
ఓలా ఎలక్ట్రిక్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీకి చెందిన 95 శాతం షోరూమ్‌లకు ట్రేడ్ సర్టిఫికేట్లు లేవని బ్లూమ్‌బర్గ్ న్యూస్ వార్తలు ప్రచురించింది. అందులోని వివరాల ప్రకారం మొత్తం 4,000 షోరూమ్‌ల్లో 3,400లకు సంబంధించిన డేటా అందుబాటులో ఉండగా వాటిలో కేవలం 100 షోరూమ్‌లకు మాత్రమే భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రేడ్ సర్టిఫికేట్లు ఉన్నట్లు గుర్తించారు. దీని అర్థం ఓలా ఎలక్ట్రిక్ 95 శాతం స్టోర్లలో నమోదుకాని ద్విచక్ర వాహనాలను ప్రదర్శించడానికి, విక్రయించడానికి, టెస్ట్ రైడ్లను అందించడానికి లేదా రవాణా చేయడానికి అవసరమైన ధృవీకరణ లేదు. ఈ సర్టిఫికేట్లు లేకపోవడం రెగ్యులేటరీ నిబంధనలకు కంపెనీ కట్టుబడి ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
2022 నుంచి ఓలా ఎలక్ట్రిక్ తన షోరూమ్‌లను విస్తరించడంలో గణనీయమైన పురోగతిని సాధించింది. డిజిటల్-ఓన్లీ సేల్స్ మోడల్(భౌతికంగా షోరూమ్ ఉండకుండా కేవలం డిజిటల్ ద్వారానే ఉత్పత్తులను విక్రయించడం) నుంచి బ్రిక్-అండ్-మోర్టార్(షోరూమ్‌లను ఏర్పాటు చేయడం) వంటి విధానానికి మారింది. ఈ మార్పువల్ల కస్టమర్ అనుభవాన్ని పెంచడం, సేవా సంబంధిత సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో భారతదేశం అంతటా సుమారు 4,000 ప్రదేశాలకు విస్తరించింది.
రెగ్యులేటరీ చర్యలు
ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని రవాణా అధికారులు చర్యలు చేపట్టారు. సంబంధిత రాష్ట్రాల్లోని కంపెనీ షోరూమ్‌ల్లో దాడులు నిర్వహించి, వాటిని మూసివేసి, వాహనాలను సీజ్ చేసినట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. అదనంగా ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ రాష్ట్ర స్థాయి రవాణా అధికారుల నుంచి షోకాజ్ నోటీసులను అందుకుంది.
ఇదీ చదవండి: రూ.115-125 లక్షల కోట్ల రుణ సమీకరణ.. ఎందుకంటే..
ఓలా ఎలక్ట్రిక్ స్పందన..
ఓలా ఎలక్ట్రిక్ దర్యాప్తు ఫలితాలను ఖండించింది. కంపెనీ కార్యకలాపాలపై మార్కెట్‌లో వస్తున్న వార్తలు పూర్తిగా తప్పు అని, పక్షపాతంతోనే ఇలాంటి వార్తలను వైరల్ చేస్తున్నారని తేల్చి చెప్పింది. కంపెనీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, గోదాములు మోటారు వాహనాల చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే షోరూమ్‌ల్లో అవసరమైన ట్రేడ్ సర్టిఫికేట్లు ఉన్నాయో లేదో మాత్రం నేరుగా ప్రస్తావించలేదు.
Comments
Please login to add a commentAdd a comment