ఆకాశహర్మ్యాలే నగరవాసుల కలల సౌధం
హైరైజ్ భవనాల పట్ల పెరుగుతున్న ఆసక్తి
ఈ ఏడాది 77 హైరైజ్ భవనాలకు హెచ్‌ఎండీఏ అనుమతులు
ఇప్పటి వరకు 88.15 లక్షల చ.మీ.ల బిల్డింగ్ ఏరియాకు ఆమోదం
ఫైళ్ల పరిష్కారానికి నిరంతర పర్యవేక్షణ
అంతర్జాతీయ హంగులను సంతరించుకుంటున్న హైదరాబాద్ మహా నగరంలో ఆకాశహర్మ్యాలే నగరవాసుల కలల సౌధాలుగా అవతరిస్తున్నాయి. పది అంతస్తులపైన నివసించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సిటీజనుల హైడ్రీమ్స్‌ను ప్రతిబింబించే విధంగా హైరైజ్ భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలకు దీటుగా ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్‌లు ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.
నగరవాసుల అభిరుచికి తగినట్లు నిర్మాణ సంస్థలు బహుళ అంతస్తులకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) గడిచిన 9 నెలల కాలంలో 77 హైరైజ్ బిల్డింగ్‌లకు అనుమతి ఇచ్చింది. దీంతో ప్రస్తుతం సుమారు 78.71 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో హైరైజ్ భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
ఇప్పటికే న్యూయార్క్ వంటి నగరాలను తలపించే విధంగా కనిపిస్తున్న పడమటి ప్రాంతంలో మరిన్ని ఆకాశ సౌధాలు అందుబాటులోకి రానున్నాయి. రెండేళ్ల క్రితం 37.03 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 55 హైరైజ్ భవనాలకు అనుమతి ఇవ్వగా ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లోనే అంతకు రెట్టింపు సంఖ్యలో అందజేసినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. మరోవైపు కోకాపేట్, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో బహుళ వినియోగ జోన్లు, బహుళ అసంతస్తుల భవనాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని హెచ్‌ఎండీఏ మరోసారి భూముల వేలానికి శ్రీకారం చుట్టింది.
ఇప్పటికే కోకాపేట్ నియోపోలిస్‌లో రెండు విడతలుగా స్థలాలను విక్రయించగా అనూహ్యమైన స్పందన లభించింది. ఎకరం అత్యధికంగా రూ.100.75 కోట్లకు అమ్ముడైంది. ఈ క్రమంలో ఈ నెల 24, 26 తేదీల్లో మరోసారి ఆన్‌లైన్ బిడ్డింగ్‌కు సన్నద్ధమైంది. ప్రస్తుతం కోకాపేట్‌లో అత్యధికంగా 63 అంతస్తుల వరకు హెచ్‌ఎండీఏ నిర్మాణ అనుమతులను అందజేసింది. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో మరిన్ని అంతస్తుల నిర్మాణాలకు సైతం అనుమతులు లభించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
‘అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు అందుబాటులో ఉండే నివాస సముదాయాలకు డిమాండ్ భారీగా ఉంది. ఇందుకు అనుగుణంగా హైరైజ్ భవనాల నిర్మాణం క్రమంగా ఊపందుకుంటోంది.’ అని ఒక హెచ్‌ఎండీఏ అధికారి అభిప్రాయపడ్డారు. ఈ సంవత్సరం కోకాపేట్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో 49 అంతస్తుల నుంచి 63 అంతస్తుల భవనాల వరకు నిర్మాణ అనుమతులను అందజేశారు.
హోదాగా భావిస్తున్నారు..
ప్రపంచదేశాల్లోని పలు నగరాల్లో వంద అంతస్తులకు పైగా నివాస భవనాలు ఉన్నాయి. అంతస్తులు పెరుగుతున్న కొద్దీ ఆకాశంలోనే నివాసం ఏర్పాటు చేసుకున్న అనుభూతి లభిస్తుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అత్యంత ఎత్తు నుంచి వీక్షించేందుకు అవకాశం లభిస్తుంది. పైగా వాహనకాలుష్యం, శబ్దకాలుష్యం వంటి సమస్యలకు హైరైజ్ భవనాలను పరిష్కారంగా భావిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా హైరైజ్ భవనాల్లో నివసించడాన్ని కొంతమంది ఉన్నత హోదాగా భావిస్తున్నారు. దీంతో ఇది
ఒక ట్రెండ్‌గా మారిందని నిర్మాణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
కార్పొరేట్ సంస్థలకు సమీపంలో, సకల వసతులతో, పార్కింగ్ సదుపాయాలతో ఉండే ఈ భవనాల్లో పటిష్ట భద్రతా వ్యవస్థ కూడా ఉంటుంది. ఇలాంటి సానుకూలమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని చాలామంది ఎన్‌ఆర్‌ఐలు హైరైజ్ భవనాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసే సాఫ్ట్‌వేర్ నిపుణులు సైతం హైరైజ్‌నే ఎంపిక చేసుకుంటున్నారు. యూఎస్, కెనడా, యూరోప్ వంటి దేశాల్లో చాలాకాలంగా బహుళ అంతస్తుల భవనాలే నివాస సముదాయాలుగా కొనసాగుతుండగా హైదరాబాద్, బెంగళూర్, చెన్నై వంటి నగరాల్లో ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి అభివృద్ధి చెందుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటి వరకు 88.15 లక్షల చ.మీ.ల నిర్మాణాలు
మరోవైపు నిర్మాణ రంగ అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. దీంతో ఈ ఏడాది సుమారు 88.15 లక్షల చదరపు మీటర్లకు పైగా భవన నిర్మాణాలకు అనుమతులను అందజేసినట్లు పేర్కొన్నారు. ఇళ్లు, లేఅవుట్లు, అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు, తదితర నిర్మాణాల కోసం 3,677 దరఖాస్తులు హెచ్‌ఎండీఏకు అందాయి. వాటిలో 2,887 దరఖాస్తులను పరిష్కరించి అనుమతులు మంజూరు చేశారు. దీంతో గతేడాది కంటే 79 శాతం ఆమోద రేటును సాధించినట్లు ఇది 2024లో 38 శాతం కావడం గమనార్హం.
గతేడాది 3,209 దరఖాస్తుల్లో 1,216 మాత్రమే పరిష్కారమయ్యాయి. పెండింగ్ ఫైళ్ల పరిష్కారానికి కాల పరిమితి తగ్గించడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఫైళ్లను పరిష్కరించేందుకు అవకాశం లభించిందని ఆయన తెలిపారు. ఈ మేరకు హెచ్‌ఎండీఏ ఆదాయం కూడా గణనీయంగా పెరిగినట్లు చెప్పారు. పర్మిట్ ఫీజుల రూపంలో ఈ ఏడాది రూ.1,225 కోట్లు లభించాయి. గతేడాది పర్మిట్ ఫీజులపై మొదటి 9 నెలల కాలానికి రూ.355 కోట్లు మాత్రమే లభించడం గమనార్హం. బిల్డ్‌నౌ వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థ కూడా నిర్మాణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు.


