
ముంబై: దేశీ పెయింట్స్ దిగ్గజం ఏషియన్ పెయింట్స్‌లో తనకున్న 4.9 శాతం వాటాలను విక్రయించడంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ వాటా విలువ దాదాపు రూ. 11,140 కోట్లుగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఏకమొత్తంగా ఒకేసారి లేదా పలు డీల్స్ ద్వారానైనా ఈ లావాదేవీని నిర్వహించేందుకు బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీవోఎఫ్‌ఏ)ను నియమించుకున్నట్లు సమాచారం.
అయితే, ప్రస్తుత మార్కెట్ ధర కంటే డిస్కౌంట్‌కే ఆఫర్లు వస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎప్పుడో 17 ఏళ్ల క్రితం 2008 జనవరిలో రిలయన్స్ ఈ వాటాలను రూ. 500 కోట్లతో కొనుగోలు చేసింది. దానితో పోలిస్తే ప్రస్తుత ధర ప్రకారం దాదాపు 24 రెట్లు లాభాన్ని కంపెనీ అందుకోనుంది.
పెయింట్స్ పరిశ్రమలో పోటీ తీవ్రం కావడంతో ఏషియన్ పెయింట్స్ మార్కెట్ వాటా గత ఆర్థిక సంవత్సరం 59 శాతం నుంచి 52 శాతానికి తగ్గింది. అలాగే గత ఏడాది వ్యవధిలో షేరు విలువ సుమారు 19 శాతం పైగా క్షీణించింది. దేశీయంగా నంబర్ వన్ స్థానంలో ఉన్న ఏషియన్ పెయింట్స్ అంతర్జాతీయంగా 8వ స్థానంలో ఉంది. 15 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.