RBI నిర్ణయం.. బ్యాంకు EMIలపై ఇదే ప్రభావం.. | Repo Rate Explained, How RBI Rate Affect Your Monthly EMIs And Interest Rates, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

RBI నిర్ణయం.. బ్యాంకు EMIలపై ఇదే ప్రభావం..

Jun 5 2026 11:53 AM | Updated on Jun 5 2026 12:58 PM

Repo rate explained: How RBI rate affect your EMIs

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లపై తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. కీలక రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) జూన్ 3 నుంచి జూన్5 మధ్య 2027 ఆర్థిక సంవత్సరానికి రెండవ ద్వైమాసిక విధాన సమావేశాన్ని నిర్వహించింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులు.. రూపాయి అస్థిరతలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఏమిటీ రెపో రేటు?
ఆర్బీఐ తీసుకునే అత్యంత నిశితంగా పరిశీలించే నిర్ణయాలలో ఒకటి పాలసీ రెపో రేటు. ఇది మీరు ఇల్లు, కారు, వ్యక్తిగత రుణాలపై చెల్లించే వడ్డీ రేటును, ఫిక్స్డ్ డిపాజిట్లపై మీరు సంపాదించే రాబడిని, మీ మార్కెట్ పెట్టుబడుల పనితీరును కూడా నేరుగా ప్రభావితం చేస్తుంది. రెపో రేటు అనేది సెంట్రల్ బ్యాంక్ (ఆర్బీఐ) వాణిజ్య బ్యాంకులకు రుణాలు అందించే రేటు. అంటే మీ బ్యాంకు ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఫండ్ అవసరమైనప్పుడల్లా ఈ రెపో రేటుతో ఆర్బీఐ నుండి రుణం తీసుకుంటుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధిక వడ్డీకి రుణం తీసుకుంటే కస్టమర్లకు కూడా అధిక వడ్డీకి రుణం ఇస్తారు. రెపో రేటు ఎంత ఎక్కువగా ఉంటే, మీరు తీసుకునే రుణంపై మీరు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అది ఎంత తక్కువగా ఉంటే, మీ రుణంపై చెల్లించాల్సి వడ్డీ అంత తగ్గుతుందన్నమాట.

ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, నియంత్రణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నప్పుడు రెపో రేటును పెంచే అంశాన్ని ఆర్బీఐ పరిగణించవచ్చు. అధిక వడ్డీ రేట్లు రుణాలను మరింత ఖరీదైనవిగా మారుస్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. డిమాండ్‌ను తగ్గిస్తుంది. మరోవైపు, ఆర్బీఐ ఆర్థిక కార్యకలాపాలను పెంచాలనుకున్నప్పుడు రెపో రేటును తగ్గిస్తుంది. తక్కువ వడ్డీ రేట్లు రుణాలు, ఖర్చులను ప్రోత్సహిస్తాయి. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యతను పెంచుతాయి. జీడీపీ వృద్ధికి మద్దతు ఇస్తాయి.

ఈఎంఐలపై ప్రభావం
ప్రస్తుతం, ఆర్బీఐ పాలసీ రెపో రేటును 5.25 శాతంగా ఉంచింది. కాబట్టి ప్రస్తుతానికి చెల్లించాల్సిన లోన్‌ ఈఎంఐలలో ఎలాంటి మార్పు ఉండదు. అదే ఒక వేళ మార్పులు చేసి ఉంటే ఎలా ఉండేదో ఉదాహరణతో చూద్దాం..

మీకు 8.25% ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో 20 సంవత్సరాల కాలపరిమితితో రూ.50 లక్షల గృహ రుణం ఉందనుకోండి. ఈ రేటుతో, మీ నెలవారీ ఈఎంఐ రూ. 42,603కు వస్తుంది. ఇప్పుడు, ఆర్బీఐ రెపో రేటును 5.25% నుండి 5 శాతానికి  తగ్గించి ఉంటే మీ బ్యాంక్ మొత్తం 0.25% తగ్గింపును పాస్ చేస్తే, మీ గృహ రుణ వడ్డీ రేటు 8 శాతానికి పడిపోతుంది. ఫలితంగా మీ ఈఎంఐ రూ.41,822కు తగ్గేది. అంటే నెలకు రూ.781 మేర తగ్గేదన్న మాట.

అదే ఆర్బీఐ రెపో రేటును 5.25 శాతం నుంచి 5.5 శాతానికి పెంచి ఉంటే, మీ బ్యాంకు మొత్తం 0.25 శాతం వడ్డీ రేటును కస్టమర్లకు బదిలీ చేస్తే, మీ గృహ రుణ వడ్డీ రేటు 8.5 శాతానికి పెరుగుతుంది. ఫలితంగా, మీ చెల్లించాల్సిన ఈఎంఐ రూ.43,391కు పెరుగుతుంది. అంటే మీరు ప్రతి నెలా అదనంగా రూ.788 చెల్లించాల్సి వచ్చేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement