క్విక్ సర్వీస్ రెస్టారెంట్ల(క్యూఎస్‌ఆర్) చైన్‌లు దేవయాని ఇంటర్నేషనల్, శాఫైర్ ఫుడ్స్ ఏకంకానున్నాయి. దీంతో 3,000 స్టోర్లతో దేశీయంగా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం అవతరించనుంది. ఫలితంగా సుప్రసిద్ధ బ్రాండ్లు కేఎఫ్‌సీ, పిజ్జా హట్, టాకో బెల్ ఒకే గొడుగు(నిర్వాహక సంస్థ) కిందకు చేరనున్నాయి.
దేవయాని ఇంటర్నేషనల్‌తో విలీనమయ్యేందుకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు శాఫైర్ ఫుడ్స్ పేర్కొంది. మరోపక్క ఈ విలీనానికి బోర్డు అనుమతించినట్లు దేవయాని ఇంటర్నేషనల్ సైతం ప్రకటించింది. లీడింగ్ ఫాస్ట్ ఫుడ్ ఫ్రాంచైజీ సంస్థలు దేవయాని, శాఫైర్ విలీనం కారణంగా రూ. 8,000 కోట్ల టర్నోవర్‌తో సరికొత్త దిగ్గజం ఊపిరిపోసుకోనుంది.
విలీనం కంపెనీ భారత్‌సహా.. నైజీరియా, నేపాల్, థాయ్‌లాండ్, శ్రీలంకకు కార్యకలాపాలను విస్తరించనుంది. అంతేకాకుండా ఆయా మార్కెట్లలో కోస్టా కాఫీ, టీ లైవ్, న్యూయార్క్ ఫ్రైస్, శనూక్ కిచెన్ తదితర క్యూఎస్‌ఆర్ బ్రాండ్లను సైతం నిర్వహించనుంది. దేశీయంగా క్యూఎస్‌ఆర్ చైన్‌లు వృద్ధి మందగమనం, మార్జిన్లలో క్షీణత, డిమాండ్ పడిపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో భారీ విలీనానికి తెరతీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
విలీన ప్రాతిపదిక
క్యూఎస్‌ఆర్ దిగ్గజాలు దేవయాని, శాఫైర్ ఫుడ్స్ తాజాగా విలీన పథక వివరాలు వెల్లడించాయి. ఒప్పందం ప్రకారం శాఫైర్ వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 100 షేర్లకుగాను 177 దేవయాని ఇంటర్నేషనల్ షేర్లు జారీకానున్నాయి. ప్రస్తుతం శాఫైర్ ప్రమోటర్లు 25.35 శాతం వాటాను కలిగి ఉన్నారు. దీనిలో దేవయాని ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఆర్క్‌టిక్ ఇంటర్నేషనల్ 18.5 శాతం వాటా కొనుగోలు చేయనుంది.
మిగిలిన వాటా దేవయాని షేర్ల జారీతో స్వాప్ చేయనున్నారు. దేశీయంగా ప్రస్తుతం జూబిలెంట్ ఫుడవర్క్స్ క్యూఎస్‌ఆర్ చైన్ విభాగంలో లీడర్‌గా నిలుస్తోంది. భారత్‌తోపాటు.. టర్కీ, బంగ్లాదేశ్, శ్రీలంక, అజర్‌బైజాన్, జార్జియా మార్కెట్లలో కార్యకలాపాలు కలిగి ఉంది. డోమినోస్, పాపైయిస్, డంకిన్ బ్రాండ్ల కంపెనీ సుమారు 3,480 స్టోర్లను నిర్వహిస్తోంది.


