గుండెపోటు.. హఠాత్తుగా మనిషి ప్రాణాలను తీస్తుందని అంటుంటారు. అయితే అధునిక వైద్యం ఈ హఠాత్ పరిణామాన్ని ముందుగానే గుర్తించేలా చేసింది. గుండెపోటు లక్షణాలను ముందుగా గుర్తించడం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యం కారణంగా పలువురు గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. అందుకే ఛాతీలో నొప్పి అనిపించిన వెంటనే బాధితులు అప్రమత్తమై హృద్రోగ నిపుణులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇండియన్ హార్ట్ అసోసియేషన్ గణాంకాలు
శరీరంలో అత్యంత కీలకమైన అవయవం గుండె అని అందరికీ తెలిసిందే. వైద్యులు గుండె సంరక్షణ విషయంలో పలు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, వాటిని కొందరు పట్టించుకోని కారణంగా హృద్రోగ మరణాలు సంభవిస్తున్నాయి. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం ఒక్క 2020లోనే 30 నుండి 60 ఏళ్ల వయస్సు గల 19,238 మంది గుండెపోటుతో మరణించారు. 2021లో 18 నుండి 30 ఏళ్ల యువతలో 2,541 మరణాలు నమోదయ్యాయి.
సినిమాల్లో మాదిరిగా..
గుండెపోటు వచ్చినప్పుడు సినిమాల్లో చూపించినట్లుగా ఛాతీ పట్టుకుని కుప్పకూలిపోవడం లాంటిది నిజ జీవితంలో ఎప్పుడూ జరగకపోవచ్చని రాజ్ కోట్ లోని హెచ్ సిజి హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దినేష్ రాజ్ ‘హిందుస్థాన్ టైమ్స్’ ఇంటర్వ్యూలో తెలిపారు. చాలామంది గ్యాస్ ట్రబుల్ లేదా కండరాల నొప్పులు అనుకుని గుండెపోటు ప్రాథమిక లక్షణాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గుండెపోటు విషయంలో ‘టైమ్ ఈజ్ మజిల్’ (సమయమే కండర రక్షణ) అనే సూత్రం వర్తిస్తుందని, లక్షణాలను ఎంత త్వరగా గుర్తిస్తే గుండె కణజాలాన్ని అంత అధికంగా కాపాడుకోవచ్చని డాక్టర్ దినేష్ తెలిపారు.
ఒక్క ఛాతీ నొప్పి మాత్రమే కాదు..
చాలామంది అనుకుంటున్నట్లుగా గుండెపోటు నొప్పి కత్తితో పొడిచినట్లు ఉండదని, దీనికి భిన్నంగా ఛాతీలో ఏదో బరువుగా ఉన్నట్లు, లేదా ఛాతీపై ఏదో భారం మోపినట్లు అనిపిస్తుందని డాక్టర్ దినేష్ వివరించారు. ఛాతీ మధ్యలో అసౌకర్యం, నొప్పి వచ్చి పోతుండటం లేదా కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే బాధితులు అప్రమత్తం కావాలన్నారు. గుండెపోటు వస్తే కేవలం ఛాతీలోనే నొప్పి వస్తుందనేది ఒక అపోహ మాత్రమేనని ఆయన తెలిపారు. నరాల అనుసంధానం కారణంగా నొప్పి ఇతర భాగాలకు కూడా పాకే అవకాశం ఉందన్నారు.
విపరీతమైన అలసట, ఊపిరి ఆడకపోవటం..
ముఖ్యంగా ఎడమ చేయి (కొన్నిసార్లు రెండు చేతులు), దవడ,మెడ భాగం (పంటి నొప్పి లేదా గొంతు నొప్పిగా పొరబడే అవకాశం ఉంది), వీపు వెనుక రెండు భుజాల మధ్య భరించలేని నొప్పి లేదా ఇబ్బందిగా అనిపిస్తే అది గుండెపోటు లక్షణం కావచ్చని డాక్టర్ దినేష్ సూచించారు.
మహిళలు, వృద్ధులు, మధుమేహ వ్యాధిగ్రస్తులలో గుండెపోటు లక్షణాలు చాలా భిన్నంగా, సైలెంట్‌గా ఉంటాయని డాక్టర్ దినేష్ తెలిపారు. వీరిలో ఛాతీ నొప్పికి బదులుగా విపరీతమైన అలసట, ఊపిరి ఆడకపోవటం, వికారం లేదా చెమటలు పట్టడం లాంటివి వంటివి కనిపిస్తాయన్నారు. నడుము పైభాగంలో అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బందిగా అనిపించి, అది సాధారణంగా లేదనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ దినేష్ సూచించారు. ప్రాణాలను కాపాడుకునేందుకు ఇదే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: అరుదైన హృద్రోగంతో చిన్నారి మృతి.. ‘కవాసాకి’ లక్షణాలివే..


