డివిడెండ్‌ ధమాకా! | Listed companies paid Rs 5 lakh crore as dividends to shareholders in 2024-25 | Sakshi
Sakshi News home page

డివిడెండ్‌ ధమాకా!

Jun 11 2025 12:58 AM | Updated on Jun 11 2025 8:06 AM

Listed companies paid Rs 5 lakh crore as dividends to shareholders in 2024-25

2024–25లో రికార్డ్‌ 

ఇన్వెస్టర్లకు రూ.5 లక్షల కోట్లు చెల్లింపు 

వార్షికంగా 11 శాతం అప్‌

షేర్ల బైబ్యాక్‌పట్ల కంపెనీల విముఖత

లిస్టెడ్‌ కంపెనీలు దేశీయంగా వాటాదారులకు గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో రూ. 5 లక్షల కోట్లు డివిడెండ్‌గా చెల్లించాయి. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. వార్షికంగా ఇది 11 శాతం అధికం! అయితే గత ఐదేళ్లలో లేనివిధంగా గతేడాది వాటాదారులకు చెల్లింపులు నెమ్మదించడం గమనార్హం!      – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

ప్రపంచవ్యాప్త అనిశ్చితులు, మందగమన పరిస్థితుల మధ్య గతేడాది లిస్టెడ్‌ కార్పొరేట్‌ సంస్థల ఆదాయం, నికర లాభాలు మందగించాయి. అయినప్పటికీ వాటాదారులకు డివిడెండ్‌ రూపేణా లాభాల్లో వాటాను పంచడంలో సరికొత్త రికార్డ్‌ నమోదైంది. లిస్టెడ్‌ కంపెనీలు ఉమ్మడిగా గతేడాది రూ. 5 ట్రిలియన్లు డివిడెండ్‌గా చెల్లించాయి. అంతక్రితం ఏడాది (2023–24)లో వాటాదారులు అందుకున్న డివిడెండ్‌ రూ. 4.52 లక్షల కోట్లే. గతేడాది దేశీ లిస్టెడ్‌ కంపెనీల నికర లాభం(నష్టాలు, అనుకోని లాభాలను సర్దుబాటు చేశాక) 5 శాతం పైగా ఎగసి రూ. 16 లక్షల కోట్లను తాకాయి.

అంతక్రితం ఏడాది రూ. 15.21 ట్రిలియన్లుగా నమోదైంది. బీఎస్‌ఈలో లిస్టయిన 1,218 ప్రధాన కంపెనీలను పరిగణనలోకి తీసుకున్న గణాంకాలివి! గతేడాది ఉమ్మడిగా నికర అమ్మకాలు (ఫైనాన్షియల్‌ సంస్థలైతే వడ్డీ ఆదాయం) 7.5% పుంజుకుని రూ.166.4 ట్రిలియన్లకు చేరాయి. అంతక్రితం ఇవి రూ.154.83 లక్షల కోట్లు. 

బైబ్యాక్‌ల వెనకడుగు 
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)లో గతేడాది నామమాత్ర(1.2 శాతం) వృద్ధి మాత్రమే నమోదైంది. బైబ్యాక్‌లతో కలిపి వాటాదారులకు కంపెనీలు రూ. 5.08 ట్రిలియన్లు చెల్లించాయి. అంతక్రితం ఏడాదిలో ఇది రూ. 5.03 లక్షల కోట్లుకాగా.. గతేడాది షేర్ల బైబ్యాక్‌పై లిస్టెడ్‌ కంపెనీలు రూ. 8,034 కోట్లు వెచ్చించాయి. బైబ్యాక్‌లు తగ్గడంతో వార్షికంగా చెల్లింపుల నిష్పత్తి 33 శాతం నుంచి 32 శాతానికి క్షీణించింది.

అయితే గత దశాబ్ద కాలాన్ని పరిగణిస్తే లిస్టెడ్‌ కంపెనీలు బైబ్యాక్‌లు, డివిడెండ్లపై వార్షిక నికర లాభాల్లో 40 శాతం వరకూ వాటాదారులకు చెల్లించాయి. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు బైబ్యాక్‌లపై నగదు వెచ్చింపును తగ్గించడం ఇటీవల ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క ఇతర రంగాలలోని కంపెనీలు విస్తరణ కోసం నగదును కేటాయించడంతో ఇటీవల డివిడెండ్ల చెల్లింపులపై ప్రతికూల ప్రభావం పడినట్లు తెలియజేశారు.

లాభాలు ఓకే 
గత రెండేళ్లలో డివిడెండ్‌ చెల్లింపులు 7 శాతానికి పరిమితమైనప్పటికీ కంపెనీల లాభాల్లో 16 శాతం పురోగతి నమోదైనట్లు విశ్లేషకులు తెలియజేశారు. గతేడాది షేర్ల బైబ్యాక్‌పై లిస్టెడ్‌ కంపెనీలు గత 9ఏళ్లలోనే కనిష్టంగా నిధులు వెచ్చించినట్లు వెల్లడించారు. 2017–18లో అత్యధికంగా 22% నగదును బైబ్యాక్‌కు కేటాయించాయి. 2024–25లో ఇది 1.6 శాతానికి పరిమితమైంది.

దిగ్గజాల తీరిలా 
గరిష్ట డివిడెండ్లు చెల్లించే లిస్టెడ్‌ దిగ్గజాలలో టాటా గ్రూప్‌ సంస్థ టీసీఎస్‌ గతేడాది 73 శాతం అధికంగా రూ. 45,612 కోట్ల డివిడెండ్‌ చెల్లించింది. దీంతో వరుసగా రెండో ఏడాది(2024–25)లోనూ టాప్‌చెయిర్‌ను అలంకరించింది. అయితే బైబ్యాక్‌కు నో చెప్పింది. ఈ బాటలో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ రూ. 17,958 కోట్లు, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రూ. 17,828 కోట్లు వెచ్చించాయి. టాప్‌–10 జాబితాలో రూ. 17,009 కోట్లతో వేదాంతా, రూ.16,835 కోట్లతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రూ.16,331 కోట్లతో పీఎస్‌యూ దిగ్గజం కోల్‌ ఇండియా, రూ.16,290 కోట్లతో హెచ్‌సీఎల్‌ టెక్, రూ.15,411 కోట్లతో ఓఎన్‌జీసీ, రూ.14,190 కోట్లతో ఎస్‌బీఐ, రూ.12,455 కోట్లతో హెచ్‌యూఎల్‌ నిలిచాయి. వెరసి టాప్‌–10 కంపెనీలు ఉమ్మడిగా రూ. 1.9 లక్షల కోట్లు డివిడెండ్‌గా చెల్లించాయి.

Advertisement
 
Advertisement
Advertisement