రిటైర్డ్ టీచర్లకు ఏటా రూ.83లక్షలు చెల్లించాలి.. ఎందుకంటే.. : ఇన్ఫోసిస్ మూర్తి

Retired Teachers Should Paid Rs83 Lakhs Annually Narayana Murthy - Sakshi

భారత యువత వారానికి 78 గంటలు పనిచేయాలనే వ్యాఖ్యలు చేసి ఇటీవల ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి వార్తాల్లో నిలిచారు. దీనిపై పలువులు ప్రముఖులు స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా దేశం అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయులకు ఏటా రూ.లక్ష అమెరికా డాలర్లు(రూ.83లక్షలు) చెల్లించాలని మూర్తి అన్నారు. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

‘దేశంలోని ఉపాధ్యాయులు, పరిశోధకులను గౌరవించాలి. వారికి మెరుగైన జీతాలు చెల్లించాలి. అన్ని సౌకర్యాలు అందించాలి. ఐటీ ఎక్స్‌పర్ట్‌, ఉపాధ్యాయులు, పరిశోధకుల సహాయంతో దేశం వేగంగా వృద్ధి చెందుతుంది. ప్రతిదేశం పురోగతికి నాలుగు దశలుంటాయి. మొదటి దశలో దేశంలోని పౌరులు ఎలాంటి ఆవిష్కరణలు చేయరు. కొత్తగా ఏమీ ఆలోచించరు. రెండో దశలో, ఇతర దేశాల ఆవిష్కరణల సహాయంతో ఉత్పత్తులు, సేవలను ప్రారంభిస్తారు. మూడో దశలో, ఒక దేశం ఇతర అభివృద్ధి చెందిన దేశాలవలె ఉన్నత విద్య, పరిశోధనలతో మెరుగైన నాణ్యత, ఉత్పాదకత కోసం ఖర్చు చేస్తారు. దాని ఫలితాలు పొందుతారు. ఇక నాలుగో దశలో ఏ దేశంపై ఆధారపడకుండా స్వతంత్రంగా తమ అవసరాలకు తగ్గట్టు ఆవిష్కరణలు చేస్తారు. ఇతర దేశాల అవసరాలు సైతం తీరుస్తారు. దాంతో దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకోసం విద్య, పరిశోధనలు ఎంతో అవసరం. దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ కాలుష్య నిర్వహణ, ట్రాఫిక్ నిర్వహణ, స్వచ్ఛమైన నీటిని అందించడంలో మొదటి దశలోనే ఉన్నాయి. పేదప్రజల జీవితాలను ప్రభావితం చేసే ప్రతి మారుమూల ప్రాంతం నాలుగో దశకు చేరాలని కోరుకుంటున్నాను’అని ఆయన తెలిపారు.

పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను జాతీయ విద్యా విధానంలో భాగం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చని మూర్తి అభిప్రాయపడ్డారు. ‘దేశంలో, ప్రపంచవ్యాప్తంగా STEM(సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌)రంగంలో నిష్ణాతులైన 10వేల మంది విశ్రాంత ఉపాధ్యాయులను నియమించాలి. వారితో సుమారు 2500 "ట్రైన్ ది టీచర్" కాలేజీలను ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పించాలి. అందుకోసం వారికి ఏటా లక్ష అమెరికా డాలర్లు(రూ.83లక్షలు) చెల్లించాలి. ఏటా వీరికి రూ.8300కోట్లు, ఇరవై సంవత్సరాలకు రూ.1.66లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. త్వరలో దేశం రూ.415లక్షల కోట్ల జీడీపీ లక్ష్యంగా ఎదుగుతుంది. ఉపాధ్యాయులకు చెల్లించేది దేశానికి పెద్ద ఆర్థిక భారం కావపోవచ్చు’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: చిన్నతనంలో అక్కడే మేం విడిపోయాం: ఆనంద్‌ మహీంద్రా

నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ఇండియా 2020 విధానాన్ని 29 జులై 2020న ప్రవేశపెట్టారు. 2030 వరకు దేశం సుస్థిరాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top