
ఢిల్లీ: లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ కార్ల ధరలను ఈ ఏడాది రెండు దఫాల్లో మూడు శాతం వరకు పెంచనుంది. విదేశీ మారక ద్రవ్య విలువల్లో తీవ్ర హెచ్చుతగ్గుల ప్రభావాలను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. దీని ప్రకారం వివిధ మోడల్స్‌ను బట్టి (సి 200 నుంచి మేబ్యాక్ ఎస్ 680 వరకు) జూన్ నుంచి రేట్లు రూ. 90,000 నుంచి రూ. 12.2 లక్షల వరకు పెరగనున్నాయి.
తదుపరి సెప్టెంబర్ నుంచి 1.5 శాతం వరకు రేట్లు పెరుగుతాయి. గత నాలుగు నెలల్లో యూరోతో పోలిస్తే రూపాయి విలువ దాదాపు పది శాతం తగ్గిందని, ఫలితంగా వ్యయాలపరమైన ఒత్తిళ్లు పెరిగాయని అయ్యర్ పేర్కొన్నారు. దీంతో స్వల్ప భారాన్ని కొనుగోలుదారులకు బదలాయించక తప్పని పరిస్థితి ఏర్పడిందని వివరించారు.