జూన్‌లో 5 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: సిమెంటు, విద్యుత్, ముడి ఇనుము దన్నుతో జూన్‌లో తొమ్మిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తి అయిదు నెలల గరిష్టమైన 5 శాతానికి ఎగిసింది. 2025 జూన్‌లో ఇది 1.1 శాతంగా, 2026 మే నెలలో 3.2 శాతంగా నమోదైంది. తాజాగా విడుదల చేసిన అధికారిక గణాంకాల్లో బేస్ ఇయర్‌ని 2011–12 నుంచి 2022–23కి మార్చారు. ఇందులో తొమ్మిదో రంగంగా ముడి ఇనుమును కూడా జోడించారు.
గణాంకాల ప్రకారం ముడిచమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల ఉత్పత్తి క్షీణించింది. మరోవైపు సిమెంటు, విద్యుదుత్పత్తి 9.8 శాతం చొప్పున, కొత్తగా చేర్చిన ముడి ఇనుము రంగం ఉత్పత్తి 43.9 శాతం మేర వృద్ధి చెందగా, ఉక్కు 4.6 శాతానికి నెమ్మదించింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో కీలక రంగాలు 3.6 శాతం వృద్ధి చెందాయి. గతేడాది ఇదే వ్యవధిలో వృద్ధి 1 శాతానికి పరిమితమైంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా వరుసగా నాలుగో నెలా ఎరువుల ఉత్పత్తి మందగించింది.


