
సెలక్ట్ కమిటీ సూచనతో కొత్త ఐటీ బిల్లులో పునరుద్ధరణ
న్యూఢిల్లీ: అన్ని మతపరమైన, స్వచ్ఛంద సేవా సంస్థలకు వచ్చే అజ్ఞాత విరాళాలపై టీడీఎస్ క్లెయిమ్, పన్ను మినహాయింపులకు ప్రస్తుత చట్టంలో మాదిరే ఆదాయపన్ను కొత్త బిల్లు (2.0)లోనూ అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీసుకొచి్చన కొత్త బిల్లులో దీన్ని తొలగించడం గమనార్హం. అన్ని రిజిస్టర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థలు అందుకునే అజ్ఞాత విరాళాలపై 30 శాతం స్థిర పన్నును ప్రభుత్వం ప్రతిపాదించింది.
కానీ, సెలక్ట్ కమిటీ చేసిన సూచనల మేరకు నూతన బిల్లులో మినహాయింపులకు తిరిగి చోటు కల్పించింది. క్లాజు 187 కింద ‘ప్రొఫెషన్’ పదాన్ని చేర్చారు. ఒక ఏడాదిలో చెల్లింపుల స్వీకరణలు రూ.50 కోట్లకు మించితే నిపుణులు సైతం ఎల్రక్టానిక్ చెల్లింపుల నమూనాలను కలిగి ఉండాలని ఇది నిర్దేశిస్తోంది. నష్టాలను సర్దుబాటు చేసుకోవడం, క్యారీ ఫార్వార్డ్ చేసుకోవడానికి సంబంధించిన నిబంధనలను మరింత మెరుగుపరిచారు.
టీడీఎస్ కరెక్షన్ స్టేట్‌మెంట్ (సవరణ నివేదికలు)లకు సంబంధించి దాఖలు గడువును ఆరేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించారు. నూతన ఆదాయపన్ను బిల్లు (2.0)గా చెబుతున్న తాజా బిల్లులో సెలక్ట్ కమిటీ సిఫారసులు అన్నింటికీ దాదాపుగా చోటు కల్పించడం గమనార్హం. తొలుత ఈ కొత్త బిల్లును ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్‌సభలో ప్రవేశపెట్టగా, సెలక్ట్ కమిటీకి సిఫారసు చేశారు. సెలక్ట్ కమిటీ తన నివేదికను జూలై 21న పార్లమెంట్‌కు సమరి్పంచింది. సోమవారం దీన్ని లోక్‌సభ ఆమోదించింది.