సిటీలో సొంతిల్లు.. పడుతుంది 23 ఏళ్లు! | Owning a Home Takes 23 Years of Savings in Hyderabad | Sakshi
Sakshi News home page

సిటీలో సొంతిల్లు.. పడుతుంది 23 ఏళ్లు!

Jan 24 2026 10:38 AM | Updated on Jan 24 2026 11:01 AM

Owning a Home Takes 23 Years of Savings in Hyderabad

మెట్రో నగరాల్లో సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే సామాన్య, మధ్యతరగతికే కాదు ధనిక కుటుంబాలకూ పొదుపు తప్పనిసరి. వార్షిక ఆదాయ, పొదుపు, తలసరి వ్యయం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న గృహాల ధరల నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇల్లు కొనాలంటే కనిష్టంగా 23 ఏళ్ల సేవింగ్స్‌ అవసరం. అత్యధికంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అయితే ఏకంగా వందేళ్లకు పైగా పొదుపు చేస్తేనే ఇల్లు సొంతం చేసుకునే అవకాశం ఉంది.

2022–23లో దేశ స్థూల పొదుపు, స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) నిష్పత్తి 30.2 శాతంగా ఉంది. దీన్ని ఆధారంగా తీసుకొని.. రాష్ట్రంలోని అత్యంత ధనవంతులైన 5 శాతం మంది సగటు కుటుంబ ఆదాయం, రాష్ట్ర రాజధానిలోని 110 చదరపు మీటర్లు(1,184 చ.అ.) ఇంటి సగటు ధరతో పోల్చి ఈ డేటాను రూపొందించారు.

ఠి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నెలవారీ తలసరి వ్యయం(ఆర్బీఐ ఎంపీసీఈ) ప్రకారం హైదరాబాద్‌లో ఐదు శాతం ధనిక కుటుంబాల వార్షిక ఆదాయం రూ.12.5 లక్షలుగా ఉంది. దీనికి ఆయా ఫ్యామిలీలకు 30.2 శాతం పొదుపు రేటును వర్తింపజేస్తే వారి వార్షిక పొదుపు దాదాపు రూ.3.8 లక్షలుగా ఉంటుంది. నేషనల్‌ హౌసింగ్‌ బోర్డ్‌ (ఎన్‌హెచ్‌బీ) డేటా ప్రకారం 645 చ.అ. నుంచి 1,184 చ.అ. మధ్య కార్పెట్‌ ఏరియా ఉన్న ఇంటి చ.అ. ధర గతేడాది మార్చిలో రూ.89 లక్షలుగా ఉంది. అంటే ఈ లెక్కన ఏడాదికి రూ.3.8 లక్షల పొదుపుతో రాష్ట్ర రాజధానిలోని టాప్‌–5 అర్బన్‌ కుటుంబాలు ఈ ఇంటిని కొనుగోలు చేయడానికి కనిష్టంగా 23 ఏళ్లు పొదుపు చేయాల్సి ఉంటుంది.

ఢిల్లీలో 35 ఏళ్ల పాటు.. 
ఇదే విధమైన లెక్కల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ఇల్లు కొనాలంటే 35 ఏళ్ల పాటు పొదుపు చేయాల్సి ఉంటుంది. అత్యధికంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గృహ ప్రవేశం చేయాలంటే ఏకంగా 109 ఏళ్ల పాటు సేవింగ్స్‌ చేయాల్సిందే. దేశంలో పది కంటే ఎక్కువ రాష్ట్రాల రాజధానుల్లో ఇల్లు కొనాలంటే 30 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పడుతుంది. వీటిల్లో ముంబై, గుర్గావ్, భువనేశ్వర్, పాట్నా, కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో, డెహ్రాడూన్‌ రాజధానులు ఉన్నాయి.

దక్షిణాదిలో మన దగ్గరే తక్కువ..
దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, తిరువనంతపురం, విశాఖపట్నంతో పోలిస్తే భాగ్యనగరంలోనే తక్కువ కాలం పొదుపు చేస్తే సరిపోతుంది. చెన్నైలో 37 ఏళ్ల పాటు సేవింగ్స్‌ చేస్తేనే గృహ ప్రవేశం చేయవచ్చు. ఇక, బెంగళూరులో 36 ఏళ్లు, తిరువనంతపురం, విశాఖపట్నంలలో 26 సంవత్సరాలు పొదుపు చేస్తే సొంతిల్లు సొంతవుతుంది. ఇక, అత్యల్పంగా కేవలం 15 ఏళ్ల పొదుపుతో సొంతింటి కలను సాకారం చేసుకునే ఏకైక నగరం చంఢీగడ్‌. ఆ తర్వాత 16 ఏళ్లతో జైపూర్‌ నగరాలున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement