
Musk Shares Update on Tesla Launch in India: భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు టెస్లా కంపెనీ సిద్దమైన విషయం తెలిసిందే. దిగుమతి సుంకాలు అధికంగా ఉండడంతో టెస్లా రాక కాస్త ఆలస్యమవుతోంది. తాజాగా ఇండియాలో టెస్లా కార్లను ఎప్పుడు విడుదల చేయనున్నారో అనే విషయంపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ వేదికగా స్పందించారు.
ఒక ట్విట్టర్ వినియోగదారుడు ట్విటర్లో ఇలా.. "Yo @elonmusk టెస్లా కార్లు భారతదేశంలో ఎప్పుడు ప్రారంభంకానున్నాయి అనే దానిపై ఏదైనా అప్డేట్ ఉందా? అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి మూలలో నడపడానికి అర్హత కలిగి ఉన్నాయి!" అని ఎలాన్ మస్క్‌ని ప్రశ్నించారు. ఆ ట్వీట్‌కు బదులు ఇస్తూ మస్క్.. "ఇండియాలో కార్లను విడుదల చేయడానికి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు" అని అన్నారు.
Still working through a lot of challenges with the government
— Elon Musk (@elonmusk) January 12, 2022
ఈ సంవత్సరం భారతదేశంలో ఇతర దేశాలలో తయారు చేసిన కార్లను ఇక్కడికి దిగుమతి చేసుకొని విక్రయించాలని టెస్లా కోరుకుంటుంది. కానీ, దేశంలో దిగుమతి పన్నులు ప్రపంచంలో అత్యధికంగా ఉన్నాయని గతంలో మస్క్ చెప్పారు. టెస్లా బేసిక్ మోడల్ 3 కారు ధర $39,990(సుమారు రూ.30 లక్షలు). విదేశాల్లో తయారైన కార్లపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 60-100 శాతం దిగుమతి సుంకాలను విధిస్తుంది. ఇంజిన్ పరిమాణంతో పాటు ధర, బీమా, రవాణా కలుకొని 40,000 డాలర్లు దాటితే ఈ సుంకం వర్తించనుంది. ఈ సుంకల వల్ల ఈ కారు ధర రూ.60 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ భావిస్తుంది.
దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించడంతో భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలు మరింత ఊపందుకునే అవకాశం ఉందని టెస్లా కేంద్రంతో వాదిస్తుంది. అదనంగా 10 శాతం సోషల్ వెల్‌ఫేర్ సర్‌చార్జిని కూడా మాఫీ చేసే అంశంపై కూడా కంపెనీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. టెస్లా ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ రెవెన్యూ విభాగం తుది నిర్ణయం తీసుకుంటుందని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ గతంలో పేర్కొన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా మూడు సంవత్సరాల పాటు దిగుమతి సుంకాలను తాత్కాలికంగా తగ్గించే అవకాశాలపై కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు ఆయన అన్నారు. ఇక్కడ తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తే భారీ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్దం అని కేంద్రం తెలుపుతుంది. ఇది ఇలా ఉంటే, గతంలో కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ టెస్లా కారుకు భారతదేశంలో సుమారు 35 లక్షల రూపాయలకు విడుదల కానున్నట్లు తెలియజేశారు.
(చదవండి: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు!)