
ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పట్లో ఆగేలా లేవు. ఐసీఐసీఐ బ్యాంక్ అంచనా ప్రకారం 2026 ప్రథమార్థం చివరి నాటికి భారతదేశంలో బంగారం ధరలు రూ.1,25,000 వరకు పెరగవచ్చని చెబుతోంది. 2025లో ఇక మిగిలిన ఏడాది పది గ్రాముల బంగారం ధర రూ.99,500 నుంచి రూ.1,10,000 మధ్య ట్రేడవుతుందని, 2026 ప్రథమార్థంలో ఇది రూ.1,10,000 నుంచి రూ.1,25,000 వరకు పెరుగుతుందని ఐసీఐసీఐ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ గ్రూప్ రీసెర్చ్ నోట్ తెలిపింది.
‘మా అంచనాల కంటే అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి చాలా క్షీణించిన స్థాయిలో ట్రేడ్ అయితే ఈ అంచనాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ కాలానికి డాలర్‌తో రూపాయి మారక విలువ సగటున 87.00 - 89.00 మధ్య ఉంటుందని అంచనా వేశాం’ అని నివేదిక పేర్కొంది.
అంతర్జాతీయ ప్రభావాలు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య సడలింపు అంచనాలు, అమెరికా ఆర్థిక వ్యవస్థపై నిరంతర సంస్థాగత ఆందోళనల మద్దతుతో 2025లో ఇప్పటివరకు ప్రపంచ బంగారం ధరలు 33 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. ప్రపంచ బులియన్ 2025లో సగటున ఔన్స్‌కు 3,400-3,600 డాలర్లు, 2026 ప్రథమార్థంలో ఔన్స్‌కు 3,600-3,800 డాలర్లకు చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమైతే, ఈ పరిధులు మరింత తారుమారయ్యే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.
దేశీయ కారణాలు
రూపాయి బలహీనపడటం (డాలర్‌తో పోలిస్తే రూ.87 –రూ.89 మధ్యగా ఉంటుందని అంచనా )
పండుగల కాలంలో బంగారం డిమాండ్ పెరగడం.
బంగారం దిగుమతులు పెరగడం (జూన్ 2025లో 1.8 బిలియన్ డాలర్లు, జూలై 2025లో 4.0 బిలియన్ డాలర్లు)
గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు అధికం కావడం ( జూలైలో రూ.1,260 కోట్లు, 2025లో ఇప్పటివరకు రూ.9,280 కోట్లు, 2024లో రూ.4,520 కోట్లు)