ఓయో లిస్టింగ్‌కు ఓకే | Oyo parent Prism gets Sebi nod for Rs 6650 crore IPO | Sakshi
Sakshi News home page

ఓయో లిస్టింగ్‌కు ఓకే

Jun 3 2026 4:21 AM | Updated on Jun 3 2026 4:21 AM

Oyo parent Prism gets Sebi nod for Rs 6650 crore IPO

సెబీ తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ 

రూ. 6,650 కోట్లపై కన్ను

న్యూఢిల్లీ: గ్లోబల్‌ ట్రావెల్‌ టెక్‌ యూనికార్న్‌ సంస్థ ప్రిజమ్‌ పబ్లిక్‌ ఇష్యూకి దారి ఏర్పడింది. ఇందుకు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఓయో బ్రాండ్‌ హోటళ్ల నిర్వాహక కంపెనీ రూ. 6,650 కోట్ల సమీకరణకు సన్నాహాలు చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి కంపెనీ విలువ 7–8 బిలియన్‌ డాలర్లు(సుమారు రూ. 76,000 కోట్లు)గా నమోదుకావచ్చని తెలియజేశాయి. స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్‌కు వీలుగా 2025 డిసెంబర్‌లో ప్రిజమ్‌ సెబీకి గోప్యతా విధానంలో ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది.

తదుపరి అదే నెల 20న నిర్వహించిన అసాధారణ సమావేశం(ఈజీఎం)లో వాటాదారులు ఇందుకు అనుమతించారు. తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ. 6,650 కోట్లు సమీకరించేందుకు ఆమోదించారు. కాగా.. జూలై తొలి వారంలో పబ్లిక్‌ అప్‌డేటెడ్‌ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేశాయి. 2012లో రితేష్‌ అగర్వాల్‌ ఏర్పాటు చేసిన కంపెనీలో పీఈ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ చెప్పుకోదగ్గ వాటాను కలిగి ఉంది.

కంపెనీ ఇంతక్రితం 2021లోనూ ఐపీవో సన్నాహాలు చేపట్టింది. తద్వారా రూ. 8,430 కోట్లు సమకూర్చుకోవాలని భావించింది. తదుపరి 2023లోనూ ఆర్థిక, నిర్వహణ సంబంధ అప్‌డేటెడ్‌ వివరాలను సెబీకి దాఖలు చేసింది. అయితే ఆపై ప్రపంచ మార్కెట్ల ఆటుపోట్ల కారణంగా ఐపీవో ప్రణాళికలను విరమించుకుంది. కంపెనీ బోర్డు ఇటీవలే సెబీ మాజీ చైర్మన్‌ అజయ్‌ త్యాగిని స్వతంత్ర డైరెక్టర్‌గా ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement