నిధుల వేటలో క్విక్‌ కామర్స్‌.. | Quick commerce platforms are currently on a significant fund-raising spree to expand operations | Sakshi
Sakshi News home page

నిధుల వేటలో క్విక్‌ కామర్స్‌..

Nov 15 2025 4:31 AM | Updated on Nov 15 2025 4:31 AM

Quick commerce platforms are currently on a significant fund-raising spree to expand operations

స్విగ్గీ రూ. 10 వేల కోట్ల క్విప్‌ 

రెండేళ్లలో జెప్టో 2 బిలియన్‌ డాలర్ల సమీకరణ

గతేడాది జొమాటో రూ. 8,500 కోట్ల క్విప్‌ 

దిగ్గజాలతో పోటీపడేందుకు సన్నాహాలు 

క్విక్‌ కామర్స్‌ విభాగంలో పోటీ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కార్యకలాపాల విస్తరణ కోసం కంపెనీలు నిధుల వేటలో పడ్డాయి. క్విప్‌ (క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌) ద్వారా రూ. 10,000 కోట్లు సమీకరించుకునే ప్రతిపాదనకు స్విగ్గీ బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ నిధుల సమీకరణతో పాటు ర్యాపిడోలో వాటాల విక్రయం రూపంలో మరో రూ. 2,400 కోట్లు కూడా లభిస్తే స్విగ్గీ దగ్గర నిధుల నిల్వలు సుమారు రూ. 17,000 కోట్లకు చేరతాయనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు, జెప్టో కూడా జోరుగా నిధులను సమీకరించుకుంటోంది. 

గత రెండేళ్లలో దాదాపు 2 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 17,000 కోట్లు) సేకరించింది. ప్రపంచంలోనే అత్యంత భారీ పెన్షన్‌ ఫండ్స్‌లో ఒకటైన కాలిఫోర్నియా పబ్లిక్‌ ఎంప్లాయీస్‌ రిటైర్మెంట్‌ సిస్టం ఏకంగా 450 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసింది. దేశీ క్విక్‌ కామర్స్‌ మోడల్‌ సామర్థ్యాలపై  సంస్థాగత ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అటు మరో సంస్థ జొమాటో 2024లో క్విప్‌ రూపంలో రూ. 8,500 కోట్లు సమీకరించింది. బ్లింకిట్‌ కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ నిధులు ఉపయోగపడ్డాయి.

రిలయన్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, టాటాకి చెందిన బిగ్‌బాస్కెట్‌ లాంటి సమృద్ధిగా నిధులున్న దిగ్గజాలు రంగంలోకి దూకుడుగా దిగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నిధుల సమీకరణ అనేది రాబోయే రోజుల్లో పోటీ మరింత తీవ్రమైతే దీటుగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని భావిస్తున్న కంపెనీల వ్యూహాలకు సంకేతాలని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బడా కంపెనీలు బరిలోకి దిగడంతో బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించి మరీ దక్కించుకున్న ప్రస్తుత మార్కెట్‌ వాటాను నిలబెట్టుకోవడం అంకుర సంస్థలకు కష్టమవుతుందని వివరించాయి. దీంతో రాబోయే రెండేళ్లలో కొత్త మార్కెట్లు, కొత్త మౌలిక సదుపాయాలు, కొత్త ఉత్పత్తులపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నాయి.  

దిగ్గజాల వ్యూహాలు.. 
క్విక్‌ కామర్స్‌ విభాగంలోకి బడా కంపెనీలు కాస్త లేటుగా ప్రవేశించినా, లేటెస్ట్‌ వ్యూహాలతో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ 2024 ఆగస్టులో మినిట్స్‌ పేరిట డార్క్‌ స్టోర్స్‌ను ప్రారంభించింది. ఏడాది కూడా తిరగకుండానే 2025 ఏప్రిల్‌ నాటికి వీటి సంఖ్యను మూడు రెట్లు పెంచింది. ఈ ఏడాది ఆఖరు నాటికి వీటిని 800కి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక అమెజాన్‌ నెమ్మదిగా బెంగళూరులో కార్యకలాపాలు ప్రారంభించి ఢిల్లీ, ముంబైకి విస్తరించింది. 

ఈ ఏడాది ఆఖరు నాటికి 300 డార్క్‌ స్టోర్స్‌ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. అటు జియోమార్ట్‌ సొంత గ్రూప్‌నకు చెందిన 3,000 పైచిలుకు రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్స్‌తోనే క్విక్‌ కామర్స్‌ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పటికే 600 పైచిలుకు డార్క్‌స్టోర్స్‌ ఏర్పాటు చేసింది.  అరగంటలో డెలివరీలు అందించేందుకు సొంత నెట్‌వర్క్‌ని ఉపయోగించుకోవడంతో పాటు స్థానిక కిరాణా దుకాణాలతో కూడా చేతులు కలిపింది.   

లాభదాయకత అంతంతే..
క్విక్‌ కామర్స్‌ అంకురాలు భారీగా నిధులు సమీకరిస్తున్నప్పటికీ అవన్నీ కార్యకలాపాల విస్తరణకు, కస్టమర్లను దక్కించుకోవడానికి ఖర్చయిపోతున్నాయే తప్ప లాభదాయకతనేదేమీ పెద్దగా కనిపించడం లేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. రాబోయే రోజుల్లోనూ మార్కెట్‌ వాటాను దక్కించుకోవడానికి మరింతగా ఖర్చు చేయాల్సి రానుంది కాబట్టి ఇదే ధోరణి మరికొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉందని వివరించాయి. 2026 తొలి రెండు త్రైమాసికాల్లో వ్యయాలు కాస్త తగ్గుముఖం పట్టొచ్చని పేర్కొన్నాయి. 

ఇన్వెస్టర్ల ఆకాంక్షల మేరకు ఆ తర్వాత లాభదాయకతపై తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సి వస్తుందని వివరించాయి. స్విగ్గీలాంటి సంస్థలు లిస్టయి ఏడాది దాటినా స్టాక్‌లో పెద్దగా మార్పు లేకపోవడంపై ఇన్వెస్టర్లు అసంతృప్తిగా ఉన్నారని తెలిపాయి. లాభదాయకంగా మారే అవకాశాలు ఉన్నప్పటికీ తాజాగా మళ్లీ ఎందుకు నిధులను సమీకరించాల్సి వస్తోందనేది లిస్టెడ్‌ కంపెనీలుగా చెప్పాల్సిన బాధ్యత వాటిపై ఉంటుందని విశ్లేషకులు తెలిపారు. క్విక్‌ కామర్స్‌ తొలినాళ్లతో పోలిస్తే అర్థరహితంగా చేసే వ్యయాలను ఇన్వెస్టర్లు సహించే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు.   

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement