బాధ్యతలు చేపట్టిన గిరీష్ కౌస్గీ 2025 అక్టోబర్ 28న అధికారికంగా పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ తన పదవీకాలం ముగిసేలోపు రాజీనామా చేయడం వల్ల వారసత్వ ప్రణాళిక, నాయకత్వ కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది.
అయితే కంపెనీ మాత్రం తమ వ్యూహాత్మక ప్రాధాన్యతలు, వ్యాపార దృష్టి, వృద్ధి మార్గం యథాతథంగా కొనసాగుతాయని హామీ ఇస్తోంది. కొత్త సీఈవో కోసం బోర్డు అనుభవజ్ఞుడైన వ్యక్తిని అన్వేషించడం ప్రారంభించింది.

గత పనితీరు అమోఘం
కౌస్గీ నాయకత్వంలో పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ 200 శాతం వృద్ధి చెందింది. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే శుక్రవారం కంపెనీ షేర్లలో అమ్మకాలు 50-రోజుల సగటు కంటే 1,176 శాతం అధికంగా నమోదయ్యాయి. కొనుగోలు ఆర్డర్ల కంటే అమ్మకాలు 4:1 నిష్పత్తిలో ఉన్నాయి.
బలమైన క్యూ1 ఫలితాలు
పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి జూలై 21న బలమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. రూ.534 కోట్ల నికర లాభం సాధించింది. ఇది వార్షిక ప్రాతిపదికన 23 శాతం వృద్ధి. మొత్తం ఆదాయం రూ.2,082 కోట్లుగా నివేదించింది. ఇందులో వడ్డీ ఆదాయం రూ.1,980 కోట్లు కాగా నికర వడ్డీ ఆదాయం రూ.760 కోట్లు.
ఇన్వెస్టర్లు ఏమి చేయాలి?
కంపెనీ ఫండమెంటల్స్ బలంగా ఉన్నప్పటికీ, సీఈవో రాజీనామా, టెక్నికల్ బ్రేక్‌డౌన్ కారణంగా తాత్కాలిక అస్థిరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వేచి చూడాలనే దృక్పథాన్ని కొంతమంది విశ్లేషకులు సూచిస్తున్నారు. కొత్త సీఈవో ఎవరు అవుతారు, మార్కెట్ భావన ఎలా మారుతుంది అన్నది స్పష్టత వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిదంటున్నారు.