
ఆన్‌లైన్ బాండ్ ప్లాట్‌ఫామ్స్ ప్రొవైడర్లపట్ల అప్రమత్తత అవసరమని స్టాక్ ఎక్స్ఛేంజీ దిగ్గజాలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ తాజాగా ఇన్వెస్టర్లను హెచ్చరించాయి. ఇటీవల ఇలాంటి ప్లాట్‌ఫామ్స్ వెలుగులో నిలుస్తున్న నేపథ్యంలో ఎక్స్ఛేంజీల హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వీటి ద్వారా వివిధ రకాల నిర్ధారిత ఆదాయ బాండ్ల (ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఇన్‌స్ట్రుమెంట్స్) కొనుగోలు సులభతరమవుతున్న కారణంగా జాగ్రత్త వహించమని తెలియజేశాయి.
వీటి ద్వారా పెట్టుబడులు చేపట్టేముందు పలు కీలక అంశాలను పరిశీలించవలసి ఉన్నదంటూ రెండు ఎక్స్ఛేంజీలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి. బాండ్ల క్రెడిట్ రేటింగ్, తిరిగి చెల్లింపుల్లో బాండ్ల జారీదారుల ట్రాక్ రికార్డ్, బాండ్ల లిక్విడిటీ, సెటిల్‌మెంట్ గడువు, పన్ను ప్రభావం తదితర పలు అంశాలను పరిగణించమంటూ సూచించాయి.
ప్రధానంగా బాండ్ పాల్ట్‌ఫామ్.. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద రిజిస్టరైనదీ లేనిదీ తప్పనిసరిగా పరిశీలించవలసి ఉన్నట్లు తెలియజేశాయి. నిజానికి క్రెడిట్ రేటింగ్ ఆధారంగా బాండ్లలో పెట్టుబడులపై రిసు్కలు, రిటర్నులు నమోదవుతాయని వివరించాయి.