రూ. 1,25,800కి తగ్గుదల
న్యూఢిల్లీ: వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు సన్నగిల్లిన నేపథ్యంలో పసిడి ధరలు మంగళవారం గణనీయంగా తగ్గాయి. దేశీయంగా ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 3,900 క్షీణించింది. రూ. 1,25,800కి తగ్గింది. వెండి రేటు కూడా కేజీకి రూ. 7,800 తగ్గి రూ. 1,56,000కు దిగి వచ్చింది.
అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు సన్నగిల్లడం, ఈ వారం కీలక డేటా విడుదల అనంతరం ఫెడ్ రిజర్వ్ తీసుకోబోయే చర్యల గురించి ఇన్వెస్టర్లు నిరీక్షిస్తుండటంతో పసిడి, వెండి అమ్మకాల ఒత్తిడికి లోనైనట్లు ఆగ్మంట్ హెడ్ (రీసెర్చ్) రెనిషా చైనాని తెలిపారు. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్‌లో) డిసెంబర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుకు సంబంధించి పసిడి రేటు క్రితం ముగింపు రూ. 1,22,927తో పోలిస్తే ఒక దశలో సుమారు రూ. 2,165 క్షీణించి రూ. 1,20,762కి తగ్గింది.
వెండి ఫ్యూచర్స్ కూడా డిసెంబర్ కాంట్రాక్టు రూ. 3,660 మేర (సుమారు 2.36 శాతం) పతనమై రూ. 1,51,652 వద్ద ట్రేడయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లు చూస్తే కామెక్స్ గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఔన్సుకి సుమారు 65 డాలర్లు (1.60 శాతం) క్షీణించి 4,009.5 డాలర్లకు తగ్గింది.
గత నాలుగు సెషన్లలో పుత్తడి ధర ఏకంగా 204.1 డాలర్లు (సుమారు 4.84 శాతం) క్షీణించింది. అలాగే డిసెంబర్ కాంట్రాక్టు వెండి రేటు 2.38 శాతం క్షీణించి 49.50 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.


