
బ్యాంకింగ్, ఫిన్‌టెక్ రంగాల్లో ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించడంలో విఫలమైనందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ట్రాన్సాక్ట్రీ టెక్నాలజీస్ (లెండ్‌బాక్స్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జరిమానా విధించింది. నిబంధనల ప్రకారం నడుచుకోని సంస్థలపై కఠిన చర్యలుంటాయని ఆర్‌బీఐ పేర్కొంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై జరిమానా
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 నిబంధనలు, పూచీకత్తు లేని వ్యవసాయ రుణాలపై ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.63.6 లక్షల జరిమానా విధించింది. నిధుల బదిలీలో జాప్యం, పూచీకత్తు లేని రుణ విధానాల్లో ఉల్లంఘనలు వెలుగులోకి రావడంతో ఈ జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ముఖ్యంగా వ్యవసాయం వంటి ప్రత్యేక రక్షణ అవసరమయ్యే రంగాల్లో ఆర్థిక సంస్థలు నిర్దేశిత రుణ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చూడాలని ఆర్‌బీఐ నొక్కి చెప్పింది.
ఇదీ చదవండి: ఆరోగ్య బీమా లేకపోతే పేదరికం తప్పదా?
ట్రాన్సాక్ట్రీ టెక్నాలజీస్(లెండ్ బాక్స్)పై పెనాల్టీ
ఆర్‌బీఐ పీర్-టు-పీర్ (పీ2పీ) లెండింగ్ ప్లాట్‌ఫామ్ డైరెక్షన్స్-2017ను పాటించనందుకు లెండ్‌బాక్స్ బ్రాండ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రాన్సాక్ట్రీ టెక్నాలజీస్‌పై రూ.40 లక్షలు జరిమానా విధించింది. దేశ డిజిటల్ లెండింగ్ ఎకోసిస్టమ్‌లో గణనీయమైన వృద్ధిని చూసిన పీ2పీ లెండింగ్ కార్యకలాపాలకు సంబంధించిన లోపాలను సెంట్రల్ బ్యాంక్ గుర్తించింది. ఫిన్‌టెక్ కంపెనీలు పారదర్శకత పాటించాలని, వినియోగదారులు, రుణదాతలను రక్షించడానికి రూపొందించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని గుర్తు చేసింది.