Paris Court: భారత ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చిన పారిస్ కోర్టు.. ఎందుకో తెలుసా?

Paris Court Allows Devas Shareholders to Seize Another Air India Asset - Sakshi

పారిస్ కోర్టు భారత ప్రభుత్వానికి గట్టి షాకిచ్చింది. గురువారం దేవాస్ వాటాదారులకు పారిస్‌లోని ఎయిర్ ఇండియాకు చెందిన ఒక అపార్ట్‌మెంట్ ఆస్తి మీద తాత్కాలిక హక్కులను కల్పిస్తూ పారిస్ కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఆ అపార్ట్‌మెంట్ భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నివాసంగా ఉంది. ఈ అపార్ట్‌మెంట్ విలువ  3.8 మిలియన్ యూరోలు(సుమారు రూ.32 కోట్లు). "భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆస్తులను కలిగి ఉంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే" అని దేవాస్ షేర్ హోల్డర్స్ సీనియర్ సలహాదారు జే న్యూమాన్ అన్నారు. 

పారిస్ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు దేవాస్ వాటాదారులు పారిస్ అప్ మార్కెట్ ప్రాంతంలోని ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. దేవాస్ వాటాదారులు జాతీయ క్యారియర్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి అనుమతించే ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఎయిర్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్​ను కెనడాలోని క్యూబెక్ లోని కోర్టు కొట్టివేసిన కొన్ని రోజుల తరువాత ఈ పరిణామం జరిగింది.

క్యూబెక్ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి మిచెల్ ఎ. పిన్సన్నాల్ట్ జనవరి 8న ఇచ్చిన తీర్పు ప్రకారం.. దేవాస్ వాటాదారులు అంతర్జాతీయ వైమానిక రవాణా సంఘం(ఐఏటీఏ) వద్ద ఉన్న ఎయిర్ ఇండియా నిధులలో 50 శాతం వరకు స్వాధీనం చేసుకోవచ్చు. ఈ విషయంపై భారత ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. అయితే, అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసి తర్వాత నిర్ణయం తీసుకొనున్నట్లు ఒక విమానయాన మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి మీడియా తెలిపారు.

ఇండియా దేవాస్ మల్టీమీడియా కేసు
జనవరి 2005లో ఆంట్రిక్స్ కార్పొరేషన్, ఇండియా దేవాస్ మల్టీమీడియా కంపెనీ మధ్య జరిగిన ఒక ఒప్పందం ప్రకారం.. ఇండియా దేవాస్ మల్టీమీడియా కంపెనీకి చెందిన రెండు ఉపగ్రహాలను ఆంట్రిక్స్ నిర్మించి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. ఈ ఉపగ్రహాలను ఆపరేట్ చేయడానికి ఎస్-బ్యాండ్ 70 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రాన్ని దేవాస్ మీడియాకు కేటాయించడానికి ఆంట్రిక్స్ కార్పొరేషన్ అంగీకరించింది. ఈ రెండు ఉపగ్రహాల సహాయంతో భారతదేశం అంతటా హైబ్రిడ్ శాటిలైట్, టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ సేవలను అందించాలని యోచించింది.

ఈ ఒప్పందాన్ని ఆంట్రిక్స్ ఫిబ్రవరి 2011లో రద్దు చేసింది. 2011 జూన్ నెలలో దేవాస్ మల్టీమీడియా ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని ఆశ్రయించింది. 2015 సెప్టెంబరులో ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ ఇస్రో వాణిజ్య విభాగాన్ని 672 మిలియన్ డాలర్లు దేవాస్ మల్టీమీడియాకు చెల్లించాలని కోరింది. ఈ నిర్ణయం ఆధారంగా దేవాస్ విదేశీ వాటాదారులు రికవరీ కోసం కెనడా అలాగే అమెరికాతో సహా చాలా దేశాలలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. అందులో భాగంగానే పారిస్ కోర్టులో వారికి అనుకూలంగా వచ్చింది.

(చదవండి: ఇండియాలో టెస్లా కార్ల విడుదలపై ఎలాన్ మస్క్ ఆసక్తికర ట్వీట్..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top