దేశంలో ఆఫీసు స్పేస్ లీజింగ్‌లు అదరగొట్టాయి. టారిఫ్‌లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఐటీ, ఐటీఈఎస్ రంగాలలో తొలగింపులు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ దేశంలోని ప్రధాన నగరాల్లో ఆఫీసు స్పేస్ డిమాండ్ బలంగానే ఉంది.
2025 తొలి తొమ్మిది నెలల్లో దేశంలోని ఏడు నగరాలలో ఆఫీసు స్పేస్ వినియోగ రేటు 4.2 కోట్ల చ.అ.లను అధిగమించింది. గతేడాదితో పోలిస్తే ఇది 34 శాతం అధికం. ప్రధానంగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ), టెక్ ఆధారిత కంపెనీలు ఇందుకు దోహదపడ్డాయి.
ఆఫీసు స్పేస్ వినియోగంలో 99.5 లక్షల చ.అ.లతో బెంగళూరు టాప్‌లో నిలిచింది. తర్వాత ఢిల్లీ–ఎన్సీఆర్లో 82 లక్షల చ.అ., ముంబై 66 లక్షల చ.అ.లతో ఉన్నాయి. మొత్తం లీజింగ్‌లో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల 27 శాతం వాటాతో ఆఫీసు స్పేస్ డిమాండ్‌లో అగ్రగామిగా కొనసాగుతుండగా.. కో–వర్కింగ్ స్పేస్‌లు 23 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐ 18 శాతం వాటాలతో ఉన్నాయి.
గతేడాదితో పోలిస్తే ఐటీ రంగంలో ఒక శాతం తగ్గుదల నమోదైంది. జీసీసీలు కీలకమైన డిమాండ్ డ్రైవర్లుగా ఉద్భవించాయి. 2025లో ఇప్పటి వరకు స్థూల లీజింగ్ కార్యకలాపాలలో 40 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణే నగరాల్లో జీసీసీల ఏర్పాటుకు డిమాండ్ అధికంగా ఉంది.
డేటా సెంటర్ల సామర్థ్యం పెరుగుదల
దేశంలో డేటా సెంటర్ల జోరు కొనసాగుతోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిని పరిగణనలోకి తీసుకుంటే దేశీయంగా డేటా సెంటర్ల సామర్థ్యం 2027 నాటికి రెట్టింపు కానుంది. ప్రాజెక్ట్‌లను వేగవంతం చేస్తే 2030 నాటికి ఐదు రెట్లకు పెరుగుతుందని మెక్వారీ ఈక్విటీ రీసెర్చ్ వెల్లడించింది.
డేటా లొకేలైజేషన్ చట్టాలు, సానుకూల నియంత్రణ విధానాలు, ప్రభుత్వ సబ్సిడీలు, క్లౌడ్ వినియోగం పెరుగుతుండటం వంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నాయని తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో 1.4 గిగావాట్ల డేటా సెంటర్ల సామర్థ్యం ఉండగా.. మరో 1.4 గిగావాట్ల ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయని, నాలుగు గిగావాట్ల ప్రాజెక్ట్‌లు ప్రణాళిక దశలో ఉన్నాయని తెలిపింది.


