
బడ్జెట్‌కు సంబంధించి 50/30/20 సూత్రం గురించి విన్నాను. నా ఆర్థిక ప్రణాళికకు దీన్ని అనుసరించడం మంచి మార్గమేనా?
– కరుణాకరన్
బడ్జెట్‌కు సంబంధించి బాగా ప్రాచుర్యంలో ఉన్నదే 50/30/20 నియమం. మీ నెలవారీ ఆదాయాన్ని మూడు భాగాలుగా వర్గీకరించడం ఇందులోని సూత్రం. ఇందులో 50 శాతాన్ని మీ అవసరాల కోసం కేటాయించుకోవాలి. అంటే ఇంటి అద్దె, గ్రోసరీ, విద్యుత్, రుణ వాయిదా చెల్లింపులు, స్కూల్ ఫీజులు అన్నీ కలిపి 50 శాతంలోపే ఉండాలి. మరో 30 శాతం అన్నది కోరికల కోసం. అంటే రెస్టారెంట్లో విందులు, ఓటీటీ చందాలు, విహార యాత్రలు, షాపింగ్ వంటివన్నీ 30 శాతం బడ్జెట్‌కు పరిమితం కావాలి.
మిగిలిన 20 శాతాన్ని భవిష్యత్తు కోసం, దీర్ఘకాల లక్ష్యాల కోసం పొదుపు, మదుపు చేసుకోవాలి. ఇది ఒక సాధారణ సూత్రమే కానీ, అందరికీ వర్తించేది కాదు. మీ ఆదాయం ఎంత వస్తోంది? జీవన వ్యయాలు ఎంత? వ్యక్తిగత బాధ్యతలు ఏ మేరకు ఇలాంటి విషయాలన్ని బడ్జెట్‌ను నిర్ణయిస్తాయి.
ఉదాహరణకు ఓ యువ ఉద్యోగి నెలవారీ రూ.40,000 ఆదాయం సంపాదిస్తున్నాడని అనుకుందాం. అతను ఉండేది మెట్రోలో. ఇంటి అద్దె, రవాణా వ్యయాలకే 50 శాతం ఖర్చవుతుంది. అప్పుడు ఇతర అవసరాలు, కోరికలు, పొదుపులకు మిగిలేది పెద్దగా ఉండదు. అదే రూ.2లక్షల వేతనం సంపాదించే వ్యక్తి కేవలం 30–35 శాతం బడ్జెట్‌లోనే అవసరాలను తీర్చుకోగలరు. అప్పుడు సదరు వ్యక్తి 30–40 శాతం ఆదా చేయగలరు. కనుక ఆదాయాన్ని బట్టి ఈ ప్రణాళిక ఆధారపడి ఉంటుంది.
50/30/20 అన్నది బడ్జెట్ మొదలు పెట్టడానికి అనుసరించొచ్చు. ముఖ్యంగా మీ జీవన వ్యయాలు ఆదాయాన్ని మించకుండా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా ఆదాయంలో 20 శాతాన్ని తప్పకుండా ఆదా చేసుకోవాలి. కోరికలకు సంబంధించిన బడ్జెట్‌లో రాజీ పడినా ఫర్వాలేదు. పొదుపు విషయంలో రాజీ పడకూడదు.
ఈక్విటీ మార్కెట్లలో తరచుగా కనిపించే అస్థిరతలను ఎలా అధిగమించాలి? – శ్యామల
ఈక్విటీల్లో అస్థిరతలన్నవి సర్వసాధారణం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్లు చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలాగో తెలిసి ఉండాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమలు చేయాలి.
ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో ఈక్విటీ పెట్టుబడులను కదలించకుండా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. ఈక్విటీల్లో మీ పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ చర్యలు అవసరం.
అలాగే, సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ అస్థిరతల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో కరెక్షన్‌లు అదనపు పెట్టుబడుల అవకాశాలను తెస్తాయి. ఎందుకంటే ఆ సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను తక్కువ ధరకే సమకూర్చుకోవచ్చు.
మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, ప్రతికూల సమయాల్లో చాలా మంది భయంతో పెట్టుబడులకు వెనుకాడుతుంటారు. కొందరు అమ్మకాలు కూడా చేస్తుంటారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఆ సమయంలో తప్పకుండా సిప్‌ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోవడానికి వీలుంటుంది.
సమాధానాలు :: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్