వాషింగ్టన్: గత ఏడాది(2025) జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమాన ప్రమాదంపై అమెరికాకు చెందిన ‘ఫౌండేషన్ ఫర్ ఏవియేషన్ సేఫ్టీ’ (ఎఫ్‌ఏఎస్) సంచలన విషయాలను వెల్లడించింది. ఈ ప్రమాదానికి గురైన విమానం (రిజిస్ట్రేషన్ VT-ANB) సర్వీసులో చేరక ముందు నుంచే లెక్కలేనన్ని సాంకేతిక లోపాలతో సతమతమవుతున్నదని ఆ సంస్థ ఆరోపించింది.
ఎయిర్ ఇండియాలో ఈ విమానం సేవలు ప్రారంభించిన తొలి రోజు (2024, ఫిబ్రవరి 1) నుంచే సిస్టమ్ వైఫల్యాలు నమోదయ్యాయని ఎఫ్‌ఏఎస్ పేర్కొంది. ఈ విమానం తయారీ, ఇంజనీరింగ్, నాణ్యతా ప్రమాణాల్లో అనేక లోపాలు ఉన్నాయని, ఇవే ఈ ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని ఆ సంస్థ అంచనా వేసింది. గత 11 ఏళ్లుగా ఈ విమానంలో ఎలక్ట్రానిక్, సాఫ్ట్‌వేర్ లోపాలు, వైరింగ్ డ్యామేజ్, పవర్ సిస్టమ్ వేడెక్కడం లాంటి సమస్యలు నిరంతరం తలెత్తుతూనే ఉన్నాయని ఎఫ్‌ఏఎస్ నివేదిక స్పష్టం చేసింది.
2022, జనవరి 2022లో ‘పి100 ప్రైమరీ పవర్ ప్యానెల్’లో మంటలు చెలరేగడంతో కీలకమైన విద్యుత్ పంపిణీ వ్యవస్థ దెబ్బతిన్నదని, 2022, ఏప్రిల్‌లో ల్యాండింగ్ గేర్ ఇండికేషన్ సిస్టమ్ లోపాలతో విమానాన్ని గ్రౌండ్ చేయాల్సి వచ్చిందని ఎఫ్‌ఏఎస్ పేర్కొంది. ఈ లోపాలను సరిదిద్దేందుకు పలుమార్లు విడిభాగాలను మార్చాల్సి వచ్చిందని, అయినప్పటికీ సమస్యలు పునరావృతమయ్యాయని ఆరోపించింది. ఈ విమానమే కాకుండా, ఇతర ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానాల్లోనూ ఇలాంటి విద్యుత్ వైఫల్యాలు ఉన్నాయని ఎఫ్‌ఏఎస్ హెచ్చరించింది.
ఈ ప్రమాదంపై భారతీయ ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) విడుదల చేసిన ప్రాథమిక నివేదికలో పైలట్లదే తప్పని సూచించడాన్ని ఎఫ్‌ఏఎస్ తప్పుబట్టింది. గతంలో బోయింగ్ 737 మ్యాక్స్ ప్రమాదాల సమయంలోనూ సంస్థ ఇలాగే పైలట్లపై నిందలు వేసే వ్యూహాన్ని అనుసరించిందని గుర్తు చేసింది. బోయింగ్ 787 ప్రోగ్రామ్ షెడ్యూల్ కంటే మూడేళ్లు ఆలస్యంగా, బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చుతో నడిచిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,235 విమానాల్లో సుమారు 18 శాతం విమానాల రిపోర్టులను తాము విశ్లేషించామని ఎఫ్‌ఏఎస్ తెలిపింది. కాగా ఈ ఆరోపణలపై స్పందించేందుకు బోయింగ్ ప్రతినిధి నిరాకరిస్తూ, విచారణ బాధ్యతను ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారం భారతీయ ఏఏఐబీకే వదిలేశామన్నారు. ఈ వ్యవహారంపై అమెరికా అధికారులు తక్షణమే క్రిమినల్ విచారణ జరిపించాలని ఎఫ్‌ఏఎస్ డిమాండ్ చేసింది.
ఇది కూడా చదవండి: ఇదేం సినిమా కాదు.. ఈ లక్షణాలే ప్రాణాంతకం


