
యూనియన్ మ్యుచువల్ ఫండ్ సంస్థ తాజాగా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్)ను ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ 1న ప్రారంభమై 15న ముగుస్తుంది. ఈ ఎఫ్‌వోఎఫ్ ప్రధానంగా యూనియన్ ఎంఎఫ్‌కి చెందిన లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ ఈక్విటీ స్కీముల్లో ఇన్వెస్ట్ చేస్తుంది.
దీనితో మార్కెట్ టైమింగ్, దేనికి ఎంత కేటాయించాలి, ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కి మారేటప్పుడు పడే పన్ను ప్రభావాలు మొదలైన వాటి గురించి ఆలోచించాల్సిన బాదరబందీ ఉండదని సంస్థ ఎండీ మధు నాయర్ తెలిపారు. స్వల్పకాలికం నుంచి దీర్ఘకాలికం వరకు వివిధ కాలావధుల వ్యూహాలతో, ఈక్విటీ ఫండ్‌లకు వర్తించే పన్ను ప్రయోజనాలను అందించేలా ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ ఉంటుందని వివరించారు.
ఎడెల్‌వీజ్... మల్టీ అసెట్ ఓమ్ని ఎఫ్‌వోఎఫ్
ఎడెల్‌వీజ్ మ్యూచువల్ ఫండ్ తాజాగా ‘ఎడెల్‌వీజ్ మల్టీ అసెట్ ఓమ్ని ఫండ్ ఆఫ్ ఫండ్’ (ఎఫ్‌వోఎఫ్) పేరుతో కొత్త పథకాన్ని ఇన్వెస్టర్ల కోసం తీసుకొచ్చింది. ఈ పథకం ఈక్విటీతోపాటు బంగారం, వెండి, డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంది. లంప్‌సమ్ లేదా సిప్ రూపంలో అయినా కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 65% పెట్టుబడులను దేశీ ఈక్విటీలకు కేటాయిస్తుంది.
పసిడి ఈటీఎఫ్‌లకు 10%, వెండి ఈటీఎఫ్‌లకు 10%, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాలకు 15% చొప్పున కేటాయిస్తుంది. పెట్టుబడులను వైవిధ్యం చేసి, దీర్ఘకాలంలో స్థిరమైన రాబడిని అందించడం ఈ పథకం ఉద్దేశం. ఈ నెల 23న ఎన్‌ఎఫ్‌వో ముగుస్తుంది. ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్ కావడంతో తిరిగి సెప్టెంబర్ 11 నుంచి పెట్టుబడులకు అందుబాటులోకి వస్తుంది. పెట్టుబడులను 90 రోజుల్లోపు ఉపసంహరించుకుంటే 1% ఎగ్జిట్ లోడ్ పడుతుంది.