
ఏఎండీ జీఎం ఆండ్రూ డీక్‌మాన్
ఇంజినీరింగ్ కోణంలో భారత్ తమకు అత్యంత కీలకమైన మార్కెట్‌గా ఉంటోందని ఏఎండీ జనరల్ మేనేజర్ (డేటా సెంటర్ జీపీయూ వ్యాపార విభాగం) ఆండ్రూ డీక్‌మాన్ తెలిపారు. టెల్కో దిగ్గజం రిలయన్స్ జియో తదితర సంస్థలు తమ డేటా సెంటర్లలో గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను (జీపీయూ) ఉపయోగిస్తున్నట్లు వివరించారు. భారత్‌లో జియో తమకు ముఖ్యమైన భాగస్వామి అని కంపెనీ నిర్వహించిన అడ్వాన్సింగ్ ఏఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు.
దేశీయంగా ఏఐ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏఎండీ పోటీ సంస్థ ఎన్‌విడియాతో జియో జట్టు కట్టిన నేపథ్యంలో ఆండ్రూ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏఎండీకి భారత్‌లో 8,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ఏఐ చాలా పెద్ద మార్కెట్ అని, ఏ ఒక్క సంస్థకో ఇది పరిమితం కాదని ఆండ్రూ చెప్పారు.
ఇదీ చదవండి: ఏటా ఒక ఎలక్ట్రిక్ బైక్ లాంచ్‌కు ప్రణాళికలు
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 దేశాల ప్రభుత్వాలకు ఏఐపరంగా తోడ్పాటు అందించడంపై ఏఎండీ కలిసి పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పోటీ సంస్థలతో పోలిస్తే తమ చిప్‌లు తక్కువ ధరలో మరింత మెరుగైన పనితీరు కనపరుస్తున్నాయని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఏఎండీ సీఈవో లీసా సూ చెప్పారు.