
ఆధునిక చరిత్రలోనే అతిపెద్ద మార్పు రాబోతోందని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచియిత రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. "కృత్రిమ మేధ (AI ) చాలా మంది 'స్మార్ట్ విద్యార్థులు' తమ ఉద్యోగాలను కోల్పోయేలా చేస్తుంది.. భారీ నిరుద్యోగం కలిగిస్తుంది.. విద్యా రుణాలు పెరగిపోతాయి.." అని అప్రమత్తం చేస్తూ తాజాగా ఆయన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో కలగనున్న పరిణామాలపై కియోసాకి విద్యార్థులను అప్రమత్తం చేశారు. చాలా మంది తెలివైన విద్యార్థులు కూడా ఉద్యోగాలు కోల్పోక తప్పదన్నారు. ఒకప్పుడు డోకా లేదనుకున్న ఉద్యోగాలను కూడా ఏఐ ఆటోమేట్ చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోతుందని ఆయన అంచనా వేస్తున్నారు. రుణ సాయంతో విద్యను పూర్తి చేసి ఉద్యోగాల కోసం వస్తున్న గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు లేక రుణ భారం తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "నాకు ఉద్యోగం లేదు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నన్ను తొలగించలేదు" అంటూ ఉద్యోగం కంటే వ్యాపారం, ఇన్వెస్ట్‌మెంట్‌లే నయమని చెప్పే ప్రయత్నం చేశారు.
సాంప్రదాయిక విద్య, ఉద్యోగ మార్గాన్ని కియోసాకి ఇప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బడికి వెళ్లడం, మంచి గ్రేడ్లు సాధించడం, ఉద్యోగం సంపాదించడం, డబ్బు ఆదా చేయడం వంటి విధానాలు ఇకపై ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వవని ఆయన వాదిస్తున్నారు. శరవేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో, ఆయన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. తన "రిచ్ డాడ్" మనస్తత్వానికి అనుకూలంగా తన "పూర్ డాడ్" సలహాను ఎలా విస్మరించిందీ వివరించారు. సంప్రదాయ మార్గానికి విరుద్ధంగా ఎంట్రెప్రెన్యూర్ అయ్యానని, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టానని, బంగారం, వెండి, ప్రస్తుతం బిట్కాయిన్‌లలో పొదుపు చేస్తున్నానని పేర్కొన్నారు.
ఈ ఆర్థిక పరివర్తన కాలంలో నిష్క్రియాత్మక పరిశీలనకు గురికావద్దని కియోసాకి తన ఫాలోవర్లకు సూచించారు. "దయచేసి చరిత్రలో ఈ కాలానికి బలైపోవద్దు" అని హెచ్చరించారు. స్వతంత్రంగా ఆలోచించాలని, వ్యక్తిగత ఎదుగుదలకు పెట్టుబడులు, సాంప్రదాయ వ్యవస్థలకు వెలుపల ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యూహాలను అన్వేషించాలని హితవు పలికారు.
BIGGEST CHANGE in MODERN HISTORY
AI will cause many “smart students” to lose their jobs.
AI will cause massive unemployment.
Many still have student loan debt.
AI cannot fire me because I do not have a job.
If you are in this category please take proactive action. Please do…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 1, 2025