
దేశీయంగా ఎయిర్‌లైన్స్ తీరుపై ప్రయాణికుల అభిప్రాయం
లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడి
దేశీయంగా చాలా మటుకు విమానయాన సంస్థలు భద్రత కన్నా ప్రచారంపైనే ఎక్కువగా వెచ్చి స్తున్నాయని అత్యధిక శాతం విమాన ప్రయాణికులు భావిస్తున్నారు. ఈ విషయంపై లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో 76 శాతం మంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత మూడేళ్లలో కనీసం ఒక్కసారైనా టేకాఫ్ సమయంలోనో, ల్యాండింగ్‌లోనో లేదా విమానంలోనో ఏదో ఒక సమస్య ఎదుర్కొన్నట్లు 64 శాతం మంది తెలిపారు. దేశవ్యాప్తంగా 322 జిల్లాల నుంచి 44,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.
‘భారత్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎయిర్‌లైన్స్, భద్రత కన్నా పబ్లిసిటీకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నాయని భావిస్తున్నారా’ అనే ప్రశ్నకు స్పందించిన 26,696 మంది ప్రయాణికుల్లో 43% మంది ‘అవును. అన్ని సంస్థలు అలాగే ఉన్నాయి’ అని, 33% మంది ‘అవును. కొన్ని సంస్థలే అలా ఉన్నాయి’ అని, 11% మంది ‘ఏ కంపెనీ కూడా అలా లేదు’ అని చెప్పారు. 13 శాతం మంది మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
సూ్థలంగా చెప్పాలంటే చాలా మటుకు ఎయిర్‌లైన్స్ భద్రత కన్నా ప్రచారంపైనే ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయని చాలా మంది ప్రయాణికులు భావిస్తున్నట్లు వెల్లడైందని లోకల్‌సర్కిల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 63% మంది పురుషులు కాగా, 37% మంది మహిళలు. వీరిలో 46% మంది ప్రథమ శ్రేణి నగరాలకు చెందినవారు. 25% మంది ద్వితీయ శ్రేణి నగరాలకు, మిగతా 29% మంది తృతీయ, చతుర్థ శ్రేణి.. గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు.
పెరుగుతున్న ఉదంతాలు..
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాల ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం గత నెల టేకాఫ్ అయిన వెంటనే కూలిపోవడంతో, 241 మంది ప్రయాణికులు, ఇతరత్రా 19 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రాష్‌పై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) విచారణ జరిపి, ఇప్పటికే ప్రాథమిక రిపోర్టు ఇచ్చింది.
మరోవైపు, సోమవారం నాడు కొచ్చి–ముంబై ఎయిరిండియా ఫ్లయిట్, ల్యాండింగ్ సమయంలో రన్‌వే మీద నుంచి పక్కకు జారిపోయిన ఘటనలో ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదే రోజున సాంకేతిక లోపం కారణంగా ఢిల్లీ–కోల్‌కతా విమానాన్ని ఎయిరిండియా ఆఖరు నిమిషంలో రద్దు చేసింది. ల్యాండింగ్ గేర్ సమస్య కారణంగా గోవా నుంచి బయలుదేరిన ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.