విలువపరంగా ఈ ఏడాది ఐపీవోల్లో 65 శాతం భాగం
గతేడాది ఇది 59 శాతం
టాప్‌లో విశాల్ మెగామార్ట్, మ్యాన్‌కైండ్ మొదలైనవి
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూల్లో భాగంగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో ప్రమోటర్లు వాటాలను విక్రయించడం గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు (జనవరి–నవంబర్) వచి్చన ఐపీవోల్లో విలువపరంగా ఓఎఫ్‌ఎస్ పరిమాణం సుమారు 65 శాతంగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023లో ఇది మొత్తం ఐపీవోల్లో 58 శాతంగా, 2024లో 59 శాతంగా నిల్చింది.
2023లో మొత్తం ఐపీవోల్లో (సంఖ్యాపరంగా) 15.8 శాతం ఇష్యూలు పూర్తిగా ఓఎఫ్‌ఎస్ విధానంలోనే వచ్చాయి. గతేడాది ఈ నిష్పత్తి 15.4 శాతంగా ఉండగా, ఈ ఏడాది 16.5 శాతానికి చేరింది. వ్యాపార విస్తరణ ఇతరత్రా అవసరాల కోసం సదరు ఇష్యూల్లో తాజా షేర్ల జారీ ద్వారా కంపెనీలు కొత్తగా నిధులు సమీకరించలేదు. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లే తమ వాటాలను ఓఎఫ్‌ఎస్ విధానంలో విక్రయించుకున్నారు. 2024లో హ్యుందాయ్, 2025లో ఎల్‌జీ ఎల్రక్టానిక్స్ ఈ తరహా మెగా ఐపీవోల జాబితాలో నిల్చాయి.
గడిచిన మూడేళ్లలో విలువపరంగా ఓఎఫ్‌ఎస్ వాటా అత్యధికంగా ఉన్న టాప్ ఐపీవోల్లో విశాల్ మెగా మార్ట్, మ్యాన్‌కైండ్ ఫార్మా, టాటా టెక్నాలజీస్, ఉయ్‌వర్క్ ఇండియా, శాగిలిటీ ఇండియా, ట్రావెల్ ఫుడ్ సర్విసెస్, సెల్లో వరల్డ్, ఓర్క్‌లా ఇండియా మొదలైనవి ఉన్నాయి. సాధారణంగా ప్రమోటర్లు, బడా సంస్థాగత ఇన్వెస్టర్లు మొదలైన వర్గాలు ఓఎఫ్‌ఎస్ విధానంలో వాటాలు విక్రయిస్తుంటారు.
ప్రస్తుతం ఆఫర్ ఫర్ సేల్ విధానంలో అత్యధికంగా ప్రమోటర్లే విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2025లో వచి్చన ఇష్యూలకు సంబంధించి ఓఎఫ్‌ఎస్ ద్వారా ప్రమోటర్లు సేకరించిన నిధులు (విలువపరంగా) 68.5 శాతంగా నమోదైంది. 2023లో ఈ నిష్పత్తి 52.8 శాతంగా నిల్చింది. పూర్తిగా ఓఎఫ్‌ఎస్ రూపంలోనే వచి్చన టాప్ ఐపీవోల జాబితాలో హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్విసెస్, హెక్సావేర్ టెక్నాలజీస్, ష్లాస్ బెంగళూరు, విక్రమ్ సోలార్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, ఆఫ్కాన్స్ మొదలైనవి ఉన్నాయి.
మెరుగ్గా మార్కెట్లు..
పబ్లిక్ ఇష్యూల్లో ఓఎఫ్‌ఎస్ వాటా పెరుగుతుండటమనేది దేశీ క్యాపిటల్ మార్కెట్ వ్యవస్థ పరిపక్వ స్థాయికి చేరుతున్న సంకేతంగా భావించవచ్చని ప్రైమ్ డేటాబేస్ వర్గాలు తెలిపాయి. 1990లు, 2000ల ప్రాంతంలో చాలా మటుకు ఐపీవోలు తాజాగా పెట్టుబడులు సమీకరించాయని, అలాంటి కంపెనీల పరిస్థితి ఏమైందనేది అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించాయి. ఇక పెద్ద సంఖ్యలో ప్రమోటర్లు ఓఎఫ్‌ఎస్ బాట పడుతున్నప్పటికీ, ఆయా కంపెనీల్లో వారి పెట్టుబడులు తప్పనిసరిగా నిర్దిష్ట స్థాయిలో ఉండేలా చూసేందుకు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నాయి.
అయితే, ఐపీవోల తర్వాత ప్రమోటర్లు బల్క్, బ్లాక్ డీల్స్ కుదుర్చుకునే ధోరణి పెరుగుతోందని, ఇన్వెస్టర్లు దీనిపై ఓ కన్నేసి ఉంచాలని పరిశ్రమ వర్గాలు వివరించాయి. మరోవైపు, ఐపీవో పూర్తిగా ఓఎఫ్‌ఎస్ రూపంలో ఉన్నంత మాత్రాన ప్రతికూలాంశంగా భావించనవసరం లేదని తెలిపాయి. ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ పెట్టుబడులు ఉన్న సంస్థల్లో ఇది సాధారణమేనని వివరించాయి. ప్రారంభ దశలో రిస్క్ క్యాపిటల్ భారీగా అవసరం అవుతుందని, ఆ నిధులను సమకూర్చిన పీఈ, వీసీలు తర్వాత దశలో ఐపీవోల్లో ఓఎఫ్‌ఎస్ కింద వాటాలను విక్రయించుకుంటాయని పేర్కొన్నాయి.


