
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రాక్టీస్ చేస్తున్న సీఏలు, సీఎంఏలు, లాయర్లు, ట్యాక్స్ ప్రాక్టీషనర్లు.. ఇలా వృత్తి నిపుణులు ఉన్నారు. డిపార్టుమెంటు దగ్గర రిజిస్టర్ చేసుకుని, ఇన్‌కం ట్యాక్స్ ప్రాక్టీషనర్లుగా చలామణీ అయ్యే వారితోను ఫైల్ చేయించుకోవచ్చు. మీరే స్వయంగా చేసుకోవచ్చు. అనుభవం ఉన్న ఫ్రెండ్స్ సహాయంతో ఫైలింగ్ చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు కూడా ఈ ఫైలింగ్ పనులు చేస్తున్నాయి. వీరందరితో మీరు స్వయంగా మాట్లాడవచ్చు. కలవవచ్చు. డిస్కస్ చేసి, రిటర్నులు వేయొచ్చు.
ప్రస్తుతం ఈ ఆధునిక డిజిటల్ యుగంలో ప్రతి పనికి మనం ఎన్నో అప్లికేషన్లను వాడుతున్నాం. చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. అరచేతిలో స్వర్గం చూస్తున్నట్లు యాప్‌లను ఇన్‌స్టాల్ చేసేస్తున్నాం. వాడుతున్నాం. ఆదాయపు పన్ను ఫైలింగ్‌కి కూడా రకరకాలుగా యాప్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీరెంతో ఆలోచించాలి. ఒక విషయం గుర్తు పెట్టుకోండి. ఫైలింగ్ అంటే నాలుగంకెలను నాలుగు కాలమ్‌లలో నింపి, అప్‌లోడ్ చేసి క్లిక్ కొట్టడం కాదు. చట్టంలోని సెక్షన్లు, వాటిలో ఇమిడి ఉన్న చిక్కులు, లెక్కలు, వాటి ప్రభావం తెలిసి ఉండాలి. అప్లికేషన్స్ వల్ల ఎండమావుల్లాగా కంటికి కనిపించే ప్రయోజనాలు.
చాలా త్వరగా పూర్తవుతుంది.
అతి తక్కువ ఖర్చు.
మీ సీటులో నుంచి కదలక్కర్లేదు.
కానీ, ఈ యాప్‌లను చెక్ చేసుకోకుండా వాడటం వల్ల చాలా ఇబ్బందులుంటాయి. అవేంటంటే..
చాలా త్వరగా ఫైలింగ్ చేయొచ్చు. ఇంత చౌకగా సర్వీసులు అందిస్తున్నారంటే, వారు పూర్తిగా కృత్రిమ మేథస్సు మీద ఆధారపడుతున్నారన్న మాట. కృత్రిమ మేథస్సు వల్ల త్వరగా అవుతుందేమో గానీ, ఎన్నో అంశాల్లో జడ్జిమెంట్ కావాలి.
కేవలం కాగితాల్లో ఉన్న అంకెలను చదివి, వాటిని నింపడం/రాయడం/ఎక్కించడం మాత్రమే చేస్తారు. గతంలో మనం చదివాం. ఫారం 16లో తప్పులు, ఫారం 26ఏఎస్‌లో తప్పులు, డబుల్ ఎంట్రీలు, మీకసలు వర్తించని అంశాలు, మీకు సంబంధం లేని అంశాలు, అలాగే టీఐఎస్‌లో కూడా తప్పులు, డబుల్ ఎంట్రీలు, మీవి కాని/సంబంధం లేనివి ఉంటాయి. వాటిని చెక్ చేసి, విశ్లేషించే ప్రక్రియ ఉండదు. మక్కీకి మక్కీ మాత్రమే కొడతారు.
ఏ తప్పులు దొర్లినా, ఎటువంటి బాధ్యతలు వహించరు. తప్పుల మేరకు సరిదిద్దాలంటే డబ్బులు అడుగుతారు. అడగడం కాదు గుంజుతారు.
జడ్జిమెంటు. సహజసిద్ధమైన మానవ మేథస్సును వాడకపోవడం వల్ల మనకు డ్యామేజీ జరగవచ్చు. ఎక్కువ పన్ను చెల్లించడం, రిఫండు తగ్గిపోవడంలాంటివి జరిగే అవకాశం ఉంది.
డిడక్షన్లను తప్పుగా క్లెయిం చేసే అవకాశం ఉంది. కొత్త విధానమా, పాత విధానమా అనేది ఎంచుకోవడంలో తప్పు జరగవచ్చు. క్యాపిటల్ గెయిన్స్ విషయంలో వర్గీకరణ తప్పుగా చేయొచ్చు. సర్దుబాటు చేయాల్సిన నష్టాలు తీసుకోకపోవచ్చు. నష్టాల బదిలీ జరగకపోవచ్చు.
నోటీసులు వస్తే ప్రమాదం. పెనాల్టీ పడితే వాళ్లు పరార్.
వందల అంశాలు మీతో ముఖాముఖి చర్చించే పరిస్థితికి బదులు ఎకాయెకిన ఫేస్‌లెస్‌గా, బేస్‌లెస్‌గా ఒక క్లిక్ చేస్తే, అర్థం లేని ఫైలింగ్‌తో మీరు అనర్ధాలు కొనుక్కుంటారు.
సాఫ్ట్‌వేర్‌లో తప్పులున్నా.. ఉండొచ్చు. అలా వేసే ప్రక్రియలో ఆలోచనలకు, విశ్లేషణలకు తావుండదు.
మహా అయితే, ఫారం 1 విషయంలో రిస్క్ తీసుకుని ‘మమ‘ అనిపించవచ్చు. కానీ, మిగతా ఫారాల విషయంలో ఎటువంటి ప్రయోగం చేయొద్దు.
ఇదేమీ గేమ్ యాప్ కాదు. చౌకగా సర్వీసులు దొరికాయని సంబరపడకండి. వందల రూపాయలు మిగిలాయని, మితిమీరి సంతోషపడితే వేలల్లో/లక్షల్లో నష్టాన్ని చూడాల్సి రావొచ్చు. కేవలం ఆర్థికంగానే కాదు.. చట్టాలని పాటించనందుకు గాను ఎన్నో చిక్కుల్లో పడతారు.
చివరగా, ఏడాదికోసారి, జాతి సేవలో పాలుపంచుకునేందుకు ఇదొక చక్కటి అవకాశం. నీతి, నిజాయితీతో ఆదర్శంగా ఉండే అంశం. సజ్జనుడిలాగా సగౌరవంగా సాగించాల్సిన సాలుసరి సత్కార్యం. కాబట్టి, వృత్తి నిపుణులను సంప్రదించండి. స్వయంగా టచ్‌లో ఉండండి. అన్ని కాగితాలు ఇవ్వండి. డిస్కస్ చేయండి. రిటర్న్ సరిగ్గా ఫైల్ చేయండి.
