
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా దేశీ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్టయ్యేందుకు ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే కసరత్తు ప్రారంభించింది. ఈ ఏడాది పదో వార్షికోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో తమ సంస్థకు ఇదొక కీలక మైలురాయి అవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫోన్‌పే పోటీ సంస్థలు పేటీఎం, మొబిక్విక్ ఇప్పటికే దేశీ మార్కెట్లలో లిస్టయిన సంగతి తెలిసిందే.
సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించిన ఫోన్‌పే 2022లో తమ ప్రధాన కార్యాలయాన్ని భారత్‌కి మార్చుకుంది. 2023లో చివరిసారిగా నిధులు సమీకరించినప్పుడు ఫోన్‌పే వేల్యుయేషన్‌ను 12 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టారు. ఫోన్‌పేలో వాల్‌మార్ట్‌కి చెందిన లక్సెంబర్గ్ సంస్థ ఫిట్ హోల్డింగ్స్ ఎస్‌ఏఆర్‌ఎల్‌కి 83.91 శాతం, జనరల్ అట్లాంటిక్ సింగపూర్‌కి 5.14 శాతం, ఫోన్‌పే సింగపూర్ విభాగానికి 6.7 శాతం వాటాలు ఉన్నాయి.