సిప్‌ సరే.. ఇక సిఫ్‌ చేస్తారా! | Explanation of Specialized investment funds | Sakshi
Sakshi News home page

సిప్‌ సరే.. ఇక సిఫ్‌ చేస్తారా!

Aug 18 2025 5:55 AM | Updated on Aug 18 2025 8:03 AM

Explanation of Specialized investment funds

కొత్తగా స్పెషలైజ్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ 

సంప్రదాయ మ్యూచువల్‌ ఫండ్స్‌కు భిన్నం 

కనీస పెట్టుబడి రూ.10 లక్షలు 

పీఎంఎస్, ఏఐఎఫ్‌ సాధనాలూ ఉన్నాయ్‌ 

రిస్క్, రాబడుల ఆధారంగా ఎంపిక 

పెట్టుబడుల ప్రపంచం ఎప్పుడూ ఒకే మాదిరి ఉండదు. ఎప్పటికప్పుడు కొంగొత్త సాధనాలు అందుబాటులోకి వస్తుంటాయి. ఒకప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్, ఎల్‌ఐసీ ఎండోమెంట్‌ పాలసీల హవా. ఇప్పుడు మెజారిటీ పెట్టుబడులు ఈక్విటీల వైపే. ఇందులోనూ స్పెషలైజ్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఎస్‌ఐఎఫ్‌–సిఫ్‌) పేరుతో కొత్త సాధనం అందుబాటులోకి వచ్చింది. 

దీనికితోడు ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌లు)కు సైతం ఆదరణ పెరుగుతోంది. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (పీఎంఎస్‌) ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ భిన్న సాధనాల్లో రిస్క్, రాబడుల పరంగా ఎంతో వ్యత్యాసం గమనించొచ్చు. ఇన్వెస్టర్లందరికీ ఈ సాధనాలు అనుకూలమని చెప్పలేం. తమ ఆకాంక్షలకు అనుగుణంగా సరైన సాధనాన్ని ఎంపిక చేసుకుని, దీర్ఘకాలం పాటు కొనసాగితే సంపద సృష్టి సాధ్యమే.

సంప్రదాయ మ్యూచువల్‌ ఫండ్స్,  పీఎంఎస్, ఏఐఎఫ్, సిఫ్‌ మధ్య పోలికలు తక్కువ. వైరుధ్యాలే ఎక్కువ. రాబడుల్లోనూ స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. అన్ని ఆదాయ వర్గాల వారికీ అందుబాటులో ఉన్న సాధనం సంప్రదాయ మ్యూచువల్‌ ఫండ్స్‌. ఇక సిఫ్, పీఎంఎస్, ఏఐఎఫ్‌ అన్నీ కూడా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే వారికి ఉద్దేశించినవి. వీటి నిర్వహణ తీరులోనూ వైరుధ్యం కనిపిస్తుంది. వీటన్నింటిపైనా సెబీ నియంత్రణ, పర్యవేక్షణ ఉంటుంది. ఎంపిక బాధ్యత మాత్రం ఇన్వెస్టర్లదే.  


సంప్రదాయ మ్యూచువల్‌ ఫండ్స్‌ 
ఈక్విటీయే కాకుండా డెట్, గోల్డ్, రియల్‌ ఎస్టేట్‌ తదితర సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసేందుకు సంప్రదాయ మ్యూచువల్‌ ఫండ్స్‌ వీలు కల్పిస్తున్నాయి. విడివిడిగా, లేదంటే వీటి కలయికతో కూడిన హైబ్రిడ్‌ ఫండ్స్‌ను సైతం ఆఫర్‌ చేస్తున్నాయి. వేలాది పథకాల నుంచి ఇన్వెస్టర్లు తమకు అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవచ్చు. రూ.100 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. సెబీ పర్యవేక్షణ, నియంత్రణల మధ్య పనిచేస్తుంటాయి. సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా వారం, పక్షం, నెలకొకసారి చొప్పున పెట్టుబడులు పెట్టుకోవచ్చు. 

పెట్టుబడి నుంచి ఆదాయం కోరుకుంటే సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ) ద్వారా ప్రతి నెలా నిరీ్ణత మొత్తం ఉపసంహరించుకోవచ్చు. లక్షలాది మంది ఇన్వెస్టర్లను ఉద్దేశించి రూపొందించిన సాధనాలు ఇవి. పదుల సంఖ్యలో విభాగాల నుంచి తమకు అనుకూలమైన ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. లిక్విడిటీ ఎక్కువ. అంటే కోరుకున్నప్పుడు పెట్టుబడులను సులభంగా, వేగంగా వెనక్కి తీసుకోగలరు. ఇందులో యాక్టివ్, ప్యాసివ్‌ ఫండ్స్‌ ఉంటాయి. ప్యాసివ్‌ ఫండ్స్‌లో 0.2 శాతం (మొత్తం పెట్టుబడుల విలువలో), యాక్టివ్‌ ఫండ్స్‌లో 0.5 శాతం నుంచి ఎక్స్‌పెన్స్‌ రేషియో ప్రారంభమవుతుంది.  

రాబడులు: ఎంపిక చేసుకున్న విభాగం, పథకం ఆధారంగా 5–20 శాతం మధ్య దీర్ఘకాలంలో ఉంటాయి.  

పన్ను బాధ్యత: ఈక్విటీ ఫండ్స్‌(ఈక్విటీల్లో కనీసం 65 శాతం పెట్టుబడులు పెట్టే), ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌లో పెట్టుబడులను ఏడాదిలోపు విక్రయించినప్పుడు వచ్చిన లాభంపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఏడాది తర్వాత విక్రయించినప్పుడు వచ్చిన లాభం మొదటి రూ.1.25 లక్షలపై పన్ను లేదు. తర్వాతి మొత్తంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి. ఇక డెట్‌ ఫండ్స్‌లో పెట్టుబడిని ఎప్పుడు విక్రయించినా వచి్చన లాభంపై పన్ను ఒకే మాదిరి ఉంటుంది. లాబాన్ని వ్యక్తిగత వార్షిక ఆదాయానికి కలిపి పన్ను చెల్లించాలి.

పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (పీఎంఎస్‌) 
ఇన్వెస్టర్ల రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా పెట్టుబడుల సేవలు అందించేవి పీఎంఎస్‌ సంస్థలు. అనుభవజు్ఞలైన ఫండ్‌ మేనేజర్లు ఇన్వెస్టర్ల ఖాతాల నుంచే వారి తరఫున పెట్టుబడుల వ్యవహారాలను నిర్వహిస్తారు, పర్యవేక్షిస్తుంటారు. కనీసం రూ.50 లక్షలు అంతకుమించి పెట్టుబడి పెట్టాలి. ఇన్వెస్టర్ల రాబడి ఆకాంక్షలు, ఎంత రిస్క్‌ తీసుకుంటారు తదితర అంశాల ఆధారంగా వారి కోసమే ప్రత్యేకమైన పోర్ట్‌ఫోలియోని నిర్వహిస్తారు. కొత్త అవకాశాలను గుర్తించినప్పుడు పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేర్పులు చేస్తుంటారు. 
 
పీఎఎంస్‌లోనూ డిస్క్రీషినరీ, నాన్‌ డిరస్కీషినరీ అని రెండు రకాలు ఉంటాయి. డిస్క్రీషినరీలో అయితే ఫండ్‌ మేనేజర్‌ తన విచక్షణ ఆధారంగా స్వతంత్రంగా పెట్టుబడుల నిర్ణయాలు అమలు చేస్తుంటారు. నాన్‌ డిస్క్రీషినరీలో క్లయింట్‌ అనుమతి తీసుకున్న తర్వాతే లావాదేవీలు నిర్వహిస్తుంటారు. ఈ రెండూ కాకుండా అడ్వైజరీ పేరుతో మరో విభాగం కూడా ఉంది. ఇక్కడ ఇన్వెస్టర్‌కు పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ సలహాలు ఇవ్వడం వరకే పరిమితం అవుతారు. వాటిని పాటించడం, పాటించకపోవడం ఇన్వెస్టర్‌ అభీష్టమే. 

మ్యూచువల్‌ ఫండ్స్‌లో లక్షలాది మంది ఇన్వెస్టర్లను దృష్టిలో పెట్టుకుని పోర్ట్‌ఫోలియోలను నిర్వహిస్తుంటారు. పీఎంఎస్‌లలో ఒక్కో ఇన్వెస్టర్‌ అవసరాలకు అనుగుణంగా విడిగా పోర్ట్‌ఫోలియో ఉంటుంది. ఫండ్స్‌ మాదిరే పీఎంఎస్‌ల్లోనూ పారదర్శకత ఎక్కువ. పెట్టుబడిదారులకు ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలి. కానీ, మ్యూచువల్‌ ఫండ్స్‌ మాదిరి వీటి పనితీరు, ఫోర్ట్‌పోలియో తదితర సమాచారం ఓపెన్‌ ఫ్లాట్‌పామ్‌లపై (ఆన్‌లైన్‌ ప్రపంచం) ఉండదు. పీఎంఎస్‌ ఇన్వెస్టర్లకే తెలుస్తుంది. ఈక్విటీలతోపాటు డెరివేటివ్స్‌ పొజిషన్ల ద్వారా అధిక రాబడినిచ్చే విధంగా పీఎంఎస్‌లు పనిచేస్తాయి. సంప్రదాయ మ్యూచువల్‌ ఫండ్స్‌ కంటే  ఇందులో లిక్విడిటీ కొంచెం తక్కువ. వీటిలో ఫీజులు 3.5 శాతం నుంచి 5.5 శాతం వరకు ఉంటాయి. ఫీజును ఇన్వెస్టర్‌ స్వయంగా చెల్లించడం వీలుకానప్పుడు, పోర్ట్‌ఫోలియోలోని కొన్ని స్టాక్స్‌ను విక్రయించడం ద్వారా పీఎంఎస్‌ సంస్థ తన ఫీజులను రాబట్టుకుంటుంది.
  
రాబడులు: గత ఏడాది కాలంలో సగటు రాబడులు 30 శాతంగా, ఐదేళ్ల కాలంలో 18.99 శాతం, పదేళ్లలో 17.35 శాతం చొప్పున ఉన్నాయి.  

పన్ను బాధ్యత: పీఎంఎస్‌ ఫండ్‌ మేనేజర్లు కొనుగోలు చేసిన షే ర్లు ఇన్వెస్టర్‌ డీమ్యాట్‌ ఖాతాలోనే ఉంటాయి. ఇన్వెస్టర్‌ పేరిటే చేస్తుంటారు కనుక ఈక్విటీలకు మాదిరే స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. ఇన్వెస్టర్ల పోర్ట్‌ ఫోలియోలోని కంపెనీలు జారీ చేసే డివిడెండ్‌ ఆదాయం వా ర్షిక ఆదాయానికి కలుస్తుంది. ఫండ్‌ మేనేజర్లు పోర్ట్‌ఫోలియో లోని స్టాక్స్‌ను ఎంత తరచుగా మార్పులు, చేర్పులు చేస్తున్నారనే దాని ఆధారంగా పన్ను బాధ్యత ఆధారపడి ఉంటుంది.

ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌లు) 
ప్రైవేటు ఈక్విటీ, స్టార్టప్‌లు, హెడ్జ్‌ ఫండ్స్, డిరస్టెస్డ్‌ అసెట్స్‌ (ప్రాపర్టి), డెట్, రియల్‌ ఎస్టేట్‌ తదితర సాధనాల్లో ఏఐఎఫ్‌లు పెట్టుబడులు పెడుతుంటాయి. ఇందులో కనీస పెట్టుబడి కోటి రూపాయలు. ఇన్వెస్టర్లు అందరికీ అనుకూలమైన సాధనాలు కావు. వీటిలో మూడు కేటగిరీలు ఉన్నాయి. కేటగిరీ–1 ఫండ్స్‌.. ఆరంభ దశలోని వెంచర్లు, సోషల్‌ వెంచర్లు, సామాజిక ప్రభావం చూపించే ప్రాజెక్టులు, ఇన్‌ఫ్రాపై పెట్టుబడులు పెడతాయి. 

కేటగిరీ–2 ఏఐఎఫ్‌లు ప్రైవేటు ఈక్విటీ (పీఈ), రియల్‌ ఎస్టేట్‌ ఫండ్స్, డిరస్టెస్డ్‌ అసెట్స్‌ (ప్రాపర్టి), డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. కేటగిరీ–3 ఏఐఎఫ్‌లు హెడ్జింగ్‌ వ్యూహాలను అమలు చేస్తుంటాయి. లిస్టెడ్‌తోపాటు అన్‌లిస్టెడ్‌ కంపెనీలు, డెరివేటివ్స్‌లోనూ పెట్టుబడులు పెడుతుంటాయి. అవసరమైతే రుణం తీసుకుని మరీ ఇవి ఇన్వెస్ట్‌ చేస్తాయి. మూడు విభాగాల్లోనూ కేటగిరీ–3లో రిస్క్‌ చాలా ఎక్కువ. వీటిలో సాధారణంగా మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. దీంతో లిక్విడిటీ తక్కువ. అధిక రిస్క్‌ తీసుకునే ధనిక ఇన్వెస్టర్లు (హెచ్‌ఎన్‌ఐలు), ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు అనుకూలం. 

సంప్రదాయ డెట్, ఈక్విటీలకు ప్రత్యామ్నాయంగా ఇతర పెట్టుబడుల అవకాశాలను ఇవి అందిస్తుంటాయి. వీటిలో స్పెక్యులేషన్‌ ఉండదు. కనుక అస్థిరతలు తక్కువ. అదే సమయంలో రిస్క్‌ ఎక్కువ. వీటిలో అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ ఫీజు 2 శాతం మేర ఉంటుంది. అంతేకాదు ఇన్వెస్టర్ల రాబడిపై 20 శాతం లెవీ కింద వసూలు చేస్తుంటాయి. లిక్విడిటీ తక్కువ. పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలంటే నిరీ్ణత కాలం వరకు వేచి ఉండాల్సి వస్తుంది. ఏఐఎఫ్‌లు సెబీ నియంత్రణల పరిధిలో పనిచేస్తుంటాయి. సంప్రదాయ సాధనాలకు వెలుపల పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవాలని భావించే వారు, అధిక రిస్క్‌ తీసుకునే సామర్థ్యం, అధిక మొత్తంలో 
పెట్టబుడులు పెట్టగలిగే వారికి ఇవి ప్రత్యేకం. 

రాబడులు: ఎంపిక చేసుకున్న విభాగం ఆధారంగా రాబడి భిన్నంగా ఉంటుంది. 

పన్ను బాధ్యత: కేటగిరీ 1, 2 ఏఐఎఫ్‌లో మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను చెల్లించాలి. ఒకవేళ వ్యాపార ఆదాయంగా పరిగణిస్తే అప్పుడు 30 శాతం పన్ను పడుతుంది. ఇక కేటగిరీ 3 ఏఐఎఫ్‌లలో లాభంపై పన్ను ఫండ్‌ స్థాయిలోనే అమలవుతుంది. ఇన్వెస్టర్‌ ప్రత్యేకంగా ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు.

స్పెషలైజ్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (సిఫ్‌)
సంప్రదాయ మ్యూచువల్‌ ఫండ్స్, పీఎంఎస్‌/ఏఐఎఫ్‌ మధ్య అంతరాన్ని భర్తీ చేసేందుకు సిఫ్‌ సాధనాన్ని సెబీ గతేడాది మార్చిలో ప్రవేశపెట్టింది. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల పరంగా ఉన్న సౌలభ్యం వీటిల్లోనూ ఉంటుంది. పీఎంఎస్‌లో మాదిరి ఇన్వెస్టర్ల ఆకాంక్షలకు తగిన పెట్టుబడుల విధానాలు సిఫ్‌లలో ఉంటాయి. అన్‌లిస్డెడ్‌ సెక్యూరిటీలు, రియల్‌ ఎస్టేట్, స్ట్రక్చర్డ్‌ డెట్‌లో పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛతో ఉంటాయి. కనీసం రూ.10లక్షల పెట్టుబడి పెట్టాలి. 

ఆధునిక ధోరణి కలిగి, అధిక రాబడి కోరుకునే దూకుడైన ఇన్వెస్టర్లకు అనుకూలం. డెరివేటివ్స్‌లోనూ పెట్టుబడులు పెడతాయి. లాంగ్‌–షార్ట్‌ వ్యూహాలను అమలు చేస్తుంటాయి. సమీప కాలంలో విలువ పెరుగుతుందని భావించినప్పుడు కొనుగోలు చేయడం (లాంగ్‌), స్టాక్స్‌ ధరలు ఖరీదుగా మారి సమీప కాలంలో దిద్దుబాటుకు గురవుతాయని భావించినప్పుడు డెరివేటివ్స్‌లో షార్ట్‌ చేస్తాయి (అమ్మకం). ఇందుకు ఫండమెంటల్స్‌తో పాటు, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో ఓపెన్‌ ఎండెడ్‌ (ఎప్పుడైనా కొనుగోలు, విక్రయాలకు అందుబాటులో), క్లోజ్‌ ఎండెడ్‌ (నిరీ్ణత కాలం వరకు లాకిన్‌) ఉంటాయి. 

పోర్ట్‌ఫోలియో వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలి. సంప్రదాయ ఈక్విటీ ఫండ్స్‌ మాదిరే సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌), సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ) ఆప్షన్లు ఇందులో ఉంటాయి. ఈక్విటీ, డెట్‌ లేదంటే ఈక్విటీ–డెట్‌ కలిసిన హైబ్రిడ్‌ విధానాల్లో ఏదో ఒకదానినే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పెట్టుబడి విలువ ఏదేనీ కారణంతో రూ.10 లక్షల లోపునకు తగ్గిపోతే.. ఇన్వెస్టర్‌ ఆ మేరకు తిరిగి సమకూర్చాల్సి ఉంటుంది. ఇందుకు 30 రోజుల గడువు ఉంటుంది. అప్పటికీ సర్దుబాటు చేయలేకపోతే పెట్టుబడులను ఏఎంసీ విక్రయించి వెనక్కి ఇచ్చేస్తుంది. ఇందులో పెట్టుబడుల ఉపసంహరణ గడువు 15 రోజులు. సంప్రదాయ మ్యూచువల్‌ ఫండ్స్‌తో పోలి్చతే సిఫ్‌లలో ఫండ్‌ మేనేజర్లు అధిక రాబడుల దృష్ట్యా అగ్రెస్సివ్‌ పెట్టుబడుల విధానాలను అనుసరించొచ్చు. ఈ విభాగంలో ఇటీవలే క్వాంట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ‘సిఫ్‌ ఈక్విటీ లాంగ్‌ షార్ట్‌ ఫండ్‌’ను ప్రారంభించింది. ఇందులో డెరివేటివ్స్‌కు కీలక పాత్ర ఉంటుంది.  

రాబడి: ఇటీవలే అందుబాటులోకి వచ్చిన సాధనం. ఒకటి రెండేళ్లు గడిస్తే కానీ వీటిపనితీరును విశ్లేషించలేం. 

పన్ను బాధ్యత: ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ మాదిరే వీటి రాబడులపైనా పన్ను అమలవుతుంది.  


→ 2025 జూన్‌ చివరికి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం): రూ.33.47లక్షల కోట్లు  
→  2025 ఏప్రిల్‌ చివరికి పీఎంఎస్‌ల నిర్వహణలోని ఆస్తులు: రూ.32 లక్షల కోట్లు 
→ 2025 మార్చి చివరికి ఏఐఎఫ్‌ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ :రూ.13.49 లక్షల కోట్లు  

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement