వైఎస్సార్‌‌ జిల్లాలో విదేశీ మొబైల్స్‌ తయారీ!

Mobile Manufacturing Unit Was Going To Launch In YSR District - Sakshi

సాక్షి, అమరావతి/వైఎస్సార్‌: విదేశీ ఫోన్‌ ట్రింగ్‌ ట్రింగ్‌తో త్వరలోనే వైఎస్‌ఆర్‌ కడప జిల్లా మారుమ్రోగనుంది. కోవిడ్‌–19 తర్వాత విదేశీ ఎలక్ట్రానిక్‌ కంపెనీలు ఇప్పుడు ఇండియాలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తుండటంతో ఈ కంపెనీలను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీ) ఏర్పాటు చేస్తోంది. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా కోపర్తి వద్ద సుమారు 500 ఎకరాల్లో ఈఎంసీ3ని అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే తిరుపతి సమీపంలో వికృతమాళ వద్ద 113.27 ఎకరాల్లో ఈఎంసీ1 , 501.40 ఎకరాల్లో ఈఎంసీ 2 ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా 500 ఎకరాల్లో కోపర్తి వద్ద ఈఎంసీ3ని అభివృద్ధి చేయనున్నారు. తైవాన్‌కు చెందిన పలు ఎలక్ట్రానిక్‌ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నాయని, దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాథమిక చర్చలు కూడా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. (ప్రజా నాడి తెలిసిన నేత మరిలేరు)

మొబైల్‌ తయారీ యూనిట్ల ఆకర్షణే లక్ష్యం 
యాపిల్, రెడ్‌మీ వంటి ఫోన్లను తయారు చేసే ఫాక్స్‌కాన్‌ రాష్ట్రంలో మరో రెండు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఫాక్స్‌కాన్‌ కోపర్తి ఈఎంసీలో యూనిట్‌ ఏర్పాటు అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. అలాగే యాపిల్‌ ఫోన్‌ తయారు చేసే మరో తైవాన్‌ సంస్థ పెగాట్రాన్‌ కూడా కోపర్తిలో యూనిట్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. కోవిడ్‌–19 తర్వాత పలు విదేశీ కంపెనీలు ఇండియాలో యూనిట్లు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయని, వీటిని ఆకర్షించడం కోసం కోపర్తిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈఎంసీ–3ని అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటికే విదేశాలకు చెందిన సుమారు 22 కంపెనీలు ఇండియాలో యూనిట్లు పెట్టడానికి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాయని, వీటిలో అత్యధిక భాగం రాష్ట్రానికి తీసుకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే కడప జిల్లా యాపిల్‌ ఫోన్‌ ట్రింగ్‌ ట్రింగ్‌లతో మారుమ్రోగనుంది. (‘అమూల్‌’ శిక్షణా తరగతులు)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top