క్యూ2లో రూ. 9,848 కోట్లు
షేరుకి రూ. 6 డివిడెండ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్‌జీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 9,848 కోట్లకు పరిమితమైంది. ముడిచమురు ధరలు నీరసించడం ప్రభావం చూపింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 11,984 కోట్లు ఆర్జించింది. ముడిచమురు బ్యారల్ ధరలు 78.33 డాలర్ల నుంచి 67.34 డాలర్లకు క్షీణించడం లాభాలను దెబ్బతీసినట్లు కంపెనీ పేర్కొంది.
అయితే పురాతన బావుల నుంచి వెలికితీసే నేచురల్ గ్యాస్ ధర 3.8 శాతం పుంజుకుని ఒక్కో ఎంఎంబీటీయూ 6.75 డాలర్లను తాకింది. కొత్త బావుల నుంచి వెలికితీసిన గ్యాస్ ధర 9.42 డాలర్ల నుంచి 8.36 డాలర్లకు తగ్గింది. దేశీయంగా నిర్ణయించే ఏపీఎం ధరలతో పోలిస్తే వీటికి 20 శాతం ప్రీమియంకు వీలుంటుంది. దీంతో వీటి నుంచి అధికంగా గ్యాస్ ఉత్పత్తికి కంపెనీ ప్రాధాన్యత ఇస్తోంది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 6 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.
ఇందుకు రూ. 7,548 కోట్లు వెచి్చంచనుంది. కాగా.. సమీక్షా కాలంలో ఓఎన్‌జీసీ స్థూల ఆదాయం 2.5 శాతం క్షీణించి రూ. 33,031 కోట్లకు పరిమితమైంది. ఈ కాలంలో 4.63 మిలియన్ టన్నుల ముడిచమురుతోపాటు.. 4.918 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది. ఫలితాల నేపథ్యంలో ఓఎన్‌జీసీ షేరు బీఎస్‌ఈలో 0.8 శాతం నష్టంతో రూ. 249 వద్ద ముగిసింది.


