హైదరాబాద్‌లో ప్లాట్లకే డిమాండ్‌.. | Open plots has more demand than flats in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ప్లాట్లకే డిమాండ్‌..

May 24 2025 11:41 AM | Updated on May 24 2025 11:55 AM

Open plots has more demand than flats in Hyderabad

‘కొనేటప్పుడు తక్కువకు రావాలి.. అమ్మేటప్పుడు ఎక్కువకు పోవాలి’ అని కోరుకునేది ఒక్క స్థిరాస్తి రంగంలోనే.. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఎవరైనా సరే రాబడి ఎక్కువగా ఉన్న చోట కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఓపెన్‌ ప్లాట్, అపార్ట్‌మెంట్, కమర్షియల్‌ స్పేస్, రిటైల్‌.. ఇలా రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులకు సాధనాలు అనేకం. కానీ, ఓపెన్‌ ప్లాట్లలో ఇన్వెస్ట్‌మెంట్సే ఎక్కువ రాబడి వస్తుందని ఓ సర్వే తెలిపింది. 2015 నుంచి దేశంలోని 8 ప్రధాన నగరాలలో ప్రతి ఏటా స్థలాల ధరలలో 7 శాతం వృద్ధి నమోదవుతుంటే.. అపార్ట్‌మెంట్లలో మాత్రం 2 శాతమే పెరుగుదల కనిపిస్తుందని పేర్కొంది. - సాక్షి, సిటీబ్యూరో

స్థలాల కొరతే కారణం.. 
పెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండటం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయని ఓ సంస్థ సీఈఓ తెలిపారు. అందుకే ప్రధాన నగరాలలో పరిమిత స్థాయిలోని స్థలాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఓపెన్‌ ప్లాట్లకు, ఇండిపెండెంగ్‌ గృహాలకు డిమాండ్‌ ఏర్పడింది. దీంతో పెద్ద నగరాల్లోని శివారు ప్రాంతాలలో బడా డెవలపర్లు ఓపెన్‌ ప్లాట్‌ వెంచర్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారని, దీంతో డిమాండ్‌ పునఃప్రారంభమైందని చెప్పారు.

కరోనాతో పెరిగిన డిమాండ్‌.. 
ఢిల్లీ–ఎన్‌సీఆర్, పుణె, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కత్తా, అహ్మదాబాద్‌ ఎనిమిది ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్‌ ప్లాట్ల కంటే అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేయడానికే ఇష్టపడతారు. ఎందుకంటే భద్రతతో పాటూ పవర్‌ బ్యాకప్, కార్‌ పార్కింగ్, క్లబ్‌ హౌస్, జిమ్, స్విమ్మింగ్‌ పూల్, గార్డెన్‌ వంటి కామన్‌ వసతులు ఉంటాయని అపార్ట్‌మెంట్‌ కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కామన్‌ వసతులు వినియోగం,అపార్ట్‌మెంట్లలో ఎక్కువ జనాభా వంటివి శ్రేయస్కరం కాదనే అభిప్రాయం ఏర్పడింది. దీంతో సొంతంగా స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకోవడమో లేక వ్యక్తిగత గృహాలను కొనుగోలు చేసేందుకే కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు.

13–21 శాతం పెరిగిన ధరలు.. 
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటూ గుర్గావ్‌లోని కొన్ని ప్రధాన ప్రాంతాలలోని నివాస స్థలాలకు డిమాండ్‌ పెరుగుతుందని ఓ సంస్థ రీసెర్చ్‌ హెడ్‌ తెలిపారు. 2018 నుంచి ఆయా నగరాలలోని ఓపెన్‌ ప్లాట్లలో రెండంకెల వృద్ధి నమోదవుతుందని పేర్కొన్నారు. మూడు సంవత్సరాలలో ఈ నగరాల్లో భూముల ధరలు 13–21 శాతం మేర పెరిగాయని చెప్పారు. ఇదే నగరాల్లోని అపార్ట్‌మెంట్ల ధరలలో మాత్రం 2–6 శాతం మేర వృద్ధి ఉందని తెలిపారు. కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల అభిరుచుల్లో వచ్చిన మార్పులు, పాలసీలతో రాబోయే త్రైమాసిక కాలంలో ఈ డిమాండ్‌ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.

హైదరాబాద్‌లో ప్లాట్లకే డిమాండ్‌ ఎక్కువ 
ఇతర దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని ఓపెన్‌ ప్లాట్లకే డిమాండ్‌ ఎక్కువ. 2018–21 మధ్య కాలంలో నగరంలోని స్థలాలలో గరిష్టంగా 21 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదవుతుంది. శంకర్‌పల్లి, పటాన్‌ చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్‌నగర్‌ ప్రాంతాల్లోని స్థలాలకు డిమాండ్, ధరల పెరుగుదల ఎక్కువగా ఉందని తెలిపింది. చెన్నైలో ప్లాట్లలో వార్షిక వృద్ధి రేటు 18 శాతం, బెంగళూరులో 13 శాతం ఉంది. చెన్నైలో అంబత్తూరు, అవడి, ఒరిగడం, శ్రీపెరంబుదూర్, తైయూర్‌ ప్రాంతాలలో, బెంగళూరులో నీలమంగళ, దేవనహళ్లి, చిక్‌బల్లాపూర్, హోస్కేట్, కొంబల్‌గోడు ప్రాంతాల్లోని నివాస ప్లాట్లకు ఆదరణ ఎక్కువగా ఉంది. 
🔸2018–21 మధ్య ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో ప్లాట్ల వార్షిక వృద్ధి రేటు 15 శాతంగా ఉంది. సోహ్నా, గుర్గావ్‌లో భూముల ధరలు ఏటా 6 శాతం పెరుగుతున్నాయి. సెక్టార్‌ 99, ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, సెక్టార్‌ 95ఏ, సెక్టార్‌ 70ఏ, సెక్టార్‌ 63లలోని నివాస స్థలాలలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement