హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ కొత్త రికార్డులు | Real estate new records in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ కొత్త రికార్డులు

May 31 2025 8:59 AM | Updated on May 31 2025 12:27 PM

Real estate new records in Hyderabad

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. కోకాపేట, మోకిలలో రికార్డు స్థాయిలో భూములు అమ్ముడుపోగా.. తాజాగా లగ్జరీ గృహాల ధరల వృద్ధిలో మరో మైలురాయిని సాధించింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో విలాసవంతమైన ఇళ్ల ధరలు 42 శాతం మేర పెరిగాయి. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉండే ఈ ప్రీమియం యూనిట్ల రేట్లు ఐదేళ్లలో హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో పెరిగాయని ఓ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడైంది. 
– సాక్షి, సిటీబ్యూరో  

హైదరాబాద్‌లో 2018లో విలాసవంతమైన ఇళ్ల ధరలు చ.అ.కు రూ.7,450గా ఉండగా.. ప్రస్తుతం ఏకంగా రూ.10,580కి పెరిగాయి. ఇదే సమయంలో బెంగళూరు, ముంబై నగరాలలో లగ్జరీ ఇళ్ల ధరలు 27 శాతం మేర పెరిగాయి. కరోనా తర్వాత నుంచి లగ్జరీ గృహాల సరఫరా, డిమాండ్‌ పెరగడమే ఈ వృద్ధికి కారణం. 2018లో బెంగళూరులో ప్రీమియం ఇళ్ల ధరలు చ.అ.కు రూ.10,210గా ఉండగా.. ఇప్పుడది రూ.12,970కి పెరిగింది. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లో రూ.23,119 నుంచి రూ.29,260కి చేరింది.

దేశంలోని సగటు చూస్తే..  
2018 నుంచి 2024 నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో సరసమైన గృహాల విలువలు సగటున 15 శాతం మేర పెరిగితే.. విలాసవంతమైన గృహాల విలువ 24 శాతం వృద్ధి నమోదైంది. రూ.కోటిన్నర కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల ధరలు చ.అ.కు సగటున 2018లో రూ.12,400గా ఉండగా.. 2024 నాటికి రూ.15,350కి పెరిగాయి.

👉ఇది చదివారా? హైదరాబాద్‌లో ప్లాట్లకే డిమాండ్‌..

అందుబాటు గృహాలలో 15 శాతం 
ఏడు ప్రధాన నగరాలలో రూ.40 లక్షలలోపు ధర ఉండే సరసమైన గృహాల విలువలు 15 శాతం మేర పెరిగాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.3,750గా ఉండగా.. ఇప్పుడది రూ.4,310కి పెరిగింది. అఫర్డబుల్‌ కేటగిరీలో అత్యధికంగా ఎన్‌సీఆర్‌లో అత్యధికంగా 19 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ విభాగంలో ధరల వృద్ధిలో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. ఐదేళ్లలో మన నగరంలో 16 శాతం మేర ధరలు పెరిగాయి. అందుబాటు గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.4 వేలుగా ఉంది.

మధ్యతరగతిలో 18 శాతం 
ఐదేళ్ల కాలంలో టాప్‌–7 నగరాలలో రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్య ధర ఉండే మధ్యతరగతి విభాగంలోని ఇళ్ల విలువలలో 18 శాతం మేర వృద్ధి చెందాయి. 2018లో సగటు ధర చ.అ.కు రూ.6,050లుగా ఉండగా.. ఇప్పుడది రూ.7,120కి పెరిగింది. ఈ విభాగంలోనూ అత్యధికంగా 23 శాతం ధరల వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైంది. మన నగరంలో మిడ్‌సైజ్‌ గృహాల ప్రారంభ ధర చ.అ.కు రూ.5,780గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement