
పండుగ సీజన్ వచ్చిందంటే ఈ-కామర్స్ కంపెనీలకు, వినియోగదారులకు ఇద్దరికీ పెద్ద పండుగే. ఒకవైపు కంపెనీలు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో అమ్మకాలను పెంచుకోవాలని చూస్తే.. మరోవైపు వినియోగదారులు ఆకర్షణీయమైన ధరల్లో తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయాలని ఆశిస్తుంటారు. ఈ ఉత్సాహంలో కొందరు వినియోగదారులు తొందరపడి అనవసరమైన లేదా నకిలీ వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు మోసాలకు గురవుతుంటారు.
కంపెనీలు ఇచ్చే ఆఫర్లకు లొంగకుండా సురక్షితంగా, తెలివిగా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి వినియోగదారులు తప్పనిసరిగా పాటించవలసిన జాగ్రత్తలు, ఈ-కామర్స్ కంపెనీలు గోప్యంగా ఉంచే ఆఫర్ల వెనుక ఉన్న ఆంతర్యం, డబ్బును ఆదా చేసుకోవడానికి అనుసరించవలసిన విధానాలను పరిశీలిద్దాం.
పండుగ సీజన్‌లో అపరిమితమైన ఆఫర్లు వస్తుంటాయి. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.
భద్రతా పరమైన జాగ్రత్తలు
అధికారిక వెబ్‌సైట్‌లు/యాప్‌లనే వాడాలి..
ఎల్లప్పుడూ విశ్వసనీయమైన ఈ-కామర్స్ వేదికలు (ఉదాహరణకు, అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్) నుంచే షాపింగ్ చేయాలి. ఈమెయిల్, మెసేజ్‌లు లేదా సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులను (Phishing Links) క్లిక్ చేయవద్దు.
వెబ్‌సైట్ ప్రామాణికతను నిర్ధారించుకోవాలి..
పేమెంట్ చేసే ముందు వెబ్‌సైట్ అడ్రస్ (URL) సరిచూసుకోవాలి. నకిలీ వెబ్‌సైట్‌లు అక్షర దోషాలతో కూడిన URLలను కలిగి ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి.
వ్యక్తిగత డేటా విషయంలో అప్రమత్తత..
UPI PINలు, OTPలు (వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు), క్రెడిట్ కార్డ్ వివరాలు లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎవరితోనూ ఫోన్‌లో, మెసేజ్‌లలో లేదా సోషల్ మీడియాలో పంచుకోవద్దు.
పబ్లిక్ వై-ఫైని వాడొద్దు
ఆన్‌లైన్ చెల్లింపులు చేసేటప్పుడు పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించకూడదు. సురక్షితమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ను మాత్రమే వాడాలి.
అత్యంత భారీ డిస్కౌంట్ల పట్ల జాగ్రత్త
ఒక ఆఫర్ నమ్మశక్యం కానంత గొప్పగా (ఉదాహరణకు, 70% కంటే ఎక్కువ డిస్కౌంట్) ఉంటే అది మోసపూరితమయ్యే అవకాశం ఉంది. అటువంటి వాటిని అధికారిక యాప్‌లో లేదా వెబ్‌సైట్‌లో ధ్రువీకరించండి.
కొనుగోలు చిట్కాలు
అవసరాల జాబితా
అమ్మకాలు చేసేందుకు ముందే మీకు నిజంగా అవసరమైన వస్తువుల జాబితాను తయారుచేసుకోవాలి. అందుకు బడ్జెట్‌ను నిర్దేశించుకోవాలి. ఇది అనవసర కొనుగోళ్లను నివారిస్తుంది.
ధరల పోలిక
ఒకే వస్తువును వేర్వేరు ఈ-కామర్స్ సైట్‌లలో ధరలను పోల్చి చూడాలి. ఇందుకోసం ప్రత్యేకమైన ప్రైస్ కంపారిజన్ టూల్స్ లేదా వెబ్‌సైట్‌లను ఉపయోగించవచ్చు.
రివ్యూలు, రేటింగ్‌లు
వస్తువును కొనే ముందు దానిపై ఉన్న కస్టమర్ రివ్యూలు, రేటింగ్‌లు, విక్రేత (Seller) విశ్వసనీయతను తప్పకుండా పరిశీలించండి.
తిరిగి ఇచ్చే విధానం (Return Policy)
పండుగ సీజన్ అమ్మకాల్లో కొన్ని వస్తువులకు రిటర్న్ లేదా ఎక్స్ఛేంజ్ పాలసీలు మారిపోవచ్చు. కాబట్టి, కొనుగోలు చేసే ముందు రిటర్న్ పాలసీని స్పష్టంగా చదవాలి.
ఆఫర్లలోని ఆంతర్యం ఏమిటి?
బ్రౌజింగ్ హిస్టరీ
కొన్ని ఈ-కామర్స్ కంపెనీలు ప్రకటిస్తున్న డిస్కౌంట్లలో మార్కెటింగ్ వ్యూహాలు ఉంటాయి. ఈ-కామర్స్ కంపెనీలు మీ ఆన్‌లైన్ బ్రౌజింగ్ హిస్టరీ, వెబ్‌సైట్‌లో మీరు చూసిన వస్తువులు, కార్ట్‌లో ఉంచిన వస్తువులు, గతంలో చేసిన కొనుగోళ్లు వంటి డేటాను విశ్లేషిస్తాయి. ఈ సమాచారం ఆధారంగా మీకు ప్రత్యేకంగా ఒక డిస్కౌంట్ కోడ్ లేదా ఆఫర్‌ను అందిస్తాయి.
ఉదాహరణకు, మీరు ఒక వస్తువును కార్ట్‌లో చేర్చి కొనుగోలు చేయకుండా వదిలేస్తే ఆ వస్తువుపై తగ్గింపుతో కూడిన ఈమెయిల్ లేదా నోటిఫికేషన్‌ను మీకు పంపుతాయి.
ధరలు
కొన్ని కంపెనీలు వాడుతున్న టూల్స్ ఏ వినియోగదారుడు ఎంత ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడో అంచనా వేసి వారికి మాత్రమే ఆ ధరను లేదా ఆఫర్‌ను చూపిస్తాయి. అంటే ఒకే వస్తువు వేర్వేరు కస్టమర్లకు వేర్వేరు ధరలకు లేదా ఆఫర్లకు కనిపించవచ్చు. ఇది గరిష్ట లాభాన్ని ఆర్జించడానికి కంపెనీలకు సహాయపడుతుంది.
ఫ్లాష్ సేల్
‘ఈ ఆఫర్ కొద్దిసేపు మాత్రమే’ (Flash Sale), ‘ఇంకా 5 వస్తువులు మాత్రమే మిగిలాయి’ వంటి సందేశాలను వినియోగదారులకు చూపించడం ద్వారా వారిలో ఆతృతను సృష్టించి త్వరగా కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తారు. దీనివల్ల వినియోగదారులు పూర్తి విశ్లేషణ చేయకుండానే కొనుగోలు చేస్తారు.
కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్‌లు
తరచుగా కొనుగోళ్లు చేసే వినియోగదారులకు లేదా ప్రత్యేక సభ్యత్వాలు (ఉదా. ప్రైమ్ మెంబర్‌షిప్) ఉన్న వారికి మాత్రమే కొన్ని అదనపు ఆఫర్లు లేదా త్వరగా సేల్ యాక్సెస్ ఇస్తారు. ఇది వారిని కంపెనీకి కట్టుబడి ఉండేలా చేస్తుంది.
డబ్బు మిగిల్చుకోవడానికి విధానాలు
మీరు కొనాలనుకున్న వస్తువును కార్ట్‌లో ఉంచి కొద్ది రోజులు వేచి చూడండి. కంపెనీలు తరచుగా కొనుగోలు చేయకుండా వదిలేసిన వస్తువులపై ప్రత్యేక తగ్గింపును లేదా నోటిఫికేషన్‌ను పంపే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు సదరు వెబ్‌సైట్‌కు సంబంధించిన కూపన్ కోడ్స్ ఉన్నాయేమో చూడాలి. కొన్ని క్యాష్‌బ్యాక్ యాప్‌లు లేదా వెబ్‌సైట్‌ల ద్వారా షాపింగ్ చేయడం వల్ల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. పండుగ సేల్‌లో ఈ-కామర్స్ కంపెనీలు కొన్ని బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డులపై ఇన్‌స్టాంట్ తగ్గింపులు లేదా ఈఎంఐ ఆఫర్లు ఇస్తాయి. చాలా వెబ్‌సైట్‌లు తమ కొత్త కస్టమర్లకు ప్రత్యేక తగ్గింపు కూపన్లను పంపుతాయి. ఇది మొదటి కొనుగోలుపై కొంత డబ్బు ఆదా చేస్తుంది. ఒకటి కంటే ఎక్కువ వస్తువులు లేదా అనుబంధ ఉత్పత్తులు ఒకే ప్యాకేజీగా తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుంది.
చివరగా..
కంపెనీలు ఇస్తున్న ఆఫర్ల ఆంతర్యం అంతిమంగా వాటి అమ్మకాలను, లాభాలను పెంచడమే. కాబట్టి వినియోగదారులు ఆఫర్ల వెనుక దాగి ఉన్న మార్కెటింగ్ వ్యూహాన్ని అర్థం చేసుకుని వాటిని విచక్షణతో ఉపయోగించుకోవాలి.