
భారత్, అమెరికా టెక్ దిగ్గజాలు కలిసి పని చేసేలా ఓ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వెల్లడించింది. జూలై 9న అమెరికా న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయంలో యూఎస్ సీఈవో ఫోరంను ప్రారంభించనున్నట్లు వివరించింది.
కొత్త ఆవిష్కరణలు, పాలసీలు, నిపుణులను తయారు చేసుకోవడం వంటి అంశాలపై అత్యున్నత స్థాయి లో సంప్రదింపులు నిర్వహించేందుకు ఇది తోడ్పడుతుందని నాస్కామ్ పేర్కొంది. ప్రవాస భారతీయులు, ప్రభుత్వం, పరిశ్రమ, ఇన్వెస్ట్‌మెంట్, మేధావులు, విద్యావేత్తలు మొదలైన వర్గాలను సమన్వయపర్చడం ద్వారా భారత్–అమెరికా టెక్ భాగస్వామ్యాన్ని పటిష్టపర్చేందుకు సహాయకరంగా ఉంటుందని తెలిపింది.
భారతీయ టెక్నాలజీ కంపెనీలు అమెరికా అంతటా డిజిటల్ పరివర్తనను శక్తివంతం చేయడమే కాకుండా, ఉద్యోగాలను సృష్టించడం, స్థానిక కమ్యూనిటీలలో పెట్టుబడులు పెట్టడం, నిజమైన ప్రభావాన్ని అందించే ఆవిష్కరణలను నడిపిస్తున్నాయని నాస్కామ్ అధ్యక్షుడు రాజేష్ నంబియార్ అన్నారు. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ఎస్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ సీఈఓ అమిత్ చద్దా, విప్రోలో అమెరికాస్ వన్ సీఈఓ మలయ్ జోషితో పాటు నంబియార్ ఈ ఫోరం ప్రారంభ సమావేశంలో పాల్గొంటారని నాస్కామ్ తెలిపింది.