మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్
బీఈవీల విక్రయాల్లో సగటున 10% వాటా
రెండు రాష్ట్రాల్లో 10 సేల్స్, సరీ్వస్ టచ్‌పాయింట్లు
త్వరలో మరో ఫ్రాంచైజీ భాగస్వామి
భారత్‌లో ప్లాంటుపై ఇప్పటివరకు రూ. 3,000 కోట్ల పెట్టుబడులు
జనవరిలో రేట్లు పెంచే అవకాశం...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ వాహనాల విక్రయాలకు సంబంధించి తమకు రెండు తెలుగు రాష్ట్రాలు కీలకంగా ఉంటున్నాయని లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ వెల్లడించారు.టాప్ ఎండ్–కస్టమర్ల కోసం ఉద్దేశించిన ఎక్స్‌క్లూజివ్ ‘మేబాక్ లాంజ్’ హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయడమనేది ఇక్కడి మార్కెట్ ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు. అంధ్రప్రదేశ్, తెలంగాణ తమ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు అగ్రస్థానంలో ఉంటున్న నేపథ్యంలో ఇక్కడ కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తున్నామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే ఈసారి విక్రయాల వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
కీలకంగా ఏపీ, తెలంగాణ..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లగ్జరీ కార్ల మార్కెట్లో, ముఖ్యంగా టాప్ ఎండ్ లగ్జరీ కార్లు, బీఈవీల (బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు) విభాగంలో మెర్సిడిస్ బెంజ్ అగ్రగామిగా ఉంది. దేశీయంగా మా అమ్మకాల్లో ఈ రెండు రాష్ట్రాల వాటా 15 శాతంగా ఉంటుంది. బీఈవీల విషయానికొస్తే మా మొత్తం వాహన విక్రయాల్లో వీటి వాటా సగటున 8 శాతంగా ఉండగా, ఇక్కడ అంతకు మించి పది శాతంగా ఉంది. సానుకూల ట్యాక్సేషన్ విధానాలు, చార్జింగ్ మౌలిక సదుపాయాలు ఇక్కడ బీఈవీల వినియోగం పెరగడానికి దోహదపడుతున్నాయి.
అంతేగాకుండా బీఈవీలను ఇంతకు ముందే ఉపయోగించిన అనుభవం గల టెక్ కస్టమర్లు ఎక్కువగా ఉండటం కూడా ఇందుకు తోడ్పడుతోంది. హైదరాబాద్‌లోని సంపన్న కస్టమర్లలో (హెచ్‌ఎన్‌ఐ) మా బ్రాండ్‌పై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో టాప్ ఎండ్ లగ్జరీ కస్టమర్లకు సంబంధించి ఎక్స్‌క్లూజివ్ ‘మేబాక్ లాంజ్’ని ఇక్కడే ఏర్పాటు చేశాం. హైదరాబాద్, సికింద్రాబాద్, వైజాగ్, విజయవాడలాంటి కీలక మార్కెట్ల వ్యాప్తంగా మాకు 10 అధునాతన సేల్స్, సరీ్వస్ టచ్‌పాయింట్లు ఉన్నాయి. త్వరలోనే వైజాగ్‌లో మూడో ఫ్రాంచైజీ భాగస్వామిని నియమించుకుంటున్నాం.
పెట్టుబడులు.. కొత్త మోడల్స్..
పుణెకి దగ్గర్లోని చకాన్‌లో 100 ఎకరాల విస్తీర్ణంలో మా ప్లాంటు ఉంది. దీనిపై ఇప్పటివరకు రూ. 3,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేశాం. ఈ ప్లాంటు సామర్థ్యం ఏటా 20,000 యూనిట్లుగా ఉంది. మరిన్ని కొత్త ప్రోడక్టులను తెచ్చే కొద్దీ, అవసరాన్ని బట్టి ప్లాంటు సామర్థ్యాన్ని పెంచుకుంటాం. మా ఫ్రాంచైజీ భాగస్వాములు వచ్చే మూడేళ్లలో సుమారు రూ. 450 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నారు. భారత్‌లో సుమారు 25 మోడల్స్ విక్రయిస్తుండగా, ఇందులో 11 మోడల్స్ స్థానికంగానే తయారు చేస్తున్నాం. పోర్ట్‌ఫోలియోలో 5–6 ఈవీలు ఉన్నాయి. వచ్చే రెండు మూడేళ్లలో అంతర్జాతీయంగా దాదాపు 40 మోడల్స్‌ను ప్రవేశపెట్టనుండగా, వాటిలో కొన్ని వాహనాలను ఇక్కడ కూడా అందుబాటులోకి తేనున్నాం. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో సీఎల్‌ఏ ఈవీని తేబోతున్నాం. దీని ధర సుమారు రూ. 50–60 లక్షలు.
ఈవీల అమ్మకాలు..
అయిదేళ్ల క్రితం దేశీయంగా మేము ఈవీలను ప్రవేశపెట్టినప్పుడు, ఎందుకు అనే ప్రశ్న వచి్చంది. ఇప్పుడది కొత్తగా ఏ మోడల్ తెస్తున్నారనే ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఇక్కడ మా అమ్మకాల్లో ఈవీల వాటా 8%కి చేరింది. రోడ్ ట్యాక్స్ లేని చోట్ల అమ్మకాలు ఎక్కువ. కస్టమర్లు, తయారీ కంపెనీలు, ప్రభుత్వాల ఆసక్తిని బట్టి ఈవీల వినియోగం గణనీయంగా పెరుగుతుంది.
వ్యాపార వృద్ధి.. ధరల పెంపు..
జీఎస్‌టీ తగ్గింపుతో ఈ పండుగ సీజన్‌లో గణనీయంగా వాహనాలు విక్రయించినప్పటికీ,¿ౌగోళిక రాజకీయాంశాలు, ధరలపరమైన ఒత్తిళ్లు తదితర కారణాల రీత్యా ఈసారి విక్రయాల వృద్ధి గతేడాది స్థాయికే పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నాం. ఇక యూరో మారకం విలువ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఈ ఏడాది 2–3 సార్లు ధరలు పెంచాం. కానీ అది తక్కువే. వచ్చే ఏడాది జనవరిలో కొంత పెంచవచ్చు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి కూడా లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వాటిని మరింత అందుబాటులోకి తెచ్చేలా మా టచ్‌పాయింట్లను పెంచుతున్నాం. ఈ ఏడాదిలోనే కొత్తగా 16 టచ్‌పాయింట్లను ప్రారంభించాం. ప్రస్తుతం 50 నగరాల్లో 140 పైచిలుకు టచ్ పాయింట్లు ఉన్నాయి. మరిన్ని ప్రారంభిస్తున్నాం.


