
దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకొంటోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా దేశ ప్రజలకు బంగారమంటే మక్కువ తగ్గకుండా పెరుగుతూనే ఉంది. అందుకు అనుగుణంగా పసిడి ధరలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి.
భారతదేశం స్వాతంత్య్రం పొందిన 1947లో తులం (10 గ్రాములు) బంగారం ధర రూ.88 మాత్రమే ఉండేది. కానీ 2025 నాటికి అది రూ.1,04,000 దాటింది. అంటే దాదాపు 1,100 రెట్లు పెరిగింది. ఈ గణనీయమైన పెరుగుదల వెనుక ఉన్న కారణాలు సామాన్య ప్రజలకు అర్థం కాకపోయినా, ఆర్థిక నిపుణుల దృష్టిలో ఇది దేశీయ ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, రూపాయి మారక రేటు, భారతీయుల సంప్రదాయాల మిశ్రమ ప్రభావం. బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ రావడంతో దీన్ని "సురక్షిత పెట్టుబడి"గా భావించే ధోరణి పెరుగుతోంది.
వందల నుంచి లక్షలకు..
1950లలో తులం బంగారం ధర రూ.100కు చేరగా, 1970లో రూ.184, 1980లో రూ.1,330, 1990లో రూ.3,200, 2000లో రూ.4,400గా నమోదైంది. 2010 నాటికి ఇది రూ.18,500కు పెరిగింది. 2020 నాటికి రూ.50,151గా ఉండగా, 2025 నాటికి రూ.1,04,320కి చేరింది. ఈ గణాంకాలు చూస్తే, ప్రతి దశలో బంగారం ధరలు గణనీయంగా పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం మార్కెట్ డిమాండ్ వల్ల మాత్రమే కాదు, అంతర్జాతీయ పరిస్థితులు, కేంద్ర బ్యాంకుల విధానాలు, పెట్టుబడిదారుల మానసిక ధోరణి కూడా దీనిపై ప్రభావం చూపాయి.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు
ద్రవ్యోల్బణం: రూపాయి విలువ తగ్గినప్పుడు బంగారం విలువ పెరుగుతుంది.
అంతర్జాతీయ సంక్షోభాలు: యుద్ధాలు, మహమ్మారులు వంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు.
రూపాయి-డాలర్ మారక రేటు: రూపాయి బలహీనత కూడా ధరల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది.
భారతీయ డిమాండ్: పెళ్లిళ్లు, పండుగలు, సంప్రదాయాల వల్ల బంగారం డిమాండ్ ఎప్పటికీ అధికంగా ఉంటోంది.
కేంద్ర బ్యాంకుల విధానాలు: బంగారం నిల్వల కొనుగోలు, అమ్మకాలు ధరలపై ప్రభావం చూపుతాయి.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం ధరలు భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. "బంగారం ధరలు క్రమంగా పెరుగుతూనే ఉంటాయి. ఇది ఆర్థిక అస్థిరత సమయంలో పెట్టుబడిదారులకు భద్రతను కలిగించే సాధనం," అని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. కేంద్ర బ్యాంకులు కూడా తమ బంగారం నిల్వలను పెంచడం ద్వారా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఆర్బీఐ వంటి సంస్థలు బంగారం కొనుగోలు చేయడం, నిల్వలు పెంచడం వంటి చర్యలు మార్కెట్‌లో దీని విలువను స్థిరంగా ఉంచుతున్నాయి.