దిగ్గజాల దిశగా ఇన్‌ఫ్రా | Reasons Why Construction infrastructure Companie Fail | Sakshi
Sakshi News home page

దిగ్గజాల దిశగా ఇన్‌ఫ్రా

Jul 6 2026 5:00 AM | Updated on Jul 6 2026 5:00 AM

Reasons Why Construction infrastructure Companie Fail

ఆధునిక భారతానికి లక్షల కోట్ల వ్యయం

హైవేలతో పాటు వందలాది ఎయిర్‌పోర్టులు

సెమీకండక్టర్‌ ఫ్యాబ్‌లు, డేటాసెంటర్లు కూడా

హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు, ఎనర్జీ ప్రాజెక్టుల్లో వ్యయం

వీటన్నిటిలో సింహభాగం నాలుగైదు దిగ్గజాలకే

మార్జిన్ల సవాళ్లతో చిక్కిపోతున్న చిన్న కంపెనీలు

మెరుగైన పనితీరుతో ఎదుగుతున్న అగ్రశ్రేణి సంస్థలు

‘మెట్రో టు న్యూక్లియర్‌’ అన్నింటికీ విస్తరించిన ఎల్‌ అండ్‌టీ 

అన్‌లిస్టెడ్‌ అయినా అగ్రస్థానంలో ఎంఈఐఎల్, టాటా ప్రాజెక్ట్స్‌

వీటికి దీటుగా ఎదుగుతున్న మరో నాలుగైదు సంస్థలు

కన్సాలిడేషన్‌ స్పష్టం... భవిష్యత్తు అతికొద్ది కంపెనీలదే

ఇన్వెస్టర్లు గమనించాల్సింది ఇలాంటి కంపెనీలనే  

ఇపుడు ఇన్‌ఫ్రా వంతు. టెలికం, ఏవియేషన్, బ్యాంకింగ్, రిటైల్‌ రంగాల మాదిరే ఇన్‌ఫ్రాలోనూ కన్సాలిడేషన్‌ జరుగుతోంది. ఏడెనిమిదేళ్ల కిందట బోలెడన్ని కంపెనీలు చేతినిండా ఆర్డర్లతో స్టాక్‌మార్కెట్లోనూ కళకళలాడాయి. ఇపుడు చిన్న కంపెనీలకు ఆర్డర్లు వస్తున్నాయి. కానీ షేర్లు కదలటం లేదు. లిస్టెడ్‌–అన్‌లిస్టెడ్‌ కలిసి టాప్‌ 4–5 కంపెనీలే మెరుస్తున్నాయి.

మరో మూడునాలుగు కంపెనీలు వాటికి వెనక ఉన్నా... పెద్ద సంఖ్యలో కంపెనీలు వెలవెలబోతున్నాయి. ఎందుకిలా? రూ.12 లక్షల కోట్ల హైవే నెట్‌వర్క్‌... వందల కొద్దీ ఎయిర్‌పోర్టులు, సెమీకండక్టర్‌ పార్క్‌లు, డేటాసెంటర్లు, రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టులు, హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు ఇన్ని కడుతున్నా ఇన్‌ఫ్రా కంపెనీలు ఎందుకు డీలాపడి ఉన్నాయి? అసలు ఈ రంగంలో ఏం జరుగుతోంది? ఏ షేర్లు బాగుంటాయి? భవిష్యత్తు లీడర్లెవరు? ఈ విశ్లేషణే ఈ వారం సాక్షి వెల్త్‌ స్టోరీ...
- మంథా రమణమూర్తి 

ఒక రేసు చూడండి. అందరూ మొదలెట్టేది ఒకచోటే. రేసు నడుస్తున్న కొద్దీ... కొందరు ఆగిపోతారు. కొందరు కుప్పకూలతారు. కొందరు వెనకబడతారు. కఠోర శిక్షణ, శారీరక, మానసిక సామర్థ్యాల ఆధారంగా ఓ ముగ్గురు టాప్‌–3లో ఉంటారు. వారి వెనక మరికొందరుంటారు. అంతే! దేశంలో గత రెండు దశాబ్దాలుగా ఒక రంగం తరవాత మరో రంగం చెబుతున్న స్టోరీ ఇదే.  

కన్సాలిడేషన్‌...ఇలా 
బూమ్‌లో చాలా కంపెనీలొచ్చి ఎదుగుతాయి. పోటీ పెరిగి.. లాభాలు తగ్గుతాయి. విస్తరణతో డిమాండ్‌ పెరిగి... ప్రభుత్వ సంస్కరణలు, టెక్నాలజీ మార్పులతో భారీ పెట్టుబడులు అవసరమవుతాయి. బలహీన సంస్థలు మాయమవుతాయి. విలీనాలు, దివాలాలు, కొనుగోళ్లతో... టాప్‌–3 లేదా 5 లీడర్లు మిగులుతారు. అంతకంతకూ పెరిగి... లాభాలతో వాటి విలువ కూడా పెరుగుతుంది. ఇన్వెస్టర్లకు సంపద సృష్టిస్తాయి. బ్యాకింగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్‌... టెలికంలో ఎయిర్‌టెల్, జియో చేసింది అదే. ఏవియేషన్‌లోనూ కింగ్‌ఫిషర్, జెట్, గోఫస్ట్, ఎయిర్‌డెక్కన్‌ అన్నీ మాయమై.. ఇండిగో, ఎయిరిండియా నిలిచాయి. సిమెంట్, పెయింట్స్, రిటైల్‌దీ ఇదే దారి. ఇదే కన్సాలిడేషన్‌ సైకిల్‌. 

ఇన్‌ఫ్రాలో ఏం జరుగుతోందంటే... 
గతంలో రూ.200 కోట్ల నుంచి రూ. 500 కోట్ల విలువైన రోడ్డు ప్రాజెక్టుల్ని ప్రాంతీయ కంపెనీలు దక్కించుకుని పూర్తిచేసేవి. ఇపుడు విలువ మారింది. ప్రభుత్వాలు రూ. 10 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల వరకూ భారీ ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తున్నాయి. వీటిని దక్కించుకుని పూర్తిచేయాలంటే... ఆర్థికంగా పటిష్టతతో పాటు అడ్వాన్స్‌డ్‌ ఇంజనీరింగ్, వేల మంది నిపుణులు, భారీ ఎక్విప్‌మెంట్, అంతర్జాతీయ టెక్నాలజీ భాగస్వామ్యాలు, పటిష్ఠమైన బ్యాంకింగ్‌ బంధాలు ఉండాలి.

కానీ ఇవన్నీ ఉండేది కొద్దిమందికే. కాబట్టి ప్రాజెక్టులు వీరికే వస్తాయి. ఏటా వీరి ఆర్డర్‌బుక్‌ పెరుగుతుంది. లాభాలు పెరుగుతాయి. బ్యాంకులు మరిన్ని రుణాలిస్తాయి. క్రెడిట్‌ రేటింగ్‌ పెరిగి పోటీ సామర్థ్యం ఇంకా మెరుగు పడుతుంది. ఈ సైకిల్‌ కొనసాగుతుంది. చిన్నకంపెనీలకు ఇబ్బందులు పెరిగి ముందుకెళ్లటం కష్టమవుతుంటుంది.  

చిన్న కంపెనీలకు ఇబ్బందులేంటి?
చిన్న ఈపీసీ (ఇంజనీరింగ్‌–ప్రొక్యూర్‌మెంట్‌–కన్‌స్ట్రక్షన్‌) కంపెనీలకు ఇబ్బందులు ఎక్కువే. రుణాలు దొరకటం కష్టం. దొరికినా వడ్డీలెక్కువ. వర్కింగ్‌ క్యాపిటల్‌ తక్కువ. బ్యాంకు గ్యారంటీలు కూడా ఖరీదే. పెరిగే ఎక్విప్‌మెంట్‌ వ్యయాన్ని తట్టుకోవటం, స్కిల్డ్‌ వర్కర్స్‌ని తెచ్చుకోవటం.. అన్నీ సవాళ్లే. అందుకే... వీటికి కాంట్రాక్టు దక్కినా దాన్ని పూర్తిచేయటంలో ఉండే ఇబ్బందుల వల్ల లాభాలు తగ్గుతాయి. దీంతో చాలా సంస్థలు తక్కువ మార్జిన్లుండే సబ్‌కాంట్రాక్టింగ్‌ పనులకే పరిమితమైపోతున్నాయి. దీనివల్ల పెద్ద కంపెనీలు ఇంకా పెద్దవిగా మారుతూనే ఉంటాయి.

ఇన్వెస్టర్లు గమనించాల్సింది ఇదే...
ఒక కంపెనీకి కొత్త ఆర్డరు వచ్చిందనుకోండి!. ఇన్వెస్టర్లు ఇట్టే ఆకర్షితులైపోతారు. కానీ ఆ కంపెనీ దాన్ని ఎలా పూర్తి చేస్తుంది? లాభాలు ఏ స్థాయిలో ఉంటాయన్నదే దాని వృద్ధికి గీటురాయి. అందుకని ఆర్డర్‌ బుక్‌ కాకుండా... అమలు తీరే ప్రధానం. చేతిలో ఆర్డర్లు తక్కువగా ఉన్నా... వాటిని సకాలంలో పూర్తిచేస్తూ మార్కెట్‌ వాటాను పెంచుకుంటూ లాభాలను మెరుగుపరుచుకునే కంపెనీలదే భవిష్యత్తు. వచ్చే దశాబ్దంలో ఇలాంటివే విజేతలుగా నిలుస్తాయి.


ఇన్వెస్టర్లు చూడాల్సింది వీటినే...
ఆధునిక భారత నిర్మాణమనేది ఇపుడు కళ్లెదుట నిలిచిన వాస్తవం. దాన్ని ఎవరు నిర్మిస్తారన్నదే ఇన్వెస్టర్లు వేసుకోవాల్సిన ప్రశ్న. ఎందుకంటే అలా నిర్మించిన వారే సంపదనూ సృష్టిస్తారు.  

ఇన్‌ఫ్రాలో ఇలాంటి ట్రెండ్‌ను చూసేటపుడు కంపెనీలను 3 అంచెలుగా చూడొచ్చు. మొదటి అంచెలో... వచ్చే ఒకటిరెండు దశాబ్దాలు ఈ రంగాన్ని శాసించే సంస్థలు కనిపిస్తాయి. అలాంటివాటిలో... 

లార్సన్‌ అండ్‌ టూబ్రో: ఇదో ఇంజనీరింగ్‌ జెయింట్‌. కాలుపెట్టని సెగ్మెంట్‌ లేదు. మెట్రోలు, హైవేలు, డిఫెన్స్, న్యూక్లియర్, డేటా సెంటర్లు, గ్రీన్‌హైడ్రోజన్, సెమీ కండక్టర్‌ ప్లాంట్లు, ఆఫ్‌షోర్‌ ఎనర్జీ, అంతర్జాతీయ ఈపీసీ కాంట్రాక్టులు... అన్నిట్లోనూ ఉంది.  

  మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా(ఎంఈఐఎల్‌): అన్‌లిస్టెడ్‌ ఇన్‌ఫ్రా కంపెనీల్లో దీన్నే నెంబర్‌–1గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇరిగేషన్, వాటర్, ఆయిల్‌–గ్యాస్‌ పైప్‌లైన్లు, పవర్, మెట్రో, రెన్యూవబుల్‌ ఎనర్జీ, పంప్డ్‌ స్టోరేజీ వంటి అన్నిట్లోనూ ఉంది. ఒకప్పుడు ఎల్‌ అండ్‌ టీకే పరిమితమైన రంగాల్లో పోటీపడి ఈ సంస్థ దక్కించుకునే ప్రాజెక్టులు అంతకంతకూ పెరుగుతున్నాయి.  

టాటా ప్రాజెక్ట్స్‌: అన్‌లిస్టెడ్‌ ఇన్‌ఫ్రా కంపెనీల్లో అంతకంతకూ ఎదుగుతున్న సంస్థ ఇది. సెమీ కండక్టర్‌ ఫ్యాబ్‌లు, డేటా సెంటర్లు, ఎయిర్‌పోర్టులు, మెట్రోలు, ఇండ్రస్టియల్‌ ఈపీసీ కాంట్రాక్టుల్లో దీని ఆధిపత్యం పెరుగుతోంది. వచ్చే పదేళ్లలో మరింత విస్తరించే అవకాశముంది.

టైర్‌–2లో బలమైన పోటీదార్లు...
ఈ కేటగిరీలో ఉన్న సంస్థలు ఎల్‌ అండ్‌ టీ మాదిరిగా అన్ని రంగాల్లోనూ లేవు. కానీ తమకంటూ ప్రత్యేకమైన రంగాల్లో సత్తా చాటుతున్నాయి.  
 ఎన్‌సీసీ: బిల్డింగ్స్, వాటర్, రోడ్లు, రైల్వేలు, ఎలక్ట్రికల్‌ వర్క్‌లు, మైనింగ్‌ రంగాల్లో విస్తరించిన ఎన్‌సీసీ ఈ డైవర్సిఫికేషన్‌ను కొనసాగిస్తోంది.  
కల్పతరు ప్రాజెక్ట్స్‌: అంతర్జాతీయంగానూ ఎదుగుతోంది. ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, రైల్వేలు, ఆయిల్‌ –గ్యాస్, బిల్డింగ్‌ వర్క్‌లో సత్తా చాటుతూ అగ్రశ్రేణి 
ఇంజనీరింగ్‌ కంపెనీగా ఎదుగుతోంది. 

కేఈసీ ఇంటర్నేషనల్‌: ఆర్‌పీజీ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ పవర్‌ ట్రాన్స్‌మిషన్, రైల్‌ ఎలక్ట్రిఫికేషన్, సివిల్‌ ఈపీసీ వర్క్స్‌లో వాటా పెంచుకుంటోంది. ఒక మోస్తరు ప్రాజెక్టుల్ని దక్కించుకుంటూ అంతర్జాతీయంగా ఎదగటానికి ప్రయతి్నస్తోంది.  
ఆఫ్‌కాన్స్‌ ఇన్‌ఫ్రా: మెరైన్, అండర్‌గ్రౌండ్‌ మెట్రో, బ్రిడ్జ్‌లు, టన్నెల్స్, విదేశీ ప్రాజెక్టుల్లో దీనికో ప్రత్యేకత ఉంది. హెవీ సివిల్‌ ఇంజనీరింగ్‌ సంస్థల్లో దీనిది ప్రత్యేక స్థానం. 
 షాపూర్‌జీ పల్లోంజీ (అన్‌లిస్టెడ్‌): రుణాల పరంగా సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ దీని ఇంజినీరింగ్‌ సామర్థ్యాలు మాత్రం దేశంలో అత్యుత్తమమనే చెప్పాలి. ప్రత్యేకించి భవనాలు, పారిశ్రామిక ప్రాజెక్టులు, సంక్లిష్టమైన సివిల్‌ నిర్మాణాలు దీని ప్రత్యేకత.

టైర్‌–3 స్పెషలిస్టు కంపెనీలు...
ఈ కేటగిరీలో రైల్‌ వికాస్‌నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌), ఇర్కాన్‌ ఇంటర్నేషనల్, ఐఆర్‌బీ ఇన్‌ప్రా డెవలపర్స్, అశోకా బిల్డ్‌కాన్, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్, పిఎన్‌సీ ఇన్‌ప్రాటెక్, హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్, టెక్నో ఎలక్ట్రిక్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ వంటి సంస్థల్ని చూడొచ్చు. ఇవి రైల్వే ఇన్‌ఫ్రా, టోల్‌రోడ్లు, హైవేలు, రోడ్లు, వాటర్, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు వంటి వాటిల్లో ఒకటిరెండు రంగాలకే పరిమితమవుతున్నాయి. స్పెషలిస్ట్‌ ఈపీసీ కంపెనీలుగా ఎదుగుతున్నాయి.

ఎల్‌ అండ్‌ టీకి ఎందుకంత ప్రీమియం?
సాధారణంగా ఇన్‌ఫ్రా కంపెనీలు వాటి పుస్తక విలువకంటే (బుక్‌వేల్యూ) రెండుమూడు రెట్లు ఎక్కువగా పీఈ విలువకంటే 10–15 రెట్లు ఎక్కువగా ట్రేడవుతున్నాయి. కానీ ఎల్‌ అండ్‌ టీ బుక్‌వేల్యూ కన్నా ఐదారురెట్లు, పీఈకన్నా 30 రెట్లు ఎక్కువగా ట్రేడవుతోంది. ఎందుకంటే ఎల్‌టీ అనేది ఈపీసీ కంపెనీ మాత్రమే కాదు. ఐటీ సర్వీసులు, డిఫెన్స్, డేటా సెంటర్లు, హైడ్రోజన్, విదేశీ కాంట్రాక్టుల్లో ఉంది.

భారీ క్యాష్‌ఫ్లోతో పాటు మెరుగైన ఆర్‌ఓసీఈ (వినియోగించిన మూలధనంపై రాబడి) ఉంది. పైపెచ్చు ఏఐ బూమ్‌తో రానురాను ఇన్‌ఫ్రాకు అర్థం మారుతోంది. రోడ్లు, వంతెనలు మాత్రమే కాక ఇన్‌ప్రా అంటే ఏఐ డేటా సెంటర్లు, సెమీ కండక్టర్‌ ఫ్యాబ్‌లు, పవర్‌ ట్రాన్స్‌మిషన్, గ్రీన్‌ఎనర్జీ అనే స్థాయికి చేరుతోంది. వీటన్నిట్లోనూ ఎల్‌ అండ్‌ టీ ఉంది. పైపెచ్చు ఇన్‌ఫ్రాలో ఆర్డర్‌బుక్‌ కంటే ఆర్‌ఓసీఈ, ఫ్రీ క్యాష్‌ఫ్లో, వర్కింగ్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్, యాజమాన్య పద్ధతులు, ప్రాజెక్టు పూర్తిచేసే సామర్థ్యాలకే మార్కెట్‌ విలువిస్తోంది. ఇవన్నీ ఎల్‌ అండ్‌ టీని అగ్రస్థానంలో నిలుపుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement